రూ.కోట్లకు పడగెత్తిన ఖజానా శాఖ ఉద్యోగి
బయటపడిన అక్రమ సంపాదన
పట్టుబడిన బంగారం,వెండిఆభరణాలు
అతనోచిరుద్యోగి.. కారుణ్య నియామకం ద్వారా 15 ఏళ్ల కిందట ఉద్యోగంలో చేరాడు.. విధుల్లో చేరిన కొన్నాళ్లకే అక్రమాల బాట పట్టాడు.. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు.. దందాలు, బెదిరింపులకు పాల్పడి రూ.కోట్లకు పడగెత్తాడు.. చివరికి పోలీసుల వలలో పడ్డాడు.. ఇదీ ఖజానా శాఖలో సీనియర్ అకౌంటెంట్ మనోజ్‌కుమార్ నేరాల చిట్టా..!
అనంతపురం జిల్లా, న్యూస్ టుడే: అనంతపురానికి చెందిన మనోజ్‌కుమార్ ఖజానా శాఖలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు.
అనతి కాలంలోనే రూ.కోట్లు కూడబెట్టాడు. ఇతడి తండ్రి హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ చనిపోయారు. దీంతో కారుణ్య నియామకం కింద మనోజ్‌కు 15 ఏళ్ల కిందట జిల్లా ఖజానాశాఖ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంటుగా ఉద్యోగావకాశం కల్పించారు. తొలిరోజుల్లో కార్యాలయానికి పాత సైకిల్‌పై వచ్చేవాడు. రెండేళ్లల్లోనే పూర్తిగా మారిపోయాడు. దొంగ బిల్లులు రాయడం, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడం, పదవీ విరమణ ఉద్యోగుల బిల్లులు రాయడం వంటివి ప్రారంభించాడు. ఇలా అక్రమ సంపాదన మొదలు పెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎదిగాడు. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేశాడు. రెండు గుర్రాలను పోషిస్తున్నాడు. వీటిపై నిత్యం స్వారీ చేస్తున్నాడు. ముగ్గురు బాడీగార్డులను పెట్టుకున్నాడు.
రూ.3 కోట్లకుపైగా ఆస్తుల గుర్తింపు
బుక్కరాయసముద్రంలో పోలీసులు పట్టుకున్న బంగారు, వెండి ఆభరణాల విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ.1.82 కోట్లుగా తేల్చారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు, నగదు నిల్వలు రూ.91,15,000గా గుర్తించారు. మొత్తం రూ.2.73 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటిదాకా పోలీసులు గుర్తించారు. వీటికితోడు వాహనాల విలువ రూ.55 లక్షలు ఉండవచ్ఛు ఒక సాధారణ ఉద్యోగి 15 ఏళ్లలో రూ.3 కోట్లకు పైగా సంపాదించడం సాధ్యమా అన్న ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. లంచం రూపంలో వసూలు చేసినా ఆయన విలాసవంత జీవనానికే సరిపోతోంది. ఆయన వెంట 10 మంది యువకులు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తున్నాడంటే అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్ఛు ఎవరికైనా మనోజ్‌కుమార్ బినామీగా ఉన్నాడా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇతడి వద్ద ఉన్న గుర్రాలపై గతంలో ఓ పోలీసు అధికారి సవారీ నేర్చుకునేవాడని చెబుతున్నారు. ఆయనతో పరిచయాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఇద్దరు కలసి పంచాయితీలు చేశారా? అనే సందేహాలు ఉన్నాయి.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు
ఓ స్వామీజీకి భక్తుడు
మరోవైపు వెండి సామగ్రి పరిశీలిస్తే.. వాటిని ఆశ్రమాల్లో ఉపయోగించేలా ఉన్నాయి. దీంతో ఎవరైనా స్వామీజీకి చెందిన ఆభరణాలు అయి ఉండవచ్చని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిందితుడు జిల్లాకు చెందిన ఓ స్వామీజీకి భక్తుడిగా చెబుతున్నారు. పోలీసులు ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. అలాగే తాడిపత్రి, బెంగళూరు, హైదరాబాద్‌లలో నివాస స్థలాలు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ వ్యక్తిని బెదిరించి కొంత భూమిని రాయించుకున్నాడని సమాచారం. రికార్డుల పరిశీలన, దస్త్రాలు తయారు చేయడంలో నైపుణ్యం ఉంది. బుక్కరాయసముద్రం సమీపంలో ప్రస్తుతం లీజుకు తీసుకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమికి కూడా ఇతని బినామీ ఆస్తిగా తెలుస్తోంది.