ఆంద్రప్రదేశ్ లో జగన్ కీలక నిర్ణయం


రీచ్‌ నుంచే నేరుగా సరఫరా

రీచ్‌ల బాధ్యత కేంద్ర సంస్థలకు

అవి కాదంటేనే జోన్ల వారీగా బిడ్డింగ్‌

ఇక ఆఫ్‌లైన్‌లోనూ ఇసుక విక్రయం

సొంత వాహనాల్లోనూ తీసుకెళ్లొచ్చు

పట్టా భూముల్లో తవ్వకాలు నిషేధం

ఇసుక విధానంలో భారీ మార్పులు

సబ్‌ కమిటీ సిఫారసులకు కేబినెట్‌ ఓకే

రూ.5835 కోట్లతో బందరు పోర్టు

36నెలల్లో నిర్మించేలా డీపీఆర్‌కు ఓకే

జనవరి 1 నుంచి ఇంటికే రేషన్‌

ఎస్‌ఈబీ సేవలు మరింతగా విస్తృతం

ఎర్రచందనం కట్టడీ దాని పరిధిలోకే

‘కొత్త ఇసుక విధానం’ పేరిట నిర్మాణదారులకు, కార్మికులకు చుక్కలు చూపిస్తున్న సర్కారు దిద్దుబాట పట్టింది.
‘పేరు ఏదైనా పెట్టుకోండి! ధరను దించండి. అందుబాటులో ఉంచండి’ అన్న ప్రజాభిప్రాయానికి తలొగ్గింది. రీచ్‌ నుంచి స్టాక్‌ పాయింట్‌… స్టాక్‌ పాయింట్‌ నుంచి ప్రజలకు రవాణా చేసే సంక్లిష్ట విధానానికి స్వస్తి పలికింది. టన్ను ఇసుక ఎక్కడా రూ.475కు మించరాదని తేల్చిచెప్పింది.
నదీ గర్భాల్లోని రీచ్‌లను కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలి! అవి కాదంటే రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి బిడ్డింగ్‌! ఇసుక అవసరమైన వారు నేరుగా రీచ్‌కు వెళ్లి కొనుగోలు చేయవచ్చు. టన్ను ఇసుక… రూ.475కు మించదు! ఇవీ ఇసుక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భారీ మార్పులు! ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మార్పులకు ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇసుక రీచ్‌లను జోన్లుగా విభజించారు. రీచ్‌ల వద్ద ఇసుకను తవ్వి విక్రయించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకే అప్పగించాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ముందుకు రాకుంటే, జోన్‌ల వారీగా రీచ్‌లకు బహిరంగ వేలం నిర్వహించాలని కేబినెట్‌ తీర్మానించింది. అప్పుడు… రీచ్‌ల నుంచి నేరుగా వేలం పొందిన వారు ఇసుకను సరఫరా చేస్తారు. కాగా.. టన్ను ఇసుక ధర రూ.475కు మించి ఉండకూడదని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసును కేబినెట్‌ ఆమోదించింది. ఇప్పటి వరకూ పట్టాభూముల్లో ఇసుకను తవ్వుకునేందుకు ఎలాంటి అడ్డంకులూ లేవు. అయితే, ఈ ఇసుక నాసిరకంగా ఉంటోందని సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్‌ పరిగణనలోకి తీసుకుంది.

పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. ప్రస్తుతం రీచ్‌ల నుంచి స్టాక్‌ పాయింట్‌కు ఇసుకను తరలించి… అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి ఇసుకను సరఫరా చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లోనూ ఇసుకను బుక్‌ చేసుకునే విధానం అమలులోకి తీసుకు వచ్చారు. అయితే, రీచ్‌లు ఎక్కడో సరఫరా మరెక్కడో అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇసుక ధర కంటే.. రవాణా చార్జీల భారమే ఎక్కువవుతోంది. ఇకపై వినియోగదారులు నేరుగా రీచ్‌ వద్దకు వెళ్లి ఇసుకను కొనుగోలు చేయవచ్చు. సొంత వాహనాల్లోనూ ఇసుకను తీసుకునే వీలుంది. షెడ్యూల్డు ఏరియాల్లో నియమావళి ప్రకారం గిరిజన సంస్థలకే ఇసుక తవ్వకాలను కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అదేవిధంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎడ్ల బండ్లపైనా తీసుకువచ్చే వెసులుబాటుంది. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

ఇవీ మార్పులు..

ఇసుక రీచ్‌ల నుంచి నేరుగా వినియోగదారులకు సరఫరా చేస్తారు. ఈ రీచ్‌ల నిర్వహణకు ఎన్‌ఎండీసీ వంటి 8 కేంద్ర సంస్థలను సంప్రదిస్తారు. ఆ సంస్థలు ముందుకు రాకుంటే ప్రైవేటు సంస్థలకు బిడ్డింగ్‌ ద్వారా అప్పగిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుకను విక్రయించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లోనూ ఇసుక బుకింగ్‌లను చేసుకోవచ్చు. ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలకు, బలహీన వర్గాలకూ సబ్సిడీతో ఇసుకను అందిస్తారు. పట్టా భూముల నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతులు రద్దు.

ఇప్పటిదాకా ఇసుక, మద్యం అక్రమాలపై దృష్టిపెట్టిన ఎస్‌ఈబీని (స్పెషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) బలోపేతంచేస్తూ అదనపు పోస్టులు మంజూరు. గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్‌, డ్రగ్స్‌ వంటివీ ఎస్‌ఈబీ పరిధిలోకి. ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడిని ఎస్‌ఈబీకు అనుసంధానం చేస్తారు.

మరిన్ని ముఖ్య నిర్ణయాలు..

‘జగనన్నతోడు’ పథకం ఈ నెల 24న ప్రారంభం. ఇందుకోసం సుమారు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపు. చిరువ్యాపారులకు ఈ పథకం పది వేల రూపాయల రుణం పంపిణీ. ఇప్పటికి 9 లక్షలకు పైగా దరఖాస్తులు దాఖలు. వారికి త్వరలో గుర్తింపు కార్డుల జారీ.

జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రమంతటా ఇంటికే నాణ్యమైన బియ్యం పంపిణీ. ఇంటి వద్దకు వెళ్లి తూకం వేసి పర్యావరణ హితమైన సంచుల్లో బియ్యం సరఫరా. బియ్యం అక్రమంగా తరలిపోకుండా బస్తాలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రణ. బియ్యం పంపిణీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు 9250 మొబైల్‌ వాహనాలు. ఒక్కో వాహనంపై 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం, పది శాతం లబ్ధిదారుడు భరించేలా కార్యక్రమం రూపకల్పన.

500 లీటర్లు కంటే ఎక్కువ పాల సేకరణకు అవకాశం ఉన్న సుమారు 9 వేలకు పైగా గ్రామాల్లో మహిళల నేతృత్వంలో పాల సేకరణ కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాల వద్దే అవి ఏర్పాటు. భరోసా కేంద్రాల వద్దే పశువుల దాణా సరఫరా.

ఆక్వాకల్చర్‌ సీడ్‌ యాక్ట్‌ -2020కు కేబినెట్‌ ఆమోదం. ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ యాక్టుకూ ఆమోదముద్ర.

‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూమి హక్కు – భూమి రక్షణ’ పేరుతో అన్ని భూముల రీ సర్వేకు నిర్ణయం. గామీణ, పట్టణ ప్రాంతాలన్నీ రీసర్వే పరిధిలోకి. దీనికోసం రూ.1000 కోట్లు కేటాయింపు. వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్‌ 2023 నాటికి 4500 సర్వే టీమ్‌లతో దశల వారీగా ప్రక్రియ. రీ సర్వేలో ఉత్పన్నమయ్యే భూసమస్యల పరిష్కారానికి మొబైల్‌ కోర్టులు ఏర్పాటు. గ్రామ సచివాలయంలోనే రీసర్వే ఫలితాలు నమోదు.

రాష్ట్రంలో ఎనిమిది మెడికల్‌ కాలేజీలకు భూములు కేటాయింపు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి విస్తరణకు ఆరెకరాలు మంజూరు.

విజయవాడలో అనాధాశ్రమం, శిశు భవన్‌ కోసం మిషనరీ ఆఫ్‌ చారిటీ్‌సకు లీజు పద్దతిన 2000 గజాలు కేటాయింపు.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం బకాయిలు రూ.1051 కోట్లు ఈ నెల 17న పంపిణీ.

అక్టోబరులో జరిగిన పంటనష్టం గణన ఈ నెల 10వ తేదీనాటికి పూర్తిచేసి నెలాఖరులోగానే ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతుల ఖాతాల్లో జమ.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్టేడియాల ఏర్పాటు. ఆమదాలవలస, పులివెందులలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కు నిర్మాణ బాధ్యతలు.

ఐదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలు 48 మంది విడుదలకు కేబినెట్‌ నిర్ణయం.

వైద్యకళాశాలల్లో టీచింగ్‌ సిబ్బంది 3500 మందికి లబ్ధి చేకూరేలా యూజీసీ స్కేళ్ల వర్తింపు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.400 కోట్ల భారం.

విశాఖలో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం. 150 ఎకరాల్లో సెంటర్‌ ఏర్పాటుకు అదానీ ఆమోదం.

ఇంతవరకు ఏ పథకంలోనూ లబ్ధి పొందని అర్హులకూ సంక్షేమ మేలు వర్తింపు. శనివారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం.

వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కింద 2051 రోగాలకు అందించే చికిత్సను మరో ఆరు జిల్లాలకు విస్తరింపు.

రూ.5800 కోట్లతో బందరు పోర్టు 36నెలల్లో నిర్మాణం. ఈ పోర్టు డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం.

ఇవీ ఇసుక జోన్‌లు

1) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి

2) పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం

3) నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం

About The Author