దేశంలో ఇంతవరకూ ఎక్కడ వినని స్కీమ్ అది… ఒక్కసారి డబ్బు కడితే చాలు..
దేశంలో ఇంతవరకూ ఎక్కడ వినని స్కీమ్ అది… ఒక్కసారి డబ్బు కడితే చాలు… జీవితాంతం ఇక ప్రతీ నెలా ఆదాయమే… వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో చాలామంది గుడ్డిగా నమ్మేశారు. తాము కట్టడమే కాకుండా… తమ బంధువులతోనూ కట్టించారు. చివరకు ఆ స్కీమ్ బోగస్ అని తెలియడంతో నెత్తి నోరూ బాదుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ బోగస్ స్కీమ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది.
రూపేష్ కుమార్ బోగస్ స్కీమ్…
చిత్తూరు జిల్లా చెరువు కిందపల్లికి చెందిన రూపేష్ కుమార్ (29) అనే యువకుడు ఒక కొత్త ఫించన్ స్కీమ్‌ను ప్రారంభించినట్లు కొద్ది నెలల క్రితం గ్రామంలో అందరికీ ప్రచారం చేశాడు.
ఆ స్కీమ్ ప్రకారం… ఎవరైనా ఓ వ్యక్తి ఒక్కసారి రూ.12500 చెల్లిస్తే… జీవితాంతం ప్రతీ నెలా అతనికి రూ.3వేలు ఫించన్‌గా అందుతుందని చెప్పాడు. తెలిసినవాడే కదా అని… చెరువు కిందపల్లికి చెందిన వందలాది మంది అతనికి డబ్బులు చెల్లించారు. అలా డబ్బులు చెల్లించినవారందరికీ రూపేష్ ప్రామిసరీ నోట్లు చేతిలో పెట్టాడు.
రూ.50కోట్లు వసూలు…
డబ్బులు చెల్లించినవారందరికీ రెండు,మూడు నెలల పాటు ప్రతీ నెలా రూ.3వేలు చెల్లించాడు. దీంతో గ్రామస్తులకు మరింత నమ్మకం ఏర్పడింది. అలా పక్క గ్రామాల్లోని తమ బంధువులు,తెలిసినవాళ్లను కూడా రూపేష్ ఫించన్ స్కీమ్‌లో చేర్పించారు. క్రమ క్రమంగా కడప,అనంతపురం,కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి కూడా ఈ స్కీమ్ పాకింది. దాదాపు 45వేల మంది రూ.50 కోట్లు వరకూ చెల్లించారన్న ప్రచారం ఉంది. అలా భారీ మొత్తంలో నగదు సమకూరగానే రూపేష్ పత్తా లేకుండా పోయాడు. దీంతో డబ్బు చెల్లించినవారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు.
చుట్టాలబ్బాయని నమ్మితే…
చెరువు కిందపల్లికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ… మొదట తాము రూపేష్‌కి రూ.12వేలు చెల్లించామన్నారు. చుట్టాలబ్బాయి కదా అని నమ్మి అతనికి డబ్బు చెల్లించామన్నారు. మొదట రెండు,మూడు నెలలు ప్రతీ నెలా రూ.3వేలు చెల్లించాడన్నారు. ఆ తర్వాత మళ్లీ డబ్బులు కట్టమని చెబితే… మరోసారి రూ.12వేలు చెల్లించినట్లు చెప్పారు. అంతేకాదు, తమకు తెలిసినవాళ్లను,బంధువులను కూడా స్కీమ్‌లో చేర్పించామన్నారు. కానీ ఆ తర్వాత రూపేష్ కనిపించకుండా పోయాడని… దీంతో బంధువులు డబ్బు కోసం తమపై ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. రూపేష్ నుంచి తమకు రూ.1లక్ష పైచిలుకు సొమ్ము రావాలని చెప్పారు.
తప్పించుకున్న రూపేష్…
రూపేష్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో చిత్తూరు జిల్లా పెద్దమండ్యం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం కారణంగా రూపేష్ పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. దీంతో పెద్దమండ్యం పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జనార్ధన్ నాయక్, కానిస్టేబుల్ గంగాధర్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం రూపేష్ కుమార్ కోసం చిత్తూరు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్తున్నారు.