హెడ్గేవార్ – ఆర్.ఎస్.ఎస్. దృష్టి…
హెడ్గేవార్ – ఆర్.ఎస్.ఎస్. దృష్టి
భారత జాతీయ జీవనంలో నాయకులు పరస్పర విభిన్న దిశలలో తలొకవైపు లాగటం అలవాటే. డాక్టర్‌జీ జీవించి ఉన్న రోజుల్లోనూ కాంగ్రెసు – విప్లవకారులు, తిలక్ – గాంధీ, హింస – అహింస, హిందూమహాసభ – కాంగ్రెసు వగైరా ద్వంద్వ విభజనలుండేవి. ఒకరిమీద ఒకరు ఎలాగైనా పైచేయి సాధించాలని చూస్తుండేవారు. ఒక్కొక్కసారి తమలోని విభేదాల కారణంగా బ్రిటిషు సామ్రాజ్యవాదం మీద పోరాటం చేయడానికి వీరు ఒకరిమీద ఒకరు బహిరంగంగా దుమ్మెత్తిపోసుకుంటుండేవారు. 1921లో లోకనాయక్ ఆణే అధ్యక్షతన జరిగే మధ్య ప్రాంత కాంగ్రెసు ప్రాంతీయ మహాసభల్లో విప్లవకారుల చర్యలను ఖండించే తీర్మానం ఒకటి చర్చకు రానున్నది. డా||హెడ్గేవార్ తనకు విప్లవ మార్గంలో విశ్వాసం లేకున్నా విప్లవకారుల దేశభక్తిని శంకించరాదని ఆణేకు చెప్పారు. దీనినిబట్టి చూస్తే రాజకీయ భావాలు, సిద్ధాంతాలు, తిలక్ – గాంధీ, హింస-అహింస, కాంగ్రెసు-విప్లవకారులు ఇత్యాది సంకుచిత పక్షపాత బుద్ధి ఏదీ డాక్టర్‌జీ జీవితాన్ని శాసించలేదని స్పష్టమవుతుంది.
భారత్‌ను ఒక రాజకీయ అస్తిత్వంగా మాత్రమే భావించే ఒక వర్గంవారు ఎప్పుడూ అన్నిటికీ తామే క్రెడిట్ కొట్టేయాలనుకుంటూ ఉంటారు. భారత స్వాతంత్య్రోద్యమంలో ఇతరుల పాత్రను గుర్తించకుండా తమవల్లనే అది సాధ్యపడినట్లు ఏకపక్షంగా ప్రచారం సాగిస్తుంటారు. సాయుధ విప్లవకారులు మొదలు అహింసామార్గులైన సత్యాగ్రహులు, సైన్యంలోని తిరుగుబాటుదారులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వగైరా అందరి సమిష్టి కృషి ఫలితంగానే స్వాతంత్య్రం లభించింది. అంతేగాక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లండు దిక్కుతోచని పరిస్థితికి చేరుకోవటం, వలస ప్రాంతాలపై పట్టు నిలుపుకోలేకపోవటం, వాటిని పాలించేందుకు వైముఖ్యం అనే కోణాలు కూడా కాదనలేము. భారత్‌లో మాదిరిగా స్వాతంత్య్రపోరాటం చేయని వలస ప్రాంతాలకు సైతం ఈ పరిణామ క్రమంలో బ్రిటిషువారు స్వాతంత్య్రాన్ని ఇచ్చారు.
మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన చివరి సత్యాగహ్రం 1942 నాటి సత్యాగ్రహమేనని, అటు పిమ్మట 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందిందనేది సత్యం. కాని కేవలం 1942 సత్యాగ్రహం వలన, ఆ ఉద్యమంలో అరెస్టయిన వారి కారణంగా మాత్రమే స్వాతంత్య్రం వచ్చిందని చెప్పటం మాత్రం పరిహాసాస్పదం, అనుచితం, అసత్యం.
ఒక కథ ఉంది. ఒక రైతు చాలా ఆకలిగా ఉన్నాడు. భార్య వడ్డిస్తుంటే తింటున్నాడు. కాని ఆకలి తగ్గటం లేదు. పదకొండవ రొట్టె తిన్న తర్వాతనే తృప్తి కలిగింది. కోపంగా ఉన్న భర్త ఆ పదకొండవ రొట్టెను ముందుగానే ఎందుకు పెట్టలేదు అంటూ భార్యను తిట్టాడు. ఆ సంతృప్తి ముందే కలిగితే అన్ని రొట్టెలు తినవలసిన పని ఉండేది కాదని అతగాడి తర్కం! ఆ ఆలోచనే పరిహాసాస్పదమైనది.
అదేవిధంగా భారతదేశ స్వాతంత్య్ర ఘనతను 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి మాత్రమే ఆపాదించటం పరిహాసాస్పదం. కొన్ని చారిత్రక ఆధారాలు చూస్తే ఈ ఉద్యమం గురించిన స్పష్టమైన చిత్రం మనకు లభిస్తుంది.
భారతదేశానికి స్వాతంత్య్రాన్ని ఇచ్చే సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి అట్లీ ‘బ్రిటిషు వారి మీద గాంధీ అహింసా ఉద్యమ ప్రభావం దాదాపుగా శూన్యమే’ అన్నాడు. పశ్చిమ బెంగాల్ మాజీ తాత్కాలిక గవర్నర్ (కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) పి.ఎం. చక్రవర్తి ఇలా వ్రాశారు – ‘నేను తాత్కాలిక గవర్నరుగా ఉండగా లార్డ్ అట్లీ భారతదేశ పర్యటన చేస్తూ కలకత్తాలోని గవర్నరు భవనంలో రెండు రోజులు గడిపారు. ఆ సమయంలో నేను బ్రిటిషు వారు భారతదేశం విడిచి వెళ్ళవలసి రావడానికి అసలైన కారణాల గురించి ఆయనతో సుదీర్ఘంగా చర్చించాను. ‘గాంధీగారి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం ఎప్పుడో చల్లారిపోయింది, 1947లో అలాంటి సరికొత్త బలాత్కార పరిస్థితులేమీ తలయెత్తలేదు. అలాంటప్పుడు బ్రిటిషువారు హడావిడిగా వెళ్లి పోవలసిన అగత్యం ఏమి వచ్చింది? అని సూటిగా ప్రశ్నించాను. దీనికి సమాధానంగా అట్లీ చాలా కారణాలు చెప్పారు. వాటిలో ప్రధానమైనదేమంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైనిక కార్యకలాపాల ఫలితంగా భారతీయ సైనికుల్లోను, నౌకాదళంలోను బ్రిటిషు రాజవంశం పట్ల విధేయత సన్నగిల్లింది. చర్చ చివరలో నేను ‘భారతదేశాన్ని విడిచి వెళ్ళాలనే బ్రిటిషు వారి నిర్ణయంపై గాంధీజీ ప్రభావం పరిమితి ఎంత?’ అని అట్లీని అడిగితే అట్లే వ్యంగ్యంగా నవ్వి పెదవి విరుస్తూ ”చా..లా.. త..క్కు..వ’ అంటూ నెమ్మదిగా మాట వదిలాడు.
రమేష్‌చంద్ర మజుందార్ ఇలా అంటాడు -‘ఆ మూడింటి సమిష్టి ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. ప్రత్యేకించి అజాద్ హింద్‌ఫౌజ్‌పై విచారణ సందర్భంగా వెల్లడైన వాస్తవాలు, భారతదేశంలో అవి కనబరచిన ప్రతిక్రియ చూస్తే అప్పటికే యుద్ధంతో చతికిలపడిన బ్రిటిషువారికి భారతదేశంలో తమ అధికారం నిలుపుకోవడానికి సిపాయిల విధేయతపై ఇక ఎంతమాత్రం ఆధారపడ లేమని చక్కగా అర్థమైంది. భారతదేశాన్ని విడిచివెళ్లా లనే వారి అంతమ నిర్ణయంపై అత్యంత ప్రభావం చూపిన అంశం బహుశా ఇదే అయి ఉంటుంది.
ఇది చదివిన మీదట భారత స్వాతంత్య్ర సాధనలో 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి పాత్ర ఏమీ లేదనుకోవడం కూడా సరికాదు. జైల్లో ఉండి బాధపడటం ఒక్కటే దేశభక్తుడి లక్షణం అని భావిం చటం కూడా సరికాదు. స్వాతంత్య్ర సంగ్రామంలో జైలుకు వెళ్లిన వారితోబాటు వారి కుటుంబాలను ఆదుకొన్న వారు, అజ్ఞాత కార్యకర్తలకు ఆశ్రయమిచ్చిన వారు, జాతీయ విద్య ద్వారా విద్యార్థులలో దేశభక్తిని ప్రబోధించిన వారు, స్వదేశీ వస్తు వినియోగానికై ప్రచారం కల్పించి బ్రిటిషు తయారీ వస్తువులను ఆర్థిక రంగంలో అడ్డుకున్న వారు, స్వదేశీ పరిశ్రమల ద్వారా బలమైన ప్రత్యామ్నాయాలను అందించిన వారు, జానపద కళలు, పత్రికారంగం, కథలు, నవలలు, నాటకాల ద్వారా జాతీయ చైతన్యాన్ని రగుల్కొల్పిన వారు అందరూ తమవైన పద్ధతుల్లో చేయూతనిచ్చిన వారే. వారినందరినీ పరిగణలోకి తీసుకోవాలి.
భారత్ కేవలం రాజకీయ అస్తిత్వం కాదు. వేలాది సంవత్సరాల సనాతన ఆలోచన, దర్శనాలపై నిర్మిత మైన అవిరళ, సమగ్ర, ఏకాత్మక దృష్టి ప్రాతిపదికగా కలిగిన ఒక సాంస్కృతిక సత్తా ఇది. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు వ్యాపించి ఉన్న ఈ వైవిధ్య భరితమైన సమాజానికి ఈ దర్శనం, సంస్కృతి ఒక విశిష్టమైన గుర్తింపునిస్తున్నాయి. కనుకనే భారత్‌లో ఏదైనా రాజకీయ మార్పు సంభవించినప్పుడు దానికి ముందుగాగాని, అదే సమయంలో గాని ఒక ఆధ్యాత్మిక శక్తి కారణంగా ఒక సాంస్కృతిక చైతన్య ప్రక్రియ సంభవిస్తుంటుంది. పరిస్థితి క్లిష్టంగా ఉన్న కొద్దీ ఈ ఆధ్యాత్మిక శక్తి కూడా మరింత బలీయంగా వ్య్తం కావడం చూడవచ్చు. కనుకనే మొఘలుల పాలనాకాలంలో 12 నుంచి 16వ శతాబ్దం వరకు భారతదేశ వ్యాప్తంగా భక్తి ఉద్యమం వ్యాపించటం కనిపిస్తుంది. ఉత్తరాన రామానందుడి నుంచి దక్షిణాగ్రాన రామానుజాచార్యుల వరకు అన్ని ప్రాంతాలలోను సాధువులు, సంత్‌లు, సన్యాసుల అవిచ్ఛిన్న పరంపర ఒకటి కనిపిస్తుంది. బ్రిటిషువారి దాస్యపు రోజుల్లో స్వామి దయానంద సరస్వతి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి ఆధ్యాత్మిక నేతల సంప్రదాయం కనిపిస్తుంది. భారతదేశ చరిత్రలో సాంస్కృతిక జాగరణ లేకుండా ఏ రాజకీయ మార్పుగాని విజయవంతం అవలేదు, శాశ్వతం కాలేదు. కనుక సాంస్కృతిక జాగరణను రాజకీయమైన కొలమానాలతో విలువ కట్టకూడదు. నిశ్శబ్దంగా ప్రశాంతంగా సాగిపోయే ఆధ్యాత్మిక, సాంస్కృతిక జాగరణ భారత్ వంటి దేశానికి మరెంతో ప్రాముఖ్యం కలిగి ఉంటుందనే విషయాన్ని విస్మరించరాదు.
– డా.మన్మోహన్ వైద్య
ఆర్.ఎస్.ఎస్. సహ సర్ కార్యవాహ