ఏపీలో పింఛన్‌ తీసుకునేవారికి జగన్ సర్కార్ శుభవార్త..

ఏపీలో పింఛన్‌దారులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆగ‌స్టు నుంచి పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం పింఛన్‌దారుల‌కు నెల‌కు రూ.2,250 వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది. పింఛన్ డబ్బును ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చారు. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేపట్టి ఏడాది పూర్త‌ికావడంతో.. ఆగ‌ష్టు నుంచి పెన్ష‌న్ మొత్తం పెంచుతున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మ‌హిళ‌ల‌కు ఈ పెన్ష‌న్‌ని గ్రామ‌, వార్డు వాలంటీర్లు అందజేయనున్నారు.మరోవైపు పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న 5 రోజులకే పింఛన్‌ మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 1వ తేదీ నుంచి శ్రీకారం చుట్టింది. అర్హులందరికీ పింఛన్లు అందాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆదేశాల మేరకు అధికారులు ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రక్రియ ఇకపై నిరంతరం కొనసాగుతుంది. కొత్త దరఖాస్తులను పరిశీలించి వారు అర్హులుగా తేలితే కేవలం 5 రోజుల్లో పింఛన్‌ మంజూరు చేస్తారు. ఆ మరుసటి నెల నుంచి లబ్ధిదారునికి ఆ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. ఈ నూతన విధానం ద్వారా పింఛను దరఖాస్తుదారుడు మండలాఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు.గ్రామ సచివాలయంలో దరఖాస్తు ప్రక్రియ మొదలై, తిరిగి సచివాలయాల ద్వారానే మంజూరు పత్రాలు అందజేస్తారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈఓ రాజాబాబు కొత్తగా పింఛన్ మంజూరులో వివిధ దశల ప్రక్రియను వివరించారు.

About The Author