దేవుడు అన్యాయం చేశాడు…

దేవుడు అన్యాయం చేశాడు…
తల్లి త్యాగం అంధులైన కూతుళ్ళకు వెలుగుచూపింది…

జీవితంలో వెలుగులు చూడలేమని బాధపడే తన బిడ్డలకు చీకటిలోనే లక్ష్యాన్ని నిర్దేశించింది ఓ తల్లి.. . బిడ్డల ప్రయాణంలో బాటసారిగా ఉంటూ… చదువుతో పాటు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకునే స్థాయికి తీర్చిదిద్దింది.అంధులైన బిడ్డలను దగ్గరుండి చూసుకోవాలని ఆ బిడ్డలు ఉండే హాస్టల్ లోనే వంటమనిషిగా చేరింది.. పదిమంది గర్వించ దగ్గ స్థాయికి చేర్చిన మాధవి విజయం వెనుక ఎన్నో సవాళ్లున్నాయి. మాధవిది గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని చుండూరుపల్లి. ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. భర్త మన్నె శ్రీనివాసరావు సెక్యురిటీ గార్డు ఉద్యోగం చేసేవారు. మొదటి సంతానంలో ఒక బాబు. రెండో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు. వారికి రజిత, లలిత అని పేర్లు పెట్టుకుని మురిసిపోయింది. వాళ్లు పుట్టిన మూడు నెలలు గడిచాక కానీ మాధవికి అర్థం కాలేదు వాళ్లలో ఏదో లోపం ఉందని. మూడు నెలలవుతున్నా వాళ్లు పూర్తిగా కళ్లు తెరవలేకపోతున్నారు. దీంతో ఒక రోజు వైద్యుల దగ్గరకు తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు చెప్పిన మాటలకు మాధవి కుంగిపోయింది. వాళ్లకు చూపు దాదాపుగా లేదని చెప్పారు. అది తెలిశాక ఇద్దరినీ కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకుంది. ఆ రోజే అందరిలానే చదివించి ప్రయోజకుల్ని చేయాలని సంకల్పించుకుంది.వీళ్ల గురించి తెలిశాక ఎన్నో అవమానాలు తప్పలేదు. ఎక్కడైనా అనాథాశ్రమంలో వదిలేసి మరోసారి పిల్లల కోసం ప్రయత్నించమని చెప్పిన వారూ లేకపోలేదు. ఇలాంటి మాటలను లెక్కచేయలేదు మాధవి. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా.. పిల్లల్ని బాగా చదివించాలనుకుంది. బాపట్లలోని స్నేహమయీ కాన్వేంట్‌లో అక్కడి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు సహాయంతో ఇద్దరూ ప్రాథమిక విద్య పూర్తిచేసేలా చూసింది. ఆ తరువాత గుంటూరులో ఉన్న ఓ అంథుల వసతి గృహంలో ఉంచి, పక్కనే ఉన్న అలాంటి స్కూల్లో ఆరో తరగతిలో చేర్చింది. వారంలో నాలుగైదు సార్లు పిల్లల్ని చూడటానికి వెళ్లేది. కానీ కొన్నిరోజులకే తల్లిమనసు ఒప్పుకోలేదు. ఇంటికి దూరంగా వసతి గృహంలో ఉంటున్న తన పిల్లలు ఇబ్బందులు పడతారని భావించింది. అందుకే ఆ సంస్థ సభ్యులను అడిగి అక్కడ వంటమనిషిగా పనిచేసేందుకు సిద్ధమైంది. దానివల్ల తన బిడ్డల్ని దగ్గరుండి చూసుకోవచ్చు అనేది మాధవి ఉద్దేశం. అలానే చేరింది కూడా. తనకు మధ్యలో అనారోగ్య సమస్యలొచ్చినా, శరీరం సహకరించకపోయినా పిల్లలకోసం అక్కడే ఐదేళ్లు పనిచేసింది.

లక్ష్యం దిశగా…
కష్టాలు పడి… పెద్ద అమ్మాయి రజిత 2014లో బీకామ్‌ పూర్తిచేయించింది. డిగ్రీలో ఉన్నప్పుడే రజిత కాంపిటేటివ్‌ పరీక్షలకు సిద్ధమయ్యేది. 2012లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన వీఆర్‌వో పరీక్షలో 76 మార్కులు తెచ్చుకుని తృటిలో ఉద్యోగం కోల్పోయింది. ఇలా చాలా పరీక్షల్లో ఒకటి రెండు మార్కులు తక్కువ రావడంతో ఉద్యోగం కోల్పోయిన సందర్భాలున్నాయి. ఆ సమయంలోనే ఓ సంబంధం రావడంతో రెండేళ్ల క్రితం వివాహం చేసింది. అయినా రజిత తన ఉద్యోగ ప్రయత్నాలు ఆపలేదు. ఆ ప్రయత్నాల్లో భాగంగా గత ఆగస్టులో గుంటూరులోని గోరంట్ల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం తెచ్చుకుంది. ఈ ఉద్యోగానికి సంబంధించి కంప్యూటర్‌ కోర్సు కూడా పూర్తి చేసింది రజిత. లలిత కూడా చదువుల్లో మొదటి నుంచి చురుకే. ఇంటర్‌లో 70 శాతం మార్కులు సాధించడంతో మాస్టర్‌ మైండ్స్‌ విద్యా సంస్థలు వారు ఉచితంగా చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్సుకు సంబంధించిన సీపీటీ శిక్షణ ఇచ్చారు. ఆ తరువాత ఐపీసీసీ కోర్సుకి కొత్త ప్రదేశానికి వెళ్లింది. అయితే అక్కడి వాతావరణం, హాస్టళ్లలోని భోజనం పడక అనారోగ్య సమస్యలు వచ్చాయి. అలా బీకామ్‌లో చేరి 75 శాతం మార్కులతో పూర్తిచేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల బీమా సంస్థ’ లో క్లర్క్‌గా ఉద్యోగం తెచ్చుకుంది. గ్రూప్‌-2 ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యమని చెప్తుంది లలిత.

About The Author