షర్మిల టీంలోకి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్…
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఆలోచనాపరులు, మేధావులు, సమాజ సేవకులు, అన్ని వర్గాల ప్రజలకు తన పార్టీలో స్థానం కల్పించేందుకు ఆమె కసరత్తు చేస్తున్నారు. పార్టీలో చేరేబోయే వ్యక్తులను బట్టి పార్టీపై ప్రజల్లో ఓ పాజిటివ్ దృక్పథం కలిగేలా ఆమె ఆలోచిస్తున్నారని తెలిసింది.
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పార్టీలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ చేరనున్నారు. ఈ మేరకు ఆమెను లోటస్‌పాండ్‌లో ఆయన ఈ రోజు కలవనున్నట్టు సమాచారం.
బ్రదర్ షఫీ గురించి యువతకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఉజ్వల భవిష్యత్ కోసం విద్యార్థుల్లో పాజిటివ్ ఆలోచనలను రేకెత్తించే క్రమంలో షఫీ అద్భుత ఉపన్యాసకుడిగా పేరు పొందారు.
బ్రదర్ షఫీ లాంటి మోటివేషనల్ స్పీకర్ షర్మిల పెట్టబోయే పార్టీకి అదనపు బలమని చెప్పొచ్చు. ఇలా ఒక్కొక్కరిగా షర్మిల పార్టీ వైపు తటస్థులు, మేధావులు, సమాజానికి ఏదైనా చేయాలనే కాంక్షతో ఉన్న వారు ఆకర్షితులవుతున్నారు. అలాంటి వారికి తన నేతృత్వంలో ఆవిర్భవించే పార్టీ సరైన వేదిక కావాలని షర్మిల భావిస్తున్నారని తెలిసింది.