అంతర్వేది… నరసాపురం.


మాఘమాసం వస్తోందంటే నరసాపురం కళకళలాడిపోయేది.ఊరు ఊరంతా గోదారొడ్డుకు సాగిపోయేది.కళ్ళన్నీ లాంచీల రేవు లోనే నిలిచిపోయేవి.
#రథసప్తమి మాఘస్నానం పేరు చెప్పి గోదారి స్నానానికెళ్ళి లాంచీల రేవులో సందడి మొదలయ్యిందా లేదా అని చూసే వాళ్ళం.కూలీలు సర్వే బాదులు తీసుకొచ్చి గోదాట్లో జట్టీలు(platforms)కడుతుండే వారు.ఇక చూస్కోండి సందడే సందడి.స్కూల్ లో స్కౌట్ మాస్టారు దగ్గరకు పరుగెత్తే వాళ్ళం. తిరనాళ్ళకు మా పేరు రాసుకోమని వేడుకునే వాళ్ళం.
ఇంకో రెండు రోజుల్లో రేవంతా లాంచీలతో నిండిపోయేది. ‘డుగ్..డుగ్…డుగ్గంటూ మా ఎదలకు లాంచీల శబ్దం తాళం వేసేది.చెవులకు మృదుమధురంగా వినిపించేది.స్టీమర్ రోడ్డంతా కొట్లు వెలిసిపోయేవి.బస్ స్టాండ్ ఎదురుగా పందిర్లు వేసేవారు.
ఇక దశమి వచ్చిందంటే స్కౌట్ యూనిఫామ్ వేసేసుకుని స్కూలుకు వెళ్ళిపోయే వాళ్ళం.మాస్టారు రేవుకు తీసుకెళ్ళి పిల్లలందరికీ డ్యూటీలు అప్పజెప్పేసేవాళ్ళు. అప్పటికే యాత్రీకుల క్యూ లైనులు మొదలైపోయేవి.
“అంతర్వేది పోవు యాత్రీకులు మూడో నంబరు జట్టీ మీదకు రావాలి మురళీకృష్ణ లాంచీ యాత్రీకుల కోసం సిద్దంగా ఉంది.”
“ఏయ్ సావిత్రీ నువ్వు రెండో నంబరుకెళ్ళాలి(తప్పుగా అనుకోకండి.సావిత్రి లాంచీ పేరు)”
” ఓయ్ లక్ష్మీ నరసింహా డ్రైవర్ నువ్వు వెంటనే లాంచీ తియ్యాలి. జెట్టీ ఖాళీ చెయ్యాలి”
మైకులు ఈ ఎనౌన్స్ మెంట్లతో మార్మ్రోగిపోయేవి.
లాంచీల రేవునుంచి టేలర్ హైస్కూల్ ,స్టీమర్ రోడ్డు, మెయిన్ బజార్ ల మీదుగా బస్ స్టాండ్ వరకూ యాత్రీకుల క్యూలు ఉండేవి. పీయస్టీన్ క్లబ్ లో పోలీసులు నిండిపోయేవారు.హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిరంజులుచ్చుకుని యములాళ్ళలా నిలబడే వాళ్ళు . యాత్రీకులు వాళ్ళ కంట్లో పడకుండా లాంచీ ఎలా ఎక్కేయాలా అని చూసే వాళ్ళు. వాళ్ళ కంట పడ్డామో ఇంతే సంగతులు. బొటనవేలంత లావున్న సూదిని జబ్బలో కసక్కన దింపేసే వాళ్ళు. ఎలాగోలా టిక్కెట్ సంపాదించేసి లాంచీ ఎక్కేసే వాళ్ళు.మాకైతే టిక్కెట్ లేదు.మరి మేం బాలభటులం కదా!పాపం ముసలోళ్ళొస్తే జాగ్రత్తగా జెట్టీ మీద నడిపించుకు తీసికెళ్ళే వాళ్ళం.
మెల్లగా లాంచీ ఎక్కి అంతర్వేది చెక్కేసే వాళ్ళం.లక్ష్మీ నరసింహ స్వామిని రథం మీద చూసి జనాన్ని తోసుకుంటూపోయి తాడట్టుకోడానికీ,మొగల్తూరు రాజు గారిని చూడ్డానికి పోటీపడే వాళ్ళం. ముందురోజు రాత్రి కల్యాణంలో ఆ రాజు గారు కల్యాణం పూర్తయ్యేంత వరకూ అలా నిలువు కాళ్ళమీద నిలబడే ఉండే వారు.కల్యాణం కాగానే సముద్రానికెళ్ళి స్నానం చేసేసి లైట్ హౌస్ ,అన్నాచెల్లెళ్ళ గట్టు చూసేసి సత్రానికెళ్ళి భోంచేసేసి రథం చూసేసుకుని చెరకుగెడలు,వియ్యపరాల జీళ్ళు కొనుక్కొని తిరుగు ప్రయాణమయ్యే వాళ్ళం.

About The Author