అలిపిరి, తిరుమలలో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌..


అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న తితిదే ఈవో జవహర్‌ రెడ్డి

తిరుపతి(తితిదే): శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా తిరుపతిలోని అలిపిరి, తిరుమలలో అనువైన ప్రాంతాల్లో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని తితిదే ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తిస్థాయి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి తిరుపతిలో అనువైన 5 ఎకరాల స్థలాన్ని గుర్తించాలన్నారు. తితిదే విద్యాసంస్థల్లో బయోమెట్రిక్‌ హాజరు అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.ఎస్వీబీసీలో ఏడాదికి అవసరమైన కార్యక్రమాలతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఎండీని కోరారు. అలిపిరి నడకమార్గంలో భక్తులు ఇబ్బంది పడకుండా పైకప్పు నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించారు. తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి, స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, ఎఫ్‌ఏసీఏవో బాలాజీ, సీఈ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author