మళ్ళీ మోగుతున్న ఆంధ్రోళ్ల దోపిడీ నినాదం…


తెలంగాణా ఉద్యమంలో ఆంధ్రావాళ్ళు దోపిడీదారులంటూ టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణాకు తీవ్ర అన్యాయం జరిగిందని నినదించారు. ఆంధ్రా దోపిడీ కారణంగా తెలంగాణ నిర్వీర్యమైపోయిందన్నారు. ఈ విధంగా అప్పట్లో తెలంగాణా సెంటిమెంటును తీవ్రంగా రెచ్చగొట్టారు. ప్రత్యేక తెలంగాణా సాధించుకొని పరిపాలన సాగిస్తూ దేశంలో నెంబర్ వన్ తామేనని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో మరోసారి ఆంధ్రోళ్ల దోపిడీ నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు.

దానికి చిలవలు పలవలు అల్లుతున్నారు. ఇందుకు కారణం వైఎస్ షర్మిల. ఆమె ఎలా కారణమవుతుంది ? ఎందుకంటే ఆంధ్రాకు చెందిన షర్మిల తెలంగాణా రాజకీయాల్లో ప్రవేశించింది. పార్టీ పెడతానంటోంది. పాదయాత్ర చేస్తానంటోంది. రాజన్న రాజ్యం తెస్తానంటోంది. అంటే వచ్చే ఎన్నికల్లో ఎన్నికల బరిలో ఉంటుందనే అర్థం కదా. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.

ఈలోగా షర్మిల పార్టీ పెట్టి, దాన్ని బలంగా తీర్చిదిద్ది, ప్రజల ఆదరణ పొందాలి కదా. ఇది అనుకున్నంత సులభం కాదు. కానీ టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా మంత్రులు కేసీఆర్ స్థానాన్ని షర్మిల ఆక్రమిస్తుందని భయపడుతున్నారా? లేదా ప్రజల్లో తెలంగాణా సెంటిమెంటును మళ్ళీ రాజేస్తున్నారా ? అర్థం కావడంలేదు.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ బలపడుతోన్న వేళ.. కొత్త పార్టీతో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ప్రముఖులు తెలంగాణలో షర్మిల ఎంట్రీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే బాటలో అధికార పార్టీ నాయకులు, మంత్రులు కూడా నడుస్తున్నారు. దీంతో షర్మిలను వారే పాపులర్ చేస్తున్నారని అనిపిస్తోంది. షర్మిలపై కామెంట్లు చేయవద్దని ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

అయినప్పటికీ కేసీఆర్ కు అత్యంత ఆప్తులుగా ముద్రపడిన మంత్రులు కొందరు షర్మిలపై మాటల బాణాలు వదులుతూనే ఉన్నారు. మళ్ళీ ఆంధ్రోళ్ల దోపిడీ జరుగుతుందని మాట్లాడుతున్నారు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు వ్యవహరిస్తున్నారు. షర్మిల పార్టీ పెట్టినా భయపడేది లేదని మంత్రి శ్రీనివాస గౌడ్ మొదట కామెంట్ చేశాడు.

షర్మిల పెట్టబోతున్నది మతపరమైన పార్టీ అని మరో మంత్రి ఈటల రాజేందర్ అన్నాడు. వీళ్ళ వ్యాఖ్యల్లో డోసు తక్కువగానే ఉంది. కానీ తాజాగా మరో మంత్రి గంగుల కమలాకర్ కాస్త డోసు పెంచి అవాకులు చెవాకులు పేలాడు.

కరీనంగర్ జిల్లా టీఆర్ఎస్ ముఖ్యుడు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ వైఎస్ షర్మిల కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. షర్మిలను అడ్డుకోడానికి తెలంగాణ సమాజం ఏం చేయాలో చెప్పాడు తెలంగాణలో వైసీపీకే అభిమానులు లేరని, అలాంటప్పుడు షర్మిలకు ఎక్కడి నుంచి వస్తారని, రాయలసీమ ఫ్యాక్షన్ కుయుక్తులు ఇక్కడ చెల్లబోవంటూ ఇదివరకు కామెంట్ చేసిన గంగుల ఇంకాస్త డోసు పెంచాడు.

‘‘సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో మనకు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఆరేళ్లైనా గడిచిందో లేదో.. మళ్లీ ఆంధ్రా శక్తులు పురివిప్పుతున్నాయి. వాళ్లు 70 ఏళ్లు పాలించి, మనను అన్ని రకాలుగా వంచించారు. ఇప్పుడు మనకు నీళ్లు, కరెంటు వచ్చే సరికి వాళ్ల కడుపుల్లో మంట మొదలైంది. జగనన్న బాణాన్ని అంటూ షర్మిలక్క ఎంట్రీ ఇస్తున్నది ఎందుకోసం? మన నీళ్లు, కరెంటును దోచుకుపోవడానికి కాదా? ఇవాళ జగనన్న బాణం షర్మిల వచ్చింది. రేపు జగనన్నే దిగుతాడు. ఆ వెంటనే చంద్రబాబు కూడా వచ్చేస్తాడు. ఇంకేముంది.. తెలంగాణలో మళ్లీ కొట్టాటలు మొదలవుతాయి.

బాణాలుగా దూసుకొస్తోన్న ఆంధ్రా శక్తుల నుంచి తెలంగాణను కాపాడే ఏకైక రక్షకుడు కేసీఆర్ ఒక్కడే. అందుకే టీఆర్ఎస్ పార్టీని బతకనీయాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. ఒకవేళ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీగానీ లేకపోతే మళ్లీ ఆంధ్రా శక్తులు అందరూ వచ్చి.. తెలంగాణను కబ్జా చేసి.. ఉన్న నీళ్లను ఎత్తుకెళ్తారు.. ఈ జగనన్న బాణం షర్మిల వస్తే ఇక్కడ నీళ్లుంటాయా? ఎల్లంపెల్లి, మేడిగడ్డ ప్రాజెక్టులను ఉంచుతరా? వాటిని పగలగొట్టి మరీ వీళ్లు నీళ్లు తీసుకుపోరా? కాబట్టే.. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది.

కేసీఆర్ లేకపోతే మళ్లీ షర్మిల, జగన్, చంద్రబాబులు వచ్చిపడతారు. ఆ తర్వాత తెలంగాణ పోయి, మళ్లీ సమైక్య రాష్ట్రం వస్తుంది. ఆ కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఇంటి పార్టీని మరింతగా బలపర్చాలి. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే కాంగ్రెస్, బీజేపీలు మన పార్టీలు కావు. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే టీఆర్ఎస్ ఒక్కటే మనకు అండ. మన కోసం కాకున్నా మన బిడ్డల భావి తరాల కోసమైనా టీఆర్ఎస్ ను పలపర్చండి..” అని మంత్రి గంగుల కమలాకర్ చెప్పుకొచ్చాడు.

తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ వ్యవహారంపై టీఆర్ఎస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మంత్రులు మాత్రం తరచూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ కు హోరాహోరీ పోరు తప్పని పరిస్థితుల్లో.. కాంగ్రెస్-టీడీపీలు జత కట్టడం, తెలంగాణలో ప్రచారానికి చంద్రబాబు సైతం సిద్ధం కావడం టీఆర్ఎస్ కు లాభించింది.

కాంగ్రెస్ కు ఓట్లేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని, తద్వారా ఆంధ్రా శక్తులు మళ్లీ పుంజుకుంటాయని కేసీఆర్ ప్రచారం చేశారు. చంద్రబాబు ద్వారా లబ్ది పొందామని పరోక్షంగా అంగీకరించిన కేసీఆర్.. బాబుకు రిటర్న్ గిప్టు కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతోన్న రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ద్వారా మళ్లీ ‘ఆంధ్రా బూచి’ని ప్రచారాస్త్రంగా టీఆర్ఎస్ వాడుకోబోతోందని మంత్రుల వ్యాఖ్యలతో తేటతెల్లం అవుతోంది.

About The Author