తిరుపతిలో చోటుచేసుకున్న ఘటన శానిటైజర్ మరణాలు

మద్యానికి బానిసైన వారు తక్కువ ధరకు వస్తుందనే కారణంతో వీటిని తాగుతుండటం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఇలాంటి ఘటనల వల్ల 12 మంది చినిపోయిన సంగతి తెలిసిందే. వీటిని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ఘటనలు పునరావృతం కావడం విశేషం.తిరుపతి స్కేవెంజర్స్ కాలనీలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసికొంది. సానిటైజర్ తాగి నలుగురు చనిపోయారు. మృతులు స్కేవెంజెర్ కాలనీకి చెందిన కార్మికులు వీరయ్య, వెంకట రత్నం, కుమార్, శ్రీనివాసులుగా గుర్తించారు.

దీంతో కాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా, ఇటీవలే ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో శానిటైజర్‌ను సేవించిన 12 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా శానిటైజర్ అమ్మకాలు, బెల్టుషాపులు, నాటుసారా తయారీ కేంద్రాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాలను గుర్తించారు. శానిటైజర్లు తాగుతున్న144 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. శానిటైజర్ తయారీ కేంద్రాల లైసెన్స్ లను పరిశీలించి హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా శానిటైజర్లను తయారు చేస్తున్న 76 మందిపై ఎస్‌ఈబీ అధికారులు కేసులు నమోదు చేశారు.

ప్రతి జిల్లాలో ఇలాంటి వ్యక్తులు పదుల సంఖ్యలో ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరంతా మత్తు కోసం శానిటైజర్లు తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందరినీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు గత మూడు నెలలుగా శానిటైజరు తీసుకుంటున్నట్లు అధికారులు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. అలాగే, ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎంతమంది దీనికి అలవాటుపడ్డారనే దానిపై నిఘా పెట్టారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దొరక్క కొందరు.. మద్యం ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాటిని కొని తాగలేక మరికొందరు శానిటైజర్లకు అలవాటుపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ వ్యాపారం కోసం కొందరు మెడికల్‌ షాపు నిర్వాహకులు వాటిని అమ్ముతున్నారనేఆరోపణలువినిపిస్తున్నాయి.

About The Author