అమ్మాయిల పెళ్లి వయసు పెంపు..!


కేంద్రం సంకేతం, కారణాలివే..
మహిళల వివాహ వయసును ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ల నుంచి మరింత పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీంతో పాటు మహిళల ఆరోగ్యానికి సంబంధించి పలు అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

మహిళల వివాహ వయసు,
అమ్మాయిల కనీస వయసును పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ అంశంపై 10 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లి చేయడం.. శిశు మరణాలు, మాతృ మరణాలకు ఒక కారణం అవుతున్నట్లు కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు.. పురుషులతో సమానంగా ఉన్నత చదువులు చదువుతున్న నేపథ్యంలో వివాహం ఒక అడ్డంకిగా మారకుండా.. చట్టంలో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దేశంలో శిశు మరణాలు, మాతృ మరణాలతో పాటు సంతాన సాఫల్య రేట్‌, స్త్రీ-పురుష నిష్పత్తి తదితర అంశాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్‌ను ఆదేశించింది.

మహిళలు ఏ వయసులో తల్లి అయితే ఆరోగ్యకరం అనే అంశంపై ఈ టాస్క్ ఫోర్స్ ప్రధానంగా అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం అమ్మాయిల వివాహ వయసు 18 సంవత్సరాలుగా, పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది. అంతకంటే తక్కువ వయసులో పెళ్లి జరిపిస్తే వాటిని బాల్య వివాహాలుగా పరిగణించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని ఎంతకు పెంచాలనేదానిపై టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ జులై 31కల్లా నివేదిక ఇవ్వనుంది.

ఢిల్లీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకురాలు జయా జైట్లీని ఈ టాస్క్ ఫోర్స్ కమిటీకి అధ్యక్షురాలిగా నియమించారు. నజ్మా అఖ్తర్‌ (ఢిల్లీ), మహారాష్ట్రకు చెందిన వసుధా కామత్‌, గుజరాత్‌కు చెందిన దీప్తీ షా ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌, కేంద్ర వైద్య, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, న్యాయశాఖల కార్యదర్శులు పదవి రీత్యా ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు.

కేంద్రం గురువారం (జూన్ 4) ఈ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ శనివారం జారీ చేసిన పత్రికా ప్రకటన ద్వారా ఈ విషయం వెల్లడైంది. వాస్తవానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రసంగంలోనే దీనిపై ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగా ఈ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

‘చివరిసారిగా 1978లో మహిళల వివాహ వయసును 15 నుంచి 18 ఏళ్లకు పెంచారు. శారదా చట్టం-1929లోని నిబంధనలను సవరించి ఈ మార్పు చేశారు. 1978 నుంచి నేటి వరకు భారత్‌ ఎంతో పురోగమించింది. మహిళలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీంతో పాటు మాతృ మరణాలను తగ్గించాల్సి ఉంది. మహిళల పౌష్టికాహార స్థాయిని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మహిళ ఏ వయసులో మాతృత్వంలోకి అడుగుపెట్టాలనే అంశంపై అధ్యయనం చేయాల్సి ఉంది. అందుకోసం 6 నెలల్లో సిఫార్సులు చేసేలా ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం’ అని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పారు.

టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేయనున్న అంశాలివే..
మహిళల వివాహ వయసు, మాతృత్వానికి మధ్య ఉన్న సహ సంబంధాన్ని టాస్క్ ఫోర్స్ తన అధ్యయనంలో పరిశీలిస్తుంది. ఈ రెండు అంశాలతో ముడిపడిన ఆరోగ్యం, వైద్యపరమైన సమస్యలపై దృష్టి సారిస్తుంది. గర్భధారణ సమయంలో తల్లీపిల్లల పౌష్టికాహార స్థాయి, కాన్పుల సమయంలో తలెత్తుతున్న సమస్యలను అధ్యయనం చేస్తుంది. దీంతో పాటు శిశు మరణాలు, మాతృ మరణాలు, సంతాన సాఫల్య రేట్‌, స్త్రీ-పురుష నిష్పత్తి తదితర అంశాలపై దృష్టి సారిస్తుంది.

అమ్మాయిల్లో ఉన్నత విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడానికి టాస్క్ ఫోర్స్ తగిన సూచనలు చేయనుంది. ఇందుకోసం కొత్త చట్టం తేవాల్సిన అవసరం ఉందా? లేకపోతే.. ఉన్న చట్టాలకు సవరణలు చేస్తే సరిపోతుందా? అనే అంశంపై సమగ్ర పరిశీలన చేస్తుంది. సిఫార్సుల అమలు సాధ్యాసాధ్యాలపై వివరాలతో పాటు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది.

About The Author