శేషాచలం లో వన్యప్రాణుల ను వేటాడు తున్న ఇద్దరి అరెస్ట్ : నాటు తుపాకీ స్వాధీనం
ఎర్ర చందనం స్మగ్లర్లు కోసం కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ కు అడవి జంతువులను వేటాడుతున్న ఇద్దరు వేట గాళ్లు చిక్కారు. వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, మందు గుండు సామగ్రి, వంట చేసుకునేందుకు అవసరమయ్యే పాత్రలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రెండు మద్యం బాటిళ్లను కూడా వారి వద్ద లభించాయి. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్య ఆదేశాల మేరకు ఆర్ ఎస్ ఐ లింగాధర్, ఎఫ్ బి ఓ జానీ బాషా బృందం చా మల రేంజ్, వెల్లంపల్లి రిజర్వు ఫారెస్టు లో మంగళవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టగా, బుధవారం ఉదయం భాకరాపేట కు చెందిన మధు (45), ఎల్లమ్మగుడి బండ కు చెందిన రమణయ్య (48) తారస పడ్డారు. వీరి నుంచి నాటు తుపాకీ, మందు గుండు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉండగా, వారిలో ఒకడి పేరు సాంబయ్య అని విచారణ లో తెలిసింది. వీరి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. పట్టు బడిన వారిపై కేసు నమోదు చేసిన సి ఐ సుబ్రహ్మణ్యం, జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.