శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం

తిరుపతి:శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని  మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు ఆల‌య ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.రాత్రి 7.00 గంట‌లకు ఆల‌య ముఖ మండ‌పంలో స్వామివారిని పెద్ద‌శేష వాహ‌నంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. అదేవిధంగా రెండో రోజు శుక్ర‌వారం హనుమంత వాహనంపై, మూడో రోజు శ‌నివారం గరుడ వాహనంపై స్వామివారు వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వ‌హిస్తారు.క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఏకాంతంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, వాహ‌న సేవ‌లు, ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ య‌ల్ల‌ప్ప‌, ఏఈవో శ్రీ కె.ధ‌నంజ‌యుడు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగల్రాయులు, శ్రీ రమణయ్య  పాల్గొన్నారు.

About The Author