అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా


అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయికాః
అదిగో అయోధ్య
అయోధ్యాకాండ-1
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ।
పురీ ద్వారావతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః ।।
అయోధ్య- హిందువుల పుణ్యక్షేత్రం అనుకుంటే ఒక భౌగోళిక సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే. వాస్తవానికి అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ఆనవాలు. యుగయుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత విలువల పుట్టిల్లు. భారతీయ కుటుంబ జీవనానికి, మానవ సంబంధాలకి, గురుశిష్య బంధానికి, భార్యాభర్తల అనురాగానికి స్ఫూర్తి కేంద్రం. రాజ్యానికీ, ప్రభుత్వానికీ, నడవడికకీ, ధర్మనిరతికీ నిర్వచనం.
అయోధ్య అంటే- భారతావని మీద వేల ఏళ్లుగా ఆధ్యాత్మిక వెలుగులు వర్షిస్తున్న రామాయణ మహాకావ్యానికి నేపథ్యం, ఇతివృత్తం అందించిన దివ్యస్థలి. గిరిపుత్రి శబరినీ, పడవ నడిపే గుహుడినీ, పక్షే అయినా మానుషధర్మం నిలబెట్టే ప్రయత్నంలో మరణించిన జటాయువునీ దైవాలతో సమంగా చూపిన ధర్మస్థలి
అది శ్రీరామచంద్రుడి జన్మస్థలి.దేవదేవుడిని సామాన్య మానవునిగా చిత్రించి, మహోన్నత జీవిత సత్యాలను ఆవిష్కరించిన వేదిక అయోధ్య. మానవజన్మ పరమార్ధాన్ని బోధించిన పాఠశాల.
ఇంకా- స్వధర్మం కోసం శతాబ్దాల పాటు సాగిన హిందువుల పోరాట గాధ అయోధ్యలోని ప్రతి అణువు వినిపిస్తుంది. తెగిపడిన కంఠాల నుంచి వెల్లువెత్తిన ఆత్మగౌరవ నినాదాలు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి.
దురాక్రమణదారుల చెరలో ఉన్న రాముడి జన్మభూమిని తిరిగి సాధించడానికి భక్తులు, సాధుసంతులు చేసిన సమరాన్ని గుర్తు చేస్తుంది.
జాతి యావత్తు వేయేళ్ల బానిసత్వంలో ఉండిపోయినా, మతోన్మాదుల కత్తుల• మెడ మీద వేలాడినా ఆర్షధర్మం, హిందూ జీవనం చెల్లాచెదురు కాకుండా సంఘటించుకునే దీక్షను అహరహం నిలబెట్టింది- అయోధ్య.
అయోధ్య ఉత్తరప్రదేశ్‌లో ఉంది. సాకేతపుర మని కూడా అంటారు. గొప్ప పుణ్యక్షేత్రాలలో, అతి పురాతన నగరాలలో ఒకటి. శ్రీమహావిష్ణువు సప్తమ అవతారం శ్రీరాముడు అవతరించిన నేల ఇదేనని భారతీయులందరి ప్రగాఢ విశ్వాసం. స్కంద, తదితర పురాణాలు మోక్షదాయినులుగా పిలిచిన మన ఏడు పురాలలో అగ్రస్థానం అయోధ్యదే. సరయూ నది కుడి ఒడ్డున ఉన్న అయోధ్య దైవనిర్మితమంటుంది అధర్వణవేదం. ఆ పురం స్వర్గతుల్యమనీ ప్రస్తుతిస్తుంది నాలుగో వేదం. ఈ నగరం 9,000 సంవత్సరాలకు పూర్వం నిర్మితమైందని చెబుతుంది వాల్మీకి రామాయణం. ధర్మశాస్త్రకర్త మనువు అయోధ్యను నిర్మించాడని ప్రతీతి. మొదటి మానవునిగా పురాణాలు చెప్పే వైవస్వత మనువు ఇతడే. ఆయన కుమారుడు ఇక్ష్వాకు. వీరిది సూర్యవంశం. ఆ వంశీకుడు ఆయుధ్‌ను కూడా అయోధ్య నిర్మాతగా పురాణాలు గౌరవిస్తాయి. ఇది ఇక్ష్వాక పాలకుల రాజధాని. ఈ వంశంలో 31వ రాజు హరిశ్చంద్రుడు. సాగరం అనే పేరుకు మూలమైన సగరుడు, రఘు మహారాజు కూడా ఆ వంశీకులే. రఘువు మనుమడు, కోసలను పాలించిన 63వ చక్రవర్తి దశరథుడు. ఆయన కుమారుడు శ్రీరాముడు. వాల్మీకి విరచిత ‘రామాయణం’, తులసీదాసకృతి ‘రామచరిత మానస్‌’, ‌కంబకవి ‘కంబ రామాయణం’ కూడా అయోధ్య ఔన్నత్యం గురించి వర్ణిస్తాయి. తమిళ వైష్ణవభక్తులు ఆళ్వారులు అయోధ్యను తమ పవిత్ర గ్రంథాలలో శ్లాఘించారు. ఒకటి కాదు, రెండు కాదు- విశ్వవ్యాప్తంగా ఉన్న మూడు వందల రామాయణాలు అయోధ్య, సూర్యవంశీకులు, శ్రీరాముని గాథ గురించి ముక్తకంఠంతో చెబుతాయి. పలు ఆసియా దేశాలలోను అయోధ్య రామకథ వినపడుతుంది.
జయించలేనిది…
సూర్యవంశీకుడు ఆయుధ్‌ ‌పేరుతోనే అయోధ్య వెలసిందని మన పురాణాలు చెబుతాయి. యుద్ధ్ అన్న సంస్కృత పదం నుంచి ఆయుధ్‌ అన్న పదం ఉద్భవించింది. అంటే అపరాజితుడు. అయోధ్య అంటే- జయించశక్యం కానిది. గంగానది ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అయోధ్య అనే పదం వినిపిస్తుంది. అయోధ్య హిమాలయాలంత పురాతనం. గంగా గోదావరులంత సనాతనం. వేదమంత ప్రాచీనం.
పురాణేతిహాసాలు రెండూ అయోధ్య పేరుతో వాటినవి అలంకరించుకున్నాయి. జైన, బౌద్ధ ఆధ్యాతిక కేంద్రంగానూ అయోధ్య విలసిల్లింది. జైనమతానికి ఆద్యుడు రిషబదేవుడు ఇక్కడే పుట్టాడంటుంది చరిత్ర. మహావీరుడు, గౌతమబుద్ధుడు ఈ నగరం వచ్చి వెళ్లారనీ చెబుతోంది. జైనంలోని పంచ తీర్థంకరులు- అదినాథ్‌ (‌మొదటివారు), అజిత్నానాథ్‌ (‌రెండు), అభినందనాథ్‌ (‌నాలుగు), సుమతీనాథ్‌ (ఐదు) అనంతనాథ్‌ (‌పద్నాలుగు) అయోధ్యలోనే జన్మించారని చరిత్ర చెబుతోంది.
ఇవిచాలు, అయోధ్య, ఆ నగరంతో రాముడి అనుబంధం ఎంత పురాతనమైనవో, చరిత్రాత్మకమైనవో చెప్పడానికి!
మూలాల కోసం అన్వేషణ
గ్రీకులు మొదలు, హూణులు, మహమ్మ దీయులు, ఆంగ్లేయుల వరకు విధర్మీయులు, దురాక్రమణదారులు నిరంతరం చేసిన వందల దాడులలో గాయపడిన భారతీయ ఆత్మ, పోరాటాలతో అలసిపోయిన భారతీయత మాటలకందని ఒక విస్మృతి బారిన పడిపో యింది. వేనవేల శాపాలతో సమానమైన ఆ ధార్మిక విస్మృతి, ఘోర పతనాల నుంచి బయటపడే మహా ప్రయత్నానికి శ్రీకారం చుట్టినది- ఆ అయోధ్య పోరుతోనే. అక్కడ పుట్టిన రాముడి గాధ ఇచ్చిన దీప్తిధారతోనే. ఆ క్రమంలోనే అయోధ్యలో రామజన్మభూమి ఆనుపానులు కనుగొనే యత్నం దాదాపు 150 ఏళ్లు సాగింది. పురావస్తు శాస్త్రవేత్తలు అలెగ్జాండర్‌ ‌కన్నింగ్‌హామ్‌ (1862-63), ఏకే నారాయణ్‌ (1969-70), ‌బీబీ లాల్‌ (1975-76) అక్కడ తవ్వకాలు జరిపారు. తరువాత బీఆర్‌ ‌మణి నాయకత్వంలో, అలహాబాద్‌ ‌హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్కియలాజికల్‌ ‌సొసైటీ ఆఫ్‌ ఇం‌డియా కూడా తవ్వకాలు (2003) జరిపింది.
క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దం నుంచి ఈ నగరం ఉనికిలో ఉన్నట్టు నారాయణ్‌ (‌కాశీ విశ్వవిద్యాలయం) జరిపిన తవ్వకాలతో వెల్లడైంది. ఆమ్‌స్టర్‌డ్యామ్‌ ‌విశ్వవిద్యాలయానికి చెందిన హన్స్ ‌బెకర్‌ ‌రాసిన ‘అయోధ్య చరిత్ర: క్రీస్తుపూర్వం ఏడో శతాబ్దం నుంచి క్రీస్తుశకం 18వ శతాబ్దం వరకు’ ఏమంటున్నది! సాకేతనగరం అని పిలిచే అయోధ్య, కాశీ ఎంత పురాతనమైనదో అంతే పురాతనమైనది అని. 1986లో వెలువడిన ఈ చరిత్ర గ్రంథం లెక్కలలో అయోధ్య రెండో నగరీకరణ యుగం (క్త్రీస్తుపూర్వం 600-200) నాటిది. కోసల జనపదంలోనిది. అయోధ్య సాకేతనగరం అనే మరో పేరుతో ప్రసిద్ధమైనది గుప్తులకాలంలోనే. అయోధ్యకు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరామదండ గ్రామంలో దొరికిన శాసనం ఈ విషయం వెల్లడిస్తున్నది. అది క్రీస్తుశకం 435 నాటిది. గుప్తవంశీకుడు కుమార గుప్తుని (క్రీస్తుశకం 415-455) మంత్రి పృథ్వీసేనుడు అయోధ్య బ్రాహ్మణులకు దానాలు ఇచ్చినట్టు ఆ శాసనం చెబుతున్నది. ఒకసారి భయానకమైన వరదలు రావడంతో స్కందగుప్తుడు (455-467) పాటలీపుత్రం నుంచి రాజధానిని అయోధ్యకు తరలించాడని హన్స్ ‌బెకర్‌ ‌రాశారు. రామచంద్ర ప్రభువుకు చెందిన అయోధ్యను గుప్తులు ఆదరించారు. క్రీస్తుశకం ఐదో శతాబ్దంలో అయోధ్య వైభవం ఎంతటిదో కాళిదాసు రఘువంశ కావ్యం చెబుతుంది. క్రీస్తుశకం ఆరో శతాబ్దంలో హూణులు మిహరగులుని నాయకత్వంలో దండయాత్రకు వచ్చారు.అప్పటి నుంచే అయోధ్య ప్రాభవానికి భంగం కలిగింది. అటు రాజకీయంగా, వాణిజ్యపరంగా కూడా ప్రాముఖ్యం తగ్గింది. అప్పుడే అయోధ్యకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనౌజ్‌ ‌ప్రాధాన్యం సంతరించుకుంది.
క్రీస్తుశకం 11వ శతాబ్దంలోనే అయోధ్య భారతావనిలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం. అక్కడ చాలా ఆలయాలు విష్ణువుకు అంకితం చేశారు. పేరుకు విష్ణువే అయినా ఆ మందిరాలలో ప్రతిష్టించినవన్నీ రాముడి ప్రతిమలే. చైనా యాత్రికుడు హుయాన్‌ ‌త్సాంగ్‌ ‌హర్షవర్ధనుడి కాలంలో కనౌజ్‌ ‌వచ్చాడు. పది దేవాలయాలు ‘దేవస్‌’‌కు సమర్పించా రని రాశాడు. ఇది అయోధ్యకు సంబంధించినదే. క్రీస్తుశకం 1090 ప్రాంతంలో అయోధ్యను పాలించిన వాడు చంద్రదేవ. ఇతడు సరయు తీరంలో అనేక ఆలయాలు కట్టించి చంద్రహరి (చంద్రుడు)కి కైంకర్యం చేశాడు. 12వ శతాబ్దంలో రాముని కోసం అయోధ్యలో మూడు ఆలయాలు కట్టించారని చెబుతారు. వాటి జాడలు ఇప్పుడు లేవు.
ధార్మిక విస్మృతికి బీజం
1193లో కనౌజ్‌ ‌పాలకునిగా జయచంద్రుడు ఉన్నాడు. అతడి కాలంలోనే మహమ్మద్‌ ‌ఘోరి దండయాత్ర జరిగింది. పరమత సహనమంటే ఎరుగని మతోన్మాదం చేతిలో భారతీయ ధర్మం తొలిసారి ఘోరంగా మోసపోయినది అప్పుడే. తన పుత్రుల అనైక్యతను చూసి, ధార్మిక విస్మృతిని చూసి మరొకసారి భారతమాత కన్నీరు పెట్టిన దుర్దినాలు కూడా అప్పటివే. ఆ కన్నీటి చారికల తడి ఆరడానికి శతాబ్దాలు పట్టింది. ఇతర మతాల వారి ఆలయాలను, వారు ఆరాధించే ప్రతిమలను అపవిత్రం చేస్తే తమ మతంలో పవిత్రులుగా మిగిలిపోతామనే విధ్వంసక సూత్రాన్ని పాటించే మతానుయాయుల ప్రాబల్యం ప్రారంభమైంది. మతం పేరు చెబితే చాలు ఉన్మాదంతో ఊగిపోయే శక్తులకీ, మతం పట్ల సున్నితభావాలకు పరిమితమయ్యే హిందువులకూ మధ్య ఒక అసమతౌల్య ఘర్షణకు అప్పుడే బీజం పడింది.రాజ్యరక్షణ ధర్మరక్షణ మధ్య ఉన్న తాత్త్విక బంధాన్ని గమనించలేని దుర్దశ ఆనాడు ఉంది. సాంస్కృతిక ఏకత్వం ఉన్నా, భౌగోళిక ఏకత్వ ప్రాధాన్యాన్ని విస్మరించిన చేటుకాలమది. అది విధర్మానికి చోటిచ్చింది. విదేశీయులకు అందలమే ఇచ్చింది. హిందువులు తమ వైఖరిని వీడక అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయోధ్యలోని వివిధ దేవాలయాలను 1528-29 కాలంలో ధ్వంసం చేశారని చరిత్ర చెబుతుంది. ఇందుకు కారకుడు మీర్‌ ‌బకీ. ఇతడు మొగల్‌ ‌వంశస్థాపకుడు జహరుద్దీన్‌ ‌మమహ్మద్‌ ‌బాబర్‌ ‌సేనానులలో ఒకడు.
మూర్తీభవించిన ఆర్షధర్మ విధ్వంసం, మొగల్‌ ‌పాదుషా ఔరంగ్‌జేబ్‌ ఆదేశాలతో నేలమట్టం చేసిన ఆలయ సంపద అయోధ్యలోనిదే. ఇదంతా చంద్రదేవ్‌ అర్పించినదే. జైన తీర్ధంకరుడు ఆదినాథ్‌ ఆలయాన్ని నేలమట్టం చేసినది కూడా అప్పుడే. ఇంతలో భక్తి ఉద్యమం తన వంతు సేవ చేసింది. విద్వేషానికీ, విధ్వంసానికీ అదొక ఆటవిడుపు. నిజానికి కంటితుడుపు.
1707లో ఔరంగ్‌జేబు మరణంతో మొగల్‌ ‌సామ్రాజ్యం పతనం ఆరంభమైంది. అయోధ్య నవాబుల స్వాధీనమైంది. కానీ నవాబు షియా శాఖకు చెందినవాడు. మత సహనం కలిగినవాడు. వీరి కాలంలోనే ఫైజాబాద్‌ ‌రాజధానిగా అవతరించింది. ఇది అయోధ్యకు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. షియా నవాబుల ఏలుబడిలో లభించిన వెసులుబాటు లోనే అహల్యాబాయి హోల్కార్‌, ‌జైపూర్‌ ‌రాజులు, నాగ్‌పూర్‌ ‌భోంస్లేలు అయోధ్యలో కొన్ని మందిరాలను పునరుద్ధరించారు. అయోధ్యలో ప్రముఖంగా ఉండే హనుమాన్‌ ‌గార్హి (హనుమ మందిరం) 1774లో నవాబు షుజా ఉద్దౌలా కాలంలో నిర్మించారు. ఈ ఆలయం కోసం 20 ఎకరాల భూమిని అతడే ఇచ్చినట్టు పర్షియన్‌ ‌భాషలోని ఒక శాసనం చెబుతున్నది.
ఔరంగ్‌జేబ్‌ ‌వంటి సున్నీతెగ మతోన్మాది ప్రభావం అయోధ్యను వీడలేదు. అతడి బాటలోనే దాదాపు మూడువేల మంది మత ఛాందసులు స్థానికుడే అయిన మౌల్వీ అమీర్‌ అలీ అమేథ్వీ నాయకత్వంలో హనుమాన్‌ ‌గార్హి మీద 1855లో దాడులకు ప్రయత్నించారు. అయితే నాటి నవాబు వాజిద్‌ అలీ షా తన సైన్యాన్ని పంపించి ఈ దాడిని అణచివేశాడు. నవాబు, అమేథ్వీ సేనలకు బారాబంకి జిల్లాలో జరిగిన యుద్ధంలో అమేథ్వీ సహా 300 మంది చనిపోయారు. ఒక మసీదు మీదే ఆలయం నిర్మించారని అమేథ్వీ, అతడి ముస్లిం ఛాందస మూక అభియోగం. ఈ సాకుతోనే మరొకసారి అయోధ్య మీద దండెత్తి, ఆధిపత్యం సంపాదించాలన్న ప్రయత్నమే అమేథ్వీ దాడి వెనుక కనిపిస్తుంది. 1855లోనే అయోధ్య నవాబు ఆలస్యం చేయకుండా అమేథ్వీ ఆరోపణలోని నిజానిజాలను వెలికి తీయడానికి ఒక సంఘం ఏర్పాటు చేశాడు. ఈ బృందం తేల్చిన వాస్తవం- హనుమాన్‌ ‌గార్హి నిర్మాణం మసీదు మీద జరగలేదు. ఆ సమయంలో అమేథ్వీ చర్యకు నిరసనగా, అప్పటికే జన్మభూమి మసీదుగా పేరు పొందిన బాబ్రీ మసీదు మీద కొందరు సాధువులు దాడి చేశారు.
వాల్మీకి వర్ణనలో..
వైవస్వత మనువు మొదలుకొని యీ భూమినేలిన రాజులందరిలోనూ ‘ఇక్ష్వాకు’ వంశీయులు చాలా గొప్పవారు. ఎంతలేసి యుద్ధాల్లోనూ కూడా వారు అపజయం అన్నది యెరగరు. సప్తద్వీపాత్మిక అయిన యీ భూమి, ఇక్ష్వాకు వంశీయులకందరికి యెవరికి వారికే వారి కోసమే పుట్టుకు వచ్చిందా అన్నట్టు వుండేది. వారిలో సగరుడనే రాజు చాలా ప్రసిద్ధి పొందాడు. అతని వల్లనే సముద్రానికి సాగరం అన్న పేరు వచ్చింది. అతనికి అరవైవేల మంది కొడుకులు. తండ్రి జైత్రయాత్రకు బయలుదేరితే వారందరూ కూడా యుద్ధసన్నద్ధులై వెళ్లేవారు.
ఆ దేశంలో వున్న నగరాలన్నింటిలోనూ ‘అయోధ్యా’ అనేది చాలా గొప్పది. ప్రపంచం అంతటా అది మిక్కిలి పేరు పడ్డది. మనువు స్వయంగా నిర్మించిన నగరం అది. కోసల దేశాధిపతులైన యిక్ష్వాకు వంశీయులకందరికీ ఆ నగరమే రాజధాని.
దాని పొడుగు పన్నెండు యోజనాలు, వెడల్పు మూడు యోజనాలు. ఆ నగరవీధులు విశాలంగా తీర్చిదిద్ది వుంటాయి(ఒక యోజనం అంటే నాలుగు క్రోసులు లేదా కోసులు. ఒక కోసు అంటే రెండు మైళ్లు). ప్రతీ దినమూ ఆ వీధులలో ముందుగా నీళ్లూ, తరువాత పువ్వులూ ముత్యాలూ చల్లుతూ వుంటారు.
రాజ్యం పెంపుచేసుకోవడంలో మిక్కిలి నేర్పుగల దశరథుడనే మహారాజు, స్వర్గంలో దేవేంద్రుడులాగ, ఆ నగరంలో నివసిస్తూ వుంటాడు.
స్త్రీలకు వొడ్డాణంలాగ ఆ నగరానికి చుట్టూ బలమైన ప్రాకారం వుంది. రాకపోకలకు వీలుగా వుండేటట్టు ఆ ప్రాకారానికి అక్కడక్కడ ఎత్తయిన ద్వారాలున్నాయి. ఆ నగరంలో అనేక విధాలైన యుద్ధ యంత్రాలూ, ఆయుధ విశేషాలూ నిండుగా వున్నాయి. అందున్న గుర్రాలకూ ఏనుగులకూ లొట్టిపిట్టలకూ అంతూ పొంతూ లేదు. అగడ్త చాలా లోతుగానూ వెడల్పుగానూ వుంది. దేవతలకు గూడా జయించరాని కోట అది.

About The Author