సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఇది ఫైసల్‌ రాజీనామా నేపథ్యంలో భాజపాపై చిదంబరం ఫైర్‌…

సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఇది
ఫైసల్‌ రాజీనామా నేపథ్యంలో భాజపాపై చిదంబరం ఫైర్‌

శ్రీనగర్‌: కశ్మీర్‌లో వరుస హత్యలు, ముస్లింలపై వివక్షను నిరసిస్తూ ఐఏఎస్‌ అధికారి షా ఫైసల్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తోటి పౌరులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోందంటూ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.
‘షా పైసల్‌ రాజీనామా చేయడం విచారకరమే అయినా.. ఆయనకు నేను సెల్యూట్‌ చేస్తున్నా. ఫైసల్‌ చెప్పిన ప్రతి మాటా వాస్తవమే. ఆయన వేదనను యావత్‌ ప్రపంచం గుర్తిస్తుంది. కొద్ది రోజుల క్రితం పంజాబ్‌ మాజీ డీజీపీ జూలియో రిబెరో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయినా పాలకుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తోటి పౌరులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సిగ్గుతో, పశ్చాత్తాపంతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది’ అని చిదంబరం మండిపడ్డారు.
2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ టాపర్‌ షా ఫైసల్‌ (35) బుధవారం తన సర్వీసుకు రాజీనామా చేశారు. విదేశాల్లో శిక్షణ పూర్తిచేసుకుని ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్నారు. రాజీనామా విషయాన్ని బుధవారం ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో వెల్లడించారు. ‘కశ్మీర్‌లో హత్యాకాండ కొనసాగుతోంది. వీటి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కృషి చేయడంలేదు. దేశంలో ముస్లింలు వివక్షకు, అణచివేతకు గురవుతున్నారు. వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్నారు. వీటన్నింటిపై పోరాడేందుకు వీలుగా సివిల్‌ సర్వీస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నా’ అని ఫైసల్‌ పేర్కొన్నారు.

About The Author