బొప్పాయి చెట్టు గురించి సంపూర్ణ వివరణ – ఔషధోపయోగాలు .


బొప్పాయి చెట్టు మన గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తుంది. దీని ఫలం అద్బుతమైన రుచితో కూడుకుని ఉంటుంది. ఈ చెట్టుతో అత్యద్భుతమైన ఔషధ యోగాలు ఎన్నొ ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు . ఇప్పుడు మీకు బొప్పాయి చెట్టు ఉపయోగాలు అందులో ఉన్న విలువైన ఔషధ యోగాలు వివరిస్తాను.

ఏరండఛిర్బిటావృక్ష , ఛిర్బిటా , నలికాధాల అని సంస్కృతంలో బొప్పాయి చెట్టుకు ఉన్న పేర్లు . కొన్ని చోట్ల వాతకుంభ ఫల అని కూడా పిలుస్తారు . ఇది పోక చెట్టు మొదలగు వాని వలే పెరుగును . దీని ఆకులు వేలి కంటే ఎక్కువ లావు , చిటికెన వేలు పట్టు బోలుగల గజము పొడవు గల గొట్టము చివరను , ఆముదము ఆకువలె చిల్లులు కలిగి ఆముదపు ఆకుకు రెట్టింపు పెద్దవి కలిగిన ఆకులు కలిగి ఉండును. కాయ పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉండి పండిన తరువాత పసుపు పచ్చగా ఉండును. చెట్టును, కాయను గిల్లిన పాలు వచ్చును. పండులో నల్లటి వాయువిడంగముల వంటి గింజలు ఉండును.

బొప్పాయి ఔషధోపయోగాలు –

* బాలింతలకు పాలు తక్కువ ఉన్నప్పుడు బొప్పాయి పచ్చి కాయలు తీసుకుని పైన ఆకుపచ్చని పెచ్చు మరియు లోపలి గింజలు తీసివేసి సన్నగా తరిగి అందు తెలగపిండి వేసి కూర వండి తినిన బాలింతలకు పాలు వృద్ది అగును.

* వాతపు నొప్పులకు బొప్పాయి ఆకులు మెత్తగా నూరి ఆముదంతో ఉడికించి కట్టిన వాతపు నొప్పులు తగ్గును.

* తామర , గజ్జి ఏర్పడినప్పుడు బొప్పాయి పాలు నేతిలో గాని కొబ్బరినూనెతో కాని కలిపి రాయవలెను. ఉత్త పాలు రాసిన శరీరం పై పొక్కే గుణం ఉండును.

* ఋతువు రాకుండా ఇబ్బంది పడు స్త్రీలు మూసామ్బారంను బొప్పాయి పాలతో నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఉదయం మరియు సాయంత్రం పుచ్చుకొనుచుండిన రుతురక్తం జారీ అగును.

* తేలుకుట్టినప్పుడు బొప్పాయి పాలు కుట్టినచోట వేసిన తేలువిషం విరుగును.

* అజీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు దోరగా ఉన్న బొప్పాయి కాయని ఎండించి చూర్ణం చేసి ఆ చూర్ణమును ఆహారం తరువాత నీటితో కలిపి 3 గ్రాముల మోతాదులో తీసుకున్న అనేక రకాలైన అజీర్ణాలు పోవును .

* బోదకాలు వచ్చి కాళ్లు వాపుగా ఉన్నప్పుడు ఆకులు మెత్తగా దంచి పసుపు కలిపి పైన పట్టు వేయుచున్న బోదకాలు త్వరగా తగ్గును.

* కూరలు త్వరగా ఉడుకుటకు పచ్చి బొప్పాయి ముక్కలు కూరలో వేసిన కూర త్వరగా ఉడుకును.

* నోటివెంట గాని , గుండెల్లో నుంచి గాని , ఊపిరితిత్తుల నుంచి గాని రక్తం బయటకి వచ్చు సమయంలో బొప్పాయి పండు తినిపించిన వెంటనే రక్తస్రావం ఆగును.

* కడుపులోని క్రిములకు బొప్పాయి కాయలోని గింజలను ఎండించి చూర్ణం చేసి ఆ చూర్ణంకు మోదుగ విత్తనం చూర్ణం , వాము రసం కలిపి లోపలికి ఇచ్చిన క్రిములు చచ్చును.

* మూలవ్యాధి తో బాధపడే వారు పండు బొప్పాయి తినుచున్న రక్తం కారే మూలవ్యాది తగ్గును.

* పొట్టలో తయారయ్యే అమితవేడిని బొప్పాయి పండు తినటం వలన నివారణ అగును.

* ఎప్పటినుంచో నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడేవారు బొప్పాయి పండును తరచుగా తీసుకోవడం వలన నీళ్ల విరేచనాల సమస్య నుంచి బయటపడవచ్చు .

* వృషణాలు వాపుగా ఉన్నప్పుడు బొప్పాయి ఆకులను కుమ్ములో ఉడికించి మెత్తగా దంచి పైన వేసి కట్టు కడుతున్న వృషణాల వాపును తగ్గించును .

* పేను కొరికిన చోట బొప్పాయి పువ్వు మెత్తగా నలిపి పేను కొరికిన చోట రోజూ రెండుపూటల రుద్దుతున్న వెంట్రుకలు తిరిగి వస్తాయి.

* ముత్ర ద్వారంలో పుండు , మూత్రం బిగుసుకుపోయి బయటకి రాని సమయంలో బొప్పాయి పండు తినిపించిన మూత్రం ధారాళంగా వచ్చును. మూత్రద్వారంలో పుండు నయం అగును. మూత్రనాళంలో వ్రణాలు కూడా కరిగిపోతాయి.

* మలబద్ధకంతో బాధపడేవారు ఉదయాన్నే పండ్లు తోమిన వెంటనే మంచిగా పండిన బొప్పాయి పండును తినుచున్న మలబద్దకం సమస్య పోవును .

* శరీరానికి నీరు పట్టి ఉన్నవారు తరచుగా పచ్చి బొప్పాయి కూర తినుచున్న శరీరంలో వేడి పెరిగి నీరు తగ్గును.

* ముఖం సౌందర్యవంతముగా ఉండవలెనన్న బొప్పాయి ఆకును నీడన ఎండించి చూర్ణము చేసి దానికి సమాన బాగాలు లోద్దుగ చెక్క, మంజిష్ఠ చూర్ణాలు పాలతో కలిపి నూరి ముఖంపై లేపనం చేసి అరగంట తరువాత చన్నీటితో కడిగిన ముఖం కాంతిమంతంగా ఉండును.

* పిప్పి పన్నుతో ఇబ్బంది పడుతున్న బొప్పాయి పాలను పంటి రంద్రములో రెండు చుక్కలు వేసిన పంటినొప్పి తగ్గును.

ఈ బొప్పాయి పచ్చికాయ గర్బవతులు వాడరాదు. ఆలస్యముగా జీర్ణం అగును. ఎక్కువుగా తినిన శరీరంలో కఫవాతాలను పెంచును. చల్లటి శరీరం కలిగిన వారి జబ్బు చేయును . వేరే ఆహారపదార్దాలు తిని కడుపు నిండుగా ఉన్నప్పుడు బొప్పాయి తినిన జ్వరాన్ని తెచ్చును. దీనికి విరుగుళ్లు శొంటి , పిప్పిళ్లు , మిరియాల చూర్ణం .

ఏ వస్తువునైనా అధికమోతాదులో తీసుకున్న శరీరానికి రోగాన్ని కలిగించును. తగిన మోతాదులో తీసుకున్న అమృతం వలే పనిచేయును .

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

About The Author