మానవత్వం ముంగిట తలవంచిన కరోనా.. పోలీసులే ఆప్త మిత్రులై కొనసాగించిన దహన సంస్కారాలు..


కరోనా విలయతాండవం చేస్తున్న వేళా పరిమలించిన మానవత్వం.. కుమారుడికి కరోనా వైరస్ సోకిందనే మనోవ్యధ తో గుండెపోటుకు గురై 68 ఏళ్ల వృద్ధుడు మరణించగా ఆ తర్వాత కొంత సేపటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని కుమారుడు సైతం ప్రాణాలొదిలిన ఘటన నగరి ఏకాంబరకుప్పం లో మంగళవారం చోటు చేసుకుంది. చుట్టుపక్కల బంధువులున్నా కరోనా భయంతో కనీసం చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. ఈ విషయం చిత్తూరు ఎస్.పి శ్రీ ఎస్.సెంథిల్ కుమార్, IPS గారి దృష్టి కి రాబడి ఎస్.పి గారి ఆదేశానుసారం నగరి ఇన్స్పెక్టర్ శ్రీ కె.మద్దయ్యాచారి చొరవ తీసుకోని తన సిబ్బంది తో వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు.
వివరములు – కో- ఆప్టెక్స్ సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన 68 ఏళ్ల వృద్ధుడు ఏకాంబరకుప్పం లో చిన్నపాటి జిరాక్స్ షాపు నడుపుకుంటూ షాపు పై భాగాన గల గదిలో ఒంటరిగా ఉంటున్నారు. అతని భార్య గతంలోనే మరణించగా కుమారుడు, కోడలు పక్క వీధిలో నివాసముంటున్నారు. ప్రైవేటు వాహనాల్లో డ్రైవర్గా పనిచేసే కుమారుడికి వారం రోజుల క్రితం కరోనా సోకడంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసి తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత కొంత సేపటికి కుమారుడు కూడా ఆస్పత్రిలో మరణించాడు. కరోనా భయంతో వృద్ధుడి మృతదేహాన్ని చూసేందుకు కూడా బంధువులు ఎవరూ రాకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాలని వృద్ధుడి బంధువులకు పోలీసులు సూచించగా ఎవరు ముందుకు రాలేదు. దీంతో పోలీసులే ఆత్మబంధువులు అయ్యారు. సీఐ మద్దయ్య ఆచారి నేతృత్వంలో మృతదేహాన్ని కిందకు దించి స్మశాన వాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు. కరోనాతో మరణించిన కుమారుడి మృతదేహం రుయా ఆస్పత్రిలోనే ఉంచారు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి మృతదేహాన్ని ఖననం చేయాల్సి ఉంది అని ఇన్స్పెక్టర్ గారు తెలిపారు.

About The Author