జగన్ సర్కార్ కి కొడాలి గండం… ఏపీ ప్రభుత్వం త్వరలో కూలనుందా?


రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ.. సొంత పార్టీ నేతల కుమ్ములాట వల్లనో, ప్రత్యర్థి పార్టీల ఎత్తుల వల్లనే అనూహ్యంగా అధికారం కోల్పోవచ్చు. లేదా ఇక ఈ పార్టీ పని పనైపోయింది అనుకున్న పార్టీ.. అనూహ్యంగా పుంజుకుని అధికారంలోకి రావొచ్చు. ఇలా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఇలాంటి ఊహించని పరిణామం త్వరలో ఏపీలో చోటుచేసుకోనుందా అంటే.. ఒక సెంటిమెంట్ బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది.

గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం ఎప్పుడూ లేదు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి అదే సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుంది. ఆ సెంటిమెంట్ నుండి ఎన్టీఆర్ కూడా తప్పించుకోలేకపోయారు. 1955 లో గుడివాడ నుండి గెలిచిన దళిత ఎమ్మెల్యే వేముల కూర్మయ్యకి ప్రకాశం పంతులు కేబినెట్ లో స్థానం కల్పించారు. కానీ, ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఎన్టీఆర్ కూడా 1983 లో గెలిచి ముఖ్యమంత్రి అయినా 1984 లో నాదెండ్ల భాస్కరరావు కారణంగా ముఖ్యమంత్రి పీఠానికి దూరమయ్యారు. ఇక, 1985 లో హిందూపురం, గుడివాడ నుండి పోటీ చేసి రెండు చోట్లా గెలిచిన ఎన్టీఆర్.. సెంటిమెట్ తో గుడివాడని వదిలేసుకున్నారు. 1989 లో గుడివాడ నుండి గెలిచిన కటారి ఈశ్వర్ కుమార్ ని చెన్నారెడ్డి కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఆయన ప్రభుత్వం కూడా పూర్తికాలం లేదు. ఇలా గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

గుడివాడ నుండి ప్రస్తుతం కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జగన్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే, 151 ఎమ్మెల్యేలతో మాకు తిరుగులేదు అనుకుంటున్న అధికార పార్టీని ఇప్పుడు గుడివాడ సెంటిమెంట్ వెంటాడుతోంది. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆ సెంటిమెంట్ ని మరింత బలపరుస్తున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హిందూ దేవాలయంపై దాడులు, హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు పెరిగిపోయాయి. దీంతో హిందువుల్లో అసంతృప్తి మొదలైంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు.. తిరుమలలో అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని అధికార పార్టీ చెప్పటం హిందువుల ఆగ్రహానికి కారణమైంది. ఇది చాలదు అన్నట్టు కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల ఆగ్రహాన్ని పదింతలు పెంచారు. ఎక్కడా లేని రూల్ తిరుమలలో ఎందుకు?, దేవుడి బొమ్మ చెయ్యి విరిగితే ఏమన్నా నష్టమా?, రథం కాలిపోతే ఏమైంది ఇంకొకటి చేపిస్తున్నాంగా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారాన్ని రేపాయి. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని హిందూ సంఘాల నుండి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నిరసన సెగలు కొడాలి నాని మంత్రి సీటుకే కాదు, అసలు పార్టీ అధికారానికే ఎసరు పెట్టినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే కొడాలి నాని వ్యాఖ్యల మూలంగా ఆ స్థాయిలో ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి.

తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీని కొన్ని విషయాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలే సీఎం జగన్ మెడకి కేసులు కత్తి వేలాడుతూ ఉంటుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణల కేసులో 16 నెలలు జైలులో ఉన్న ఆయన.. మరోసారి జైలుకి పోయే అవకాశం లేకపోలేదు. మరోవైపు, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాలలో అధికారంపై కన్నేసింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాని ఆకర్షించి అధికారం చేపట్టిన బీజేపీ.. ఏపీలోనూ అలాంటి ఎత్తులు వేసే అవకాశం లేకపోలేదు. దానికితోడు బీజేపీపై హిందూ పార్టీగా ముద్ర ఉంది. ఇప్పుడు వైసీపీ హయాంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు బీజేపీకి ఎంతోకొంత కలిసొచ్చే అవకాశముంది. ఇప్పటికిప్పుడు బీజేపీ ఏపీలో ఏదైనా ఎత్తు వేసినా.. జగన్ ఎదిరించి నిలబడే సాహసం చేయకపోవొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలచుకుంటే ఆయనను మళ్ళీ  కృష్ణ జన్మ స్థానానికి పంపడం చిటికెలో పని. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వైసీపీని వెంటాడుతున్న కేసులు, బీజేపీకి ఉన్న అవకాశాలు.. వీటిని బట్టి చూస్తుంటే ఏపీలో అధికారం మారడం సాధ్యమే అనిపిస్తోంది. మరి ఈ గుడివాడ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఏపీలో అనూహ్య పరిణామాలు ఏమన్నా జరుగుతాయేమో చూడాలి. హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలతో అధికార పార్టీపైనా, కొడాలి నానిపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్న భక్తులు, హిందూ సంఘాలు మాత్రం.. గుడివాడ సెంటిమెంట్ వెంటనే వర్కౌట్ అయితే బాగుండు దేవుడా అని కోరుకుంటున్నారు. 

About The Author