ఆప్కాస్ లో కలపొద్దు.. మా కడుపులు కొట్టొద్దు…


20వ రోజుకు చేరిన ఔట్సోర్సింగ్ కార్మికుల నిరసన దీక్షలు

టిటిడినే నమ్ముకుని పదేళ్ల నుండి 20 ఏళ్ల వరకు పని చేస్తున్న తమకు టైం స్కేల్ ఇవ్వకుండా ఆప్కాస్ లో కలిపి తమ కడుపులు కొట్టవద్దని ఔట్సోర్సింగ్ కార్మికులు కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద చేపడుతున్న నిర‌స‌న దీక్షలు శనివారం 20వ రోజుకు చేరుకున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణ, శ్రీవారి నామాలు ధరించి నిరసనదీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఎం. నాగార్జున మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కార్మికుల్లో ఎక్కువ మంది తిరుపతి, పరిసర ప్రాంతాలకు చెందిన వారేనని, స్వస్థలం కావడంతో జీతాలు తక్కువైనా ఇక్కడే ఉండి కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. APCOSలో విలీనం చేయడం వల్ల టీటీడీ సంస్థకు గానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గానీ కలిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు. సెస్సు రూపంలో టిటిడికి అదనంగా సంవత్సరానికి దాదాపు మూడు కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. టీటీడీకి ఆర్థిక పరిపుష్టి కలిగిన తర్వాత దశలవారీగా టైం స్కేల్ వర్తింపచేయాలని కోరినా యాజమాన్యం ఖాతరు చేయడం లేదన్నారు. టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘంప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌రికృష్ణ‌ మాట్లాడుతూ సీఎం గారు అర్హత కలిగిన వారికి మూడు నెలల్లోనే టైం స్కేల్ ఇస్తానని చెప్పి, ఇప్పుడు ఆప్కాస్ లో విలీనం చేయడం తగదన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సమష్టిగా పోరాడాలని, అందరూ కలిసి రావాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు హరిప్రసాద్, కోశాధికారి నవీన్ కుమార్‌, ఉపాధ్యక్షుడు జి.హరికృష్ణ, నాయకులు బిడ్డల రూప్ కుమార్, నిరంజన్, టిటిడిలోని ప్రెస్‌, అన్న‌దానం, ఉద్యాన‌వ‌న‌, హాస్ట‌ళ్లు, మ్యూజియం, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లు, టైపిస్ట్ సొసైటీల‌కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

జారీ చేసిన‌వారు
హ‌రికృష్ణ‌
ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,
టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం.

About The Author