కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సహాయం అందించిన సీఎం కేసీఆర్
రూ. 5కోట్ల చెక్కు, ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందజేత
గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇవాళ రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ సూర్యాపేట వెళ్లారు. చైనా సైనికులో దాడిలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు చిత్రాపటానికి పుష్ప నివాళి అర్పించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్.. కల్నల్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ వీరయోధుడి కుమారుడు, కుమార్తెను కూడా పలుకరించారు. సంతోష్ భార్య సంతోషి, తల్లితండ్రులతోనూ సీఎం కేసీఆర్ కాసేపు ముచ్చటించారు.
కల్నల్ సంతోష్ భార్య సంతోషితో మాట్లాడిన కేసీఆర్.. ఆమెకు గ్రూప్ వన్ జాబ్ అపాయింట్ ఆఫర్‌ను అందజేశారు. అంతేకాకుండా కుటుంబానికి అయిదు కోట్ల రూపాయల చెక్‌ను కూడా అందజేశారు. షేక్‌పేటలో 700 గజాల ఇంటి స్థలాల పత్రాలను కూడా సీఎం కేసీఆర్.. కల్నల్ సంతోష్ కుటుంబానికి అందజేశారు. ఆర్థిక సాయంతో పాటు గ్రూప్ వన్ జాబ్ ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కల్నల్ సంతోష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అయిదు కోట్ల ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించింది.
సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ నివాసానికి వెళ్లిన వారిలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు.