జనవరి 1 నుంచి ఏపీలోని రైస్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఇళ్ల వద్దే రేషన్ బియ్యం.


జనవరి 1 నుంచి ఏపీలోని రైస్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఇళ్ల వద్దే రేషన్ బియ్యం అందించాలనే నిర్ణయం ఏపీ కేబినెట్ తీసుకుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకం పైలెట్ ప్రాజెక్ట్ గా అమలులో ఉంది. ఇకపై దీన్ని రాష్ట్రంలోని 13జిల్లాలకు విస్తరిస్తారు. 2021 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమలులో పెడతారు. రైస్ కార్డ్ ఉన్నవారందరికీ ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి రేషన్ బియ్యం, ఇతర సరకులు ఇచ్చి వెళ్తారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సరఫరా అవుతుంది.
లబ్ధిదారులు రేషన్ షాపుకి వెళ్లి.. అక్కడే తమ వేలిముద్ర వేసి బియ్యం, ఇతర వస్తవులు తీసుకుని వెళ్తుంటారు. ఒక ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులు మరోచోట ఉన్నా కూడా వేలిముద్ర వేయించుకుని వారికి బియ్యం అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇలాంటి వలస కార్డులు మరింత ఎక్కువయ్యాయి. లాక్ డౌన్ కారణంగా సొంత ప్రాంతాలకు వెళ్లలేని వారు.. తాము ఉన్నచోటే రేషన్ సౌకర్యం పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20శాతం మంది తమకు కేటాయించిన దుకాణాల్లో కాకుండా వేరే చోట రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. ఇలాంటి వారందరికీ ఇప్పుడు ఇంటింటికీ బియ్యం సరఫరా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

ఇంటికి రేషణ్ బియ్యం పంపించేందుకు 9,260 మొబైల్‌ వాహనాలు సిద్ధం చేశారు అధికారులు. మొబైల్‌ వాహనాల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 20 శాతం ఈబీసీలకు కేటాయిస్తారు. ఆరేళ్లకు వాహనం పూర్తిగా లబ్ధిదారుడికి సొంతమవుతుంది. ప్రస్తుతానికి ఈ వాహనాల్లో బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించారు. అయితే ఒకవేళ వాహనం వచ్చినప్పుడు సంబంధిత లబ్ధిదారులు ఇంటి వద్ద లేకపోతే తిరిగి అవి రేషణ్ దుకాణానికే చేరుకుంటాయి. ఒకవేళ లబ్దిదారులు వేరే ప్రాంతాల్లో ఉంటే.. అక్కడ రేషన్ దుకాణాలకు లేక వాలంటీర్లకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారికి రేషన్ బియ్యాన్ని ఇంటివద్దకు తెచ్చి ఇవ్వగలుగుతారు. అంటే జనవరి 1నుంచి రేషన్ సరకుల్ని ఇంటివద్ద తీసుకోవాలనుకుంటున్నవారిలో స్థానికులు కానివారంతా ముందస్తుగా అక్కడి వాలంటీర్లకు, రేషన్ దుకాణాలవారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకపోతే.. వారిని లెక్కలోకి తీసుకునే అవకాశం ఉందడు. మరోవైపు బియ్యం బస్తాలు దారి మళ్లకుండా ఉండేందుకు ప్రతి బస్తాపై క్యూఆర్‌ కోడ్ వేయాలనుకుంటున్నారు అధికారులు. రేషన్ బియ్యం తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్‌ అమరుస్తారు.

About The Author