పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు..
కేసీఆర్ భరోసా వచ్చే రెండు మూడు నెలల్లో దేశం మొత్తంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో అందరికీ వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసుల సంఖ్య పెరిగినా సరే ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎంతమందికైనా వైద్యం అందించేందుకు కావలసినవన్నీ సిద్ధం చేసి ఉంచామని చెప్పారు.బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ‘కొన్ని అంచనాల ప్రకారం రాబోయే రెండు, మూడు నెలల్లో దేశంలో పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. అయినా ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఎక్కువైనా, అందరికీ వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైన పీపీఈ కిట్లు, టెస్టు కిట్లు, మాస్కులు, బెడ్స్, వెంటిలేటర్లు, ఆసుపత్రులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి’ అని సీఎం ప్రకటించారు. ‘కరోనా వైరస్ సోకినా చాలా మందిలో లక్షణాలు కనిపించనందున పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్ది మందిలో మాత్రం లక్షణాలు కన్పిస్తున్నాయి. అలాంటి వారికి మంచి వైద్యం అందించాలి. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే మరింత శ్రద్ధ తీసుకుని, ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. పాజిటివ్‌గా తేలినా.. లక్షణాలు లేని వారిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రజలు కూడా లాక్డౌన్ నిబంధనలు, కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి’అని సీఎం సూచించారు.’రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా, వైద్య సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఎవరికైనా ఆరోగ్యం బాగా క్షీణిస్తే అత్యవసర వైద్యం అందించాలి’అని సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ , నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. మరణాల రేటు తక్కువే.. భయపడవద్దు.. రాష్ట్ర స్థాయి కమిటీ వివరణ కరోనా విషయంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను సీఎం, మంత్రులకు వైద్య నిపుణులు, వైద్య శాఖ అధికారులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీ వివరించింది. ‘కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైరస్ సోకిన తర్వాత కూడా 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించవు. ఇలాంటి వారికి ఎలాంటి వైద్యం కూడా అవసరం లేదని ఈ కమిటీ తేల్చి చెప్పింది. దాదాపు 15 శాతం మందిలో జలుబు, జ్వరం, దగ్గు, దమ్ము లాంటి ఐఎల్ఐ (ఇన్ఫ్లుయెంజా వంటి అనారోగ్యం) లక్షణాలు కనిపిస్తాయి. ఐఎల్ఐ లక్షణాలున్న వారు త్వరగానే కోలుకుంటారు. మిగతా 5 శాతం మందిలో మాత్రమే తీవ్రమైన శ్వాసకోస సంబంధ వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. ఈ ఐదు శాతం మందిలోనే మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ఉన్నత కమిటీ వివరించింది. కరోనా మరణాల రేటు భారత్‌లో 2.86 శాతం, తెలంగాణలో 2.82 శాతంగా ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇతరత్రా తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారే ఉన్నారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత రాకపోకలు పెరిగినా, వైరస్ వ్యాప్తి అంత ఉధృతంగా లేకపోవడం మంచి పరిణామం. కరోనా వైరస్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ కరోనాకు వ్యాక్సిన్, ఔషధం రానందున వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర స్థాయి కమిటీ సూచించింది.