న్యాచరోపతి ప్రకారంగా పచ్చళ్ళు ఆహారంలో ఉపయోగించడం వల్ల అవి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వాడాల్సిన పదార్థాలు అతిగా కాకుండా… తగుమోతాదులో ఉపయోగించి తయారుచేసే పచ్చళ్ళు, రుచికరమూ, ఆరోగ్యదాయకమూ కూడానూ.
మా బాల్యంలో మా అమ్మగారు చేస్తున్న రోటి పచ్చళ్ళు లో ముల్లంగి పచ్చడికి చాలా ప్రాధాన్యం ఉండేది. మా తాతయ్యకు వారంలో రెండుసార్లయినా ముల్లంగి పచ్చడి తయారు చేయాల్సిందే. మా బాల్యంలో మేమైతే ముల్లంగి పచ్చడికి ఆమడదూరమన్నమాట, ముల్లంగి పులుసన్నా,పచ్చడన్నా ఏహ్యాభావం, ముఖ్యంగా దాని వాసన మాకు నచ్చేదికాదు. అందులోని ఔషధగుణాలు, ఆరోగ్యానికి ఎంత మంచిదన్న విషయాన్ని మా తాతయ్య వివరిస్తుంటే పెడచెవిన పెడుతుండేవారమేకాని, ఆసక్తి కనబరచేవారం కాదు. ఇప్పుడైతే వయసు మీదపడి నాటి పాత ఆహారపు అలవాట్లు, ఆచార విచారాలా గొప్పతనం బోధపడుతోంది. అందుకే అన్నారు పెద్దలు, “తనదాక వస్తేకాని తెలిసిరాదంటూ”. ఇప్పుడైతే పులుసు చేయడానికని ముల్లంగి కొన్నామంటే తప్పకుండా అందులోంచి రెండు గడ్డలైనా వేరుగా ఉంచి పచ్చడి చేసేస్తామన్నమాట. ఇక్కడ మళ్ళీ సీన్ రిపిటీషన్. ముల్లంగి పచ్చడి ,వాటి వాసన మా పిల్లలకు నచ్చదు, మాకు చాలా ఇష్టం.
ఇంతకూ మేము ముల్లంగి పచ్చడి తయారు చేసే విధానం ఎలాగంటే:
ఓ రెండు మూడు ముల్లంగీలనూ బాగా కడిగి, పీలర్ తో పైభాగాన్ని పొరలాగ తీసివేసి, సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి,
స్టౌ మీద బాణలి ఉంచి అందులో ఓ టీ చెంచా నూనె వేసి, పావు చెంచా మెంతులు వేసి వేయించి, ఓ పది, పదిహేను ఎండుమిరపకాయలు వేసి కలియబెట్టి,తరిగిన ముల్లంగి ముక్కలు వేసి, చిటికెడు పసుపు వేసి, కొద్దిగా చింతపండు వేసి కలియబెట్టి దించేయాలి. చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసి రోట్లో కాని, మిక్సీలో కాని పచ్చడి చేయాలి.
ఈ పచ్చడిని ఓ గిన్నెలో తీసుకుని పోపు పెట్టాలి. అంతే చాలా సులభంగా రుచికరమైన ఆరోగ్యకరమైన ముల్లంగి పచ్చడి రెడీ. ‌ వీటిని అన్నంలో నికి, రాగి ముద్దకు, రొట్టెలకు సాధకంగా ఉపయోగించవచ్చు‌
గమనిక: మెంతులు కాని, చింతపండు కాని చాలా కొద్దిగానే వేయాలి. ఎక్కువైతే, చేదుగా ను,పుల్లగాను తయారై తినడానికి బావుండదు.
తడి తగలకుండా ఉంచితే రెండు రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఉంచితే ఓ వారం రోజులు బాగుంటుంది.

About The Author