మా పాముల గోడు కాస్త వినండి.. !
ఓ నాగ భక్తులారా, మా పాముల గోడు వినండి ! మాకు మీ పాలూ, పలహారాలు వద్దు !! అవి మేము జీర్ణం చేసుకోలేమండీ !
మీరు మాకు భక్తితోనో, బలవంతంగానో పాలు పోస్తే ఆ పాలను అరిగించుకో లేక (జీర్ణించుకో లేక) మేము చస్తాం !!
దయచేసి మాకు పాలు పోయకండి, పలహారాలూ వేయకండి. మీరు పెట్టే పలహారాలు కూడా మేము తినే తిండి కానేకాదు. అందుకే మీ ఆహారాన్ని మీరే, మా పుట్టలపైనో, పుట్టలలోనో వేసి వృధా చేయకండి ప్లీజ్ !!!
మేము శాకాహారులం కాదండీ. మీ జొన్న పేలాలూ, ఇతర ప్రసాదాలు మేము తినలేము. మేము పక్కా మాంసాహారులం. మాకు ఇష్టమైన ఆహారం. ఎలుకలు, కప్పలు, ఉడతలు, తొండలు, పక్షులు ఏవీ దొరక్కపోతే మాలోని ఇతర పాములను కూడా తినేస్తాం. చాన్స్ దొరుకుతే ఇతర చిన్న చిన్న జంతువులనూ మింగేస్తాం..
మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో మా ఇంట్లోకి (అదే మా పుట్టలలోకి) పసుపూ, కుంకుమలను కూడా వేస్తారు. కాని మీరు పై వేసే పసుపూ, కుంకాలు మాకు డస్ట్ ఎలర్జీని కలిగిస్తాయి.. వాటితో కలకలిసి పోయిన గాలిని పీలుస్తే, పీల్చడానికి మాకు స్వచ్ఛమైన గాలి కరువై ఊపిరాడక మేము చస్తాం. అందుకే మాపై పసుపూ కుంకాలు వేయకండి, ప్లీజ్..
మేము పాలు తాగము.. పాలను నోటితో పీల్చుకోవడం మాకు తెలియనే తెలియదు. అసలు పాలు తాగడం మా సహజ లక్షణం కాదని మీకు తెలుసా ? మా పూర్వీకులు ఈ భూమ్మీద జీవించినపుడు, పాలు ఇచ్చి, తమ పిల్లలను పోషించే “క్షీరద జంతువులే” ఈ భూమ్మీద ఆవిర్భవించ లేదంట..
మాకు సరిపడా నీరు మేము తీసుకునే ఆహారంలోనే ఉంటుంది. మాకు నీరు, పాల లాంటి ఇతర ద్రవ పదార్థాలు తీసుకునే అవసరం ఉండదు. అందుకే ద్రవపదార్థాలను పీల్చుకోవడానికి అవసరమైన, అనువైన దవడల నిర్మాణం మా నోటిలో ఉండదు. మేమే కావాలని ప్రయత్నించినా ఎలాంటి ద్రవ పదార్థాలను పీల్చుకోలేము..
మీరు మాకు బలవంతంగా పాలు పట్టిస్తే ఆ పాలు మా పొట్టలోకి పోయి, అవి అరగక (జీర్ణం కాక) మేము ఎంతో భాదను అనుభవిస్తూ విల విలలాడుతూ, చివరికి చచ్చిపోతామని మీకు తెలుసా ?
మీరనుకోవచ్చు…
సినిమాల్లో, సీరియల్స్ లో పాములు పాలు తాగుతాయి కదా అని.. కానీ అదంతా డైరెక్టర్ గారి అతి తెలివితో జరిగేదే కాని వాస్తవం కాదు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో చేసే గ్రాఫిక్స్ మాయాజలం లేదా కెమెరా టెక్నిక్స్, వాడి మేము పాలు తాగుతున్నట్టు అసాధ్యమైన ఫీట్లను మీకు చూపిస్తారు, వాటిని నమ్మకండి..
అంతెందుకు..
పాముల వాడి దగ్గర బందీ అయి ఉండే మా పాము సోదర, సోదరీ మణులకు.. ఆ పాములు వాడు, మీ మెప్పు కోసం బలవంతంగా ఒక గొట్టం ద్వారా, పాలు పోస్తాడు. (ఇక ఆ తర్వాత మా వాళ్ళ పని ఐపోయినట్టే..) కాని మాకు మేముగా పాలు పీల్చుకోము, తాగము. నీళ్ళు తాగాము..
ఎక్కడో అడవుల్లో, పుట్టల్లో, కలుగుల్లో ఎలుకలు, కప్పలు, ఉడుతలు, పక్షులు తిని హాయిగా నివసించే మమ్మల్ని.. పాలు పోసి, పలహారాలు వేసి, పసుపు కుంకాలు చల్లి.. ఇలా పండగల పేరుతో మీరు, మమ్మల్ని హించడం మీకు భావ్యమా ?
అసలు మమ్మల్ని శివుడి మెడలో వేసిందెవరో తెలియదు గాని, ఆ రోజు నుండి మా చావుకొచ్చింది..
సాధారణంగా మేం బయట కనబడితే కర్రపుచ్చుకొని మమ్మల్ని చావగొట్టే మీరు, పండగలొస్తే చాలు, మాపై ఎంతో భక్తి ఒలకబోస్తారు. ఆ సందర్భాలలో, మమ్మల్ని మీరు భక్తి పేరుతో, పూజల పేరుతో, మాకు హానీచేసే పదార్థాలనే, మా కోసం సమర్పింస్తూ (మీకు తెలియకుండానే మమ్మల్ని హింసిస్తూ) ఉండడం చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి మాది..
మాకు తెలియక అడుగుతున్నాము, మీరందరూ మమ్మల్ని దేవతలుగా కొలుస్తూ, మా పైన కొత్త, కొత్త సీరియల్స్, సినిమాలు తీస్తారు ! చాలా గొప్పగా చిత్రీకరిస్తారు !!
కానీ పొరపాటున ఎక్కడైనా మీ ఇంటి పరిసరాల్లో మాలో ఏ ఒక్కరు కనిపించినా చంపే వరకు వదిలిపెట్టరు కదా ! అదేం మెంటాలిటీ మీది ? ఎందుకని అలా చేస్తారు ? అసలు మీరు మాకు నిజమైన భక్తులేనా ? లేక మాకు భయపడి ఉత్తిత్తి భక్తులుగా నటిస్తున్నారా ?
మీకు ఇంకో విషయం తెలుసా ? మాకు ఎవ్వరినీ పగ బట్టే స్వభావం అసలు లేదు.. మా మెదడు అసలు మేము నివాసముండే మా ఇల్లునే గుర్తు పెట్టకోదు.. ఇక మిమ్మల్నేం గుర్తుంచుకుంటాం మరి ? ఇదంతా మా జాతి పైన ఎవరో అల్లిన కట్టుకథల వల్లనే.. మేం ఎవరినీ పగబట్టేది లేదు, వెంట బడి ఎవర్నీ చంపేది లేదు. అలా మిమ్మల్ని పగబట్టేంత గా మా మెదడు ఎదగలేదు. మిమ్మల్ని మేం పైగా పట్టడం అనే దాంట్లో ఏమాత్రం నిజం లేదు నమ్మకండి ! కాబట్టి మా “పాము పగ అబద్ధం” అని తెలుసుకోండి !!
ఇక పాముల వాడు ఊదే నాగ స్వరానికి మేము నాట్యం చేయడం అనేది కూడా అబద్దమే ! ఎందుకంటే వాడు ఊదే నాగస్వరం మాకు ఏమాత్రం వినపడదు, ఎందుకంటే మాకు బండ చెవుడు !
అసలు ఏదైనా వినడానికి మాకు చెవులుంటే కదా ? పాముల వాడు, వాడి బూరతో మాపై ఏ వైపు నుండి దాడి చేస్తాడోనని భయపడి చస్తూ.. వాడి బూర ఏ వైపు కదిలిస్తే (ఊపుతే) మా ఆత్మ రక్షణ కోసం, మేం కూడా ఆ వైపుకే కదులుతాం (ఊగుతాం). కాబట్టి మేము అటూ ఇటూ ఊగుతూ మా తలను ఆడిస్తూ ఉంటే, దాన్నే మీరు మేం నాట్యం చేస్తున్నాం అని అనుకుంటారు..ఇక మేం మీకు విన్నవించుకో దలుచుకున్న విషయం ఏంటంటే..ఈ ప్రకృతిలో మీకు జీవించే హక్కు ఎంతైతే ఉందో, అలా జీవించే హక్కు మాకు కూడా ఉంది. ఈ రోజు మాకు పాలు పోసి తమ భక్తిని ప్రదర్శించే వాళ్ళలో గొప్ప చదువులు చదువుకున్న టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, సైంటిస్ట్ లు మొదలైన వారు ఉన్నారు.మీ అందరికీ మేము చెప్పేది ఒక్కటే.. మాకు పాలు పోసి, మమ్మల్ని చిత్ర హింసలకు గురి చేయకండి.మీ భావితరాలకు మా గురించి, మా మనుగడ గురించి, మా వల్ల కలిగే పర్యావరణ సమతుల్యత గురించి గొప్పగా అర్థమయ్యే విధంగా చెప్పండి. అది చేస్తే చాలు. మీరు మాకు సహకరించి నట్టే, మాకు గొప్ప మేలు చేసినట్టే..
మేం ఎవరినీ కావాలని కరవం, కాటువేయం (కుట్టం), మిమ్మల్ని అకారణంగా కరిస్తే మాకేంటి లాభం ? మాకు ఉండే ఆ కొద్ది పాటి విషాన్ని మా ఆహార సంపాదన కోసమే వాడుకుంటాం. అంతే గాని మా విషాన్ని అనవసరంగా మేమే వేస్ట్ చేసుకొని, తినే జంతువులను వేటాడ లేక పస్తులుంటామా ఏంటి ?
అదే విధంగా మాకు ఆహారం దొరక్క ఏ కప్పనో, ఎలుకనో వెతుక్కుంటూ.. పొరపాటున మీ పరిసరాల వైపు మేము గనుక వస్తే.. మమ్మల్ని చంపకండి, వీలైతె మమ్మల్ని ప్రాణాలతో తీసికెళ్ళి, మాకు అనువైన ప్రదేశాలలో వదిలేసి, మీకు మా పట్ల ఉన్న నిజమైన భక్తిని, ప్రేమను చాటు కోండి.. లేదంటే, మాకు దారి వదిలి, మమ్మల్ని వెళ్ళనిస్తే.. మీకు ఏ హానీ తలపెట్ట కుండా, మా మానాన మేమే పోతాం !మీ మనుషుల మధ్య బ్రతుకు తున్నందుకు, మాకు మేం గర్వంగా భావించే రోజు ఒకటి వస్తుందనీ, మేము గర్వంగా చెప్పుకునేలా మీరు ప్రవర్తిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.. !
ఇక మీ మేలు కోరి చివరిసారిగా, మీకు ఒక హెచ్చరిక చేయ దలుచు కున్నాము. అదేంటంటే..మాకు పాలు పోసినా, మమ్మల్ని పట్టి ఆడించినా లేదా మమ్మల్ని ఇతరత్రా హింసలకు గురి చేసినా.. అది మీ ప్రభుత్వం ఆమోదించిన, “వన్య ప్రాణుల సంరక్షణ చట్టం” కింద నేరమౌతుంది. మమ్మల్ని హింసిస్తే, మీ అటవీ శాఖ అధికారులు, మీ పై కేసులు పెడతారని తెలుసుకోండి. కాబట్టి అనవసరంగా మాజోలికి రాకండి, అలా మా జోలికి వచ్చి మీరు జైలు పాలుగాకండి !’
ఇట్లు
సమస్త పాముల జాతులు..
మిత్రులారా ! పండగల పేరుతో జీవ హింస చేయడం నేరమే కాదు అది ఒక అమానవీయ చర్య. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించటం కోసం మనమంతా ప్రయత్నిద్దాం..
ధన్యవాదాలు..
— Rajeshwer Chelimela