జిల్లేడు పూల విశిష్టత…
జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు.
ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాధిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట. శ్వేతార్క మూలాన్ని వెలికి తీసి, మట్టిని కడిగివేసి, నీళ్లలో నానబెట్టి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆ వేళ్ల మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క ఇంటిలో ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయని, ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్పభ్రావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి.
అయితే, ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అంటారు. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్య్రం అంటే ఏమిటో తెలీదని శాస్త్రం చెబుతోంది. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది.
నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలోగాని, వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం గాని, శ్వేతార్క వేరుని తాయిత్తులలో ధరించటంగాని చేస్తే శుభప్రదం. ఎవరైతే శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి.
జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు పండితుల్ని, పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. కుదరని పక్షంలో వినాయక చవితి çరోజున ఈ శ్వేతార్క గణపతిని ప్రతిష్టించి పూజ చేసుకోవాలి