దాయర్తి (ఒక ఆదివాసీ గ్రామం కథ)


దాయర్తికి కరెంట్ వచ్చింది .. ఆదివాసీల ముఖాల్లో నవ్వు తెచ్చింది .. అవును.. ఆ ఆదివాసీల గ్రామంలో ఇప్పుడు వెలుగులు రాబోతున్నాయి.. ఇన్నాళ్లు చీకట్లో దీపపు బుడ్ల మధ్య బతికిన ఆ జనం ఇకపై కరెంట్ వెలుగు జిలుగుల్లో బతకబోతున్నారు.. జర్నలిస్టుగా నెలన్నర క్రితం ఆ గ్రామానికి వెళ్లినపుడు అక్కడి పరిస్థితి వేరు..కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నా జర్నలిజం కెరీర్ లో రిపోర్టింగ్ లో భాగంగా ఎన్నోసార్లు గిరిజన ప్రజలు ఉండే.. ఎత్తైన కొండ ప్రాంతాలకు వెళ్ళాను..నాలుగేళ్ల క్రితం ఒడిశాలోని మల్కాన్ గిరి సమీపంలో మా
మాచ్ ఖండ్ జలపాతం పైన ఉండే బోండా జాతి ఆదిమ వాసుల్ని గమనించాను.. అలాంటి జాతిని మళ్లీ ఇప్పుడు విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలోని దాయర్తి గిరిజన గ్రామానికి వెళ్ళాను..పంచాయతీ ఎన్నికల కవరేజ్ లో భాగంగా కొండప్రాంతాల్లో ఉన్న గిరిజన పంచాయతీల స్థితిగతుల మీద న్యూస్ కవరేజ్ చేయాలని అక్కడికి వెళ్ళాను..
స్వతహాగా గిరిజన ప్రాంతాల్లో సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానం తెలుసుకోవాలన్న ఆసక్తితో ఈ గ్రామాన్ని ఎంచుకున్నాను..కెమెరామ్యాన్ యశ్వంత్ ,అసిస్టెంట్ ప్రసాద్ తో కలిసి అక్కడికి వెళ్ళాను..
భూమి నుంచి వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆ గ్రామానికి దారి లేదు.. కొండని పగులగొట్టి గిరిజనులు చిన్న బాట ఏర్పాటు చేసుకున్నారు.. ఆ బాటలో నడుచుకుంటు వెళ్లొచ్చు..వాహనాలు వెళ్లడం చాలా కష్టం..ఒకవేళ వెళ్లే సాహసం చేసినా ఆ వాహనానికి అక్కడే ఇన్సూరెన్స్ క్లె యిమ్ చేసుకోవచ్చు.. అనేక మెలికలు తిరుగుతూ లోయల్లోంచి సాగుతుంది పయనం.. పంచాయతీ ఎన్నికల కవరేజ్ లో భాగంగా మేము.. విశాఖ నుంచి కొత్తవలస మీదుగా దేవరాపల్లి మీదుగా బల్లగరువ గ్రామానికి చేరుకున్నాము..
అక్కడివరకు మాత్రమే రోడ్డు ఉంది.. ఆ గ్రామంలో కారు వదిలేసి నడక మార్గం మొదలు పెట్టాము.. బల్లగరువ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు నత్లోమ్ మాతో కలిసాడు.. స్థానిక సీపీఎం నాయకుడు గోవింద్ , నత్లోమ్ తో పాటు కొండపైకి బయలుదేరాము.. ఆకాశాన్ని తాకుతున్నాయా..అన్నట్టుగా చెట్లు, జలపాతాలు, పొగమంచుతో అందంగా కనిపిస్తున్న కొండలు ఇలా ప్రకృతి సోయాగమంతా ఇక్కడే ఉందా అన్నట్టుగా అనిపిస్తున్న చోట నుంచి నడకగా బయలుదేరాము..అదృష్ట వశాత్తు ఒక ఆటో కొండపైకి వెళ్తోంది.. ఎవరికో ఆదివాసీలకి తీవ్ర అనారోగ్యంగా ఉంటే వాళ్ళు దేవరపల్లి నుంచి ఆటోమాట్లాడుకుని తీసుకెళ్తున్నారు.. మామూలుగా అయితే ఇక్కడికి ఆటోలు వెళ్లవు..ఇలా ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళాల్సి ఉంటుంది.. ఆటో ఆ రోడ్డులో వెళ్లడం చాలా కష్టంగా ఉంది.. *సగందూరం మమ్మల్ని ఆటో మూసుకెళ్తే..సగం దూరం మేము ఆటోను నెట్టాల్సి వచ్చింది*.. ఎనిమిది కిలోమీటర్ల దూరం కొండమీదికి చేరుకోవడానికి మాకు గంటన్నర సమయం పట్టింది..
అక్కడ అందమైన ఇళ్ళు, అమాయక గిరిజనం కనిపించారు. మట్టి గోడలతో ఇల్లు నిర్మించుకుంటున్నారు..రెండు డాబాలు కూడా ఉన్నాయి.. గుర్రాల మీద ఇసుక , కంకర మోసుకొచ్చి ఆ ఇళ్లు కట్టుకున్నారట..కొన్ని రేకుల ఇళ్ళు కూడా ఉన్నాయి.. ఆడవాళ్ళల్లో చాలామంది పెద్ద ముక్కుపుడకలు పెట్టుకున్నారు.. వాళ్ళు కేవలం చీర మాత్రమే కట్టుకున్నారు.. రైక ఉండదు.. వాళ్లంతా మమ్మల్ని గ్రహాంతర వాసుల్ని చూసినట్టు చూస్తున్నారు..వారి వారి ఇంటి ముందు కూర్చుని అమాయకంగా చూస్తున్నారు.. ఊరు మొత్తం నాలుగు వీధులు ఉన్నాయి.. అక్కడ పెద్ద వాళ్ళ కంటే పిల్లలు ఎక్కువగా కనిపించారు. కారణం తెలీదు కానీ పిల్లల ముక్కులు జలపాతాల్లా కారుతూనే ఉన్నాయి.. చాలా మంది పిల్లలకి కనీసం ఒంటి మీద దుస్తులు లేవు.. కొంతమందికి బట్టలు లేక ప్రభుత్వం ఇచ్చిన యూనిఫార్మ్ వేసుకుని ఉన్నారు.. పిల్లల ఒంటి నిండా మురికి ఉంది..బహుశా స్నానం చేయడం చాలా అరుదుగా అనిపించింది..
దాదాపు ఆరువందల మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి ఇంతవరకూ కరెంట్ లేదు.. దీపాలతోనే బతుకుతున్నారు..కరెంట్ ఉంటే కలిగే సౌకర్యం గురించి వాళ్ళకి పెద్దగా తెలీదు కాబట్టి కరెంట్ లేదన్న దిగులు వాళ్ళకి లేనే లేదు.. దీపపు వెలుగులోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు..
ఊళ్ళో ప్రతి ఇంటి ముందూ ఒక కొబ్బరి చెట్టు, ఒక జీలుగ చెట్టు పెంచుతున్నారు.. జీలుగ చెట్టు నుంచి కల్లు తీసి మాకు తాగమని ఇచ్చారు.. అలాగే కొబ్బరికాయలు కొట్టి తాగమన్నారు.. వాళ్ళ ఆతిధ్యం చూసి ఆశ్చర్యపోయాను.. మేము ఎవరో వాళ్ళకి తెలీదు.. కానీ మమ్మల్ని వాళ్ళ బంధువుల్లా చూస్తున్నారు.. ఊర్లో కాస్త చదువుకున్న గంగారాం.. మాతో చనువుగా మాట్లాడాడు.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు సర్… మా బతుకులు ఇలాగే ఉంటాయి.. రోడ్డు లేదు, కరెంట్ లేదు.. అడగడానికి మాకు నోరు లేదు అన్నాడు
స్కూల్ ఉంది కానీ మాస్టారు కొండపైకి రాడు.. ప్రాణం మీదికి వస్తే ఏ డాక్టర్ కూడా ఇక్కడికి రాడు.. అధికారులు, రాజకీయ నాయలులు ఎవరూ ఇక్కడికి ఎప్పుడూ రారు.. రోగమొచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు చాలామంది చనిపోయారు..డోలి కట్టి దానిమీదే కొండ దిగి దేవరపల్లి ఆసుపత్రికి తీసుకెళ్తాము.. దారిలోనే చాలామంది చనిపోయేవాళ్ళు.. నెలలు నిండిన గర్భవతి అసుపత్రికి మోసుకెళ్లేలోపు తల్లి బిడ్డ ఇద్దరూ చనిపోటున్నారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మేము అతనితో మాట్లాడుతున్నప్పుడే.. పక్కనే ఉన్న ఇంకో గ్రామం నుంచి డోలి మీద ఒక చిన్న పాపని మోసుకొస్తున్నారు.. ఇంకో గ్రామంలో ఉన్న నాటు వైద్యుడు దగ్గరకు మందులు ఇప్పించడానికి పాపని అలా మోసుకెళ్తున్నారు.. భుజాల మీద కర్ర పెట్టుకుని దానికి దుప్పటి కట్టి దానిలో పాపని పడుకోబెట్టి మోస్తున్నారు..డోలి లి అలా మోయడం చాలా కష్టం..అయిన సరే బాధని భరిస్తూ మోస్తూనే ఉన్నారు
ఇక దాయర్తి లో ప్రతి ఇంటి ముందు కొబ్బరి చెట్టుకు ఒక గుర్రం కనిపించింది.. అక్కడి జనం మొత్తం ఆ అగుర్రాన్ని ఎక్కి సవారీ చేస్తున్నారు..పొలం పనులకు వెళ్లాలన్నా.. దేవరపల్లి వెళ్లాలన్నా , సంతకు వెళ్లాలన్నా ఆ గుర్రాన్ని వాడుతున్నారు.. ఒక విధంగా అదే వాళ్ళకి కారు,బస్సు అన్నమాట.. గ్రామంలో రెండు బైకులు కూడా కనిపించాయి.. కానీ దానికి పెట్రోల్ కావాలన్నా మళ్ళీ దేవరపల్లి రావాల్సిందే.. అయితే అంత పెద్ద ఘాట్ రోడ్డు లో ఆ బైకులు కూడా ఎక్కలేక పాడైపోతున్నాయట.. పిల్లా..పెద్దా అంతా గుర్రాన్ని వినియోగిస్తున్నారు.. అయితే అనారోగ్యంగా ఉన్న వారిని మాత్రం గుర్రం మీద తరలించడం కష్టం..
అక్కడ కరెంట్ లేదు కానీ విచిత్రంగా సెల్ ఫోన్ సిగ్నల్ మాత్రం వస్తోంది.. అదికూడా 4జి ఇంటర్నెట్ కూడా వస్తోంది.. అందుకే ఆదివాసీలు సెల్ ఫోన్ వాడుతున్నారు.. దేవరపల్లికి గుర్రం మీద వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటారు.. ఛార్జింగ్ ఎక్కువసేపు వచ్చే ఫోన్లు వాడుతున్నారు..
ఊళ్ళో ఉన్న స్కూల్లో బెల్ మోగింది.. పిల్లలు అయినా చదువు కుంటున్నారు అని సంతోష పడ్డాను.కానీ స్కూల్ కి వెళ్లి చూస్తే పట్టుమని పదిహేను మంది కూడా లేరు.. ఎందుకంటే అక్కడ పిల్లలు ఎవరూ స్కూల్ కి వెళ్లడం లేదు.. కారణం మాస్టారు అసలు స్కూల్ కి రారు.. ఆ స్కూల్ లో హెడ్ మాస్టర్ సహా మొత్తం ముగ్గురు టీచర్లు రికార్డుల్లో ఉన్నారు.. కానీ ఎవరూ కొండపైకి రారు.. అలాగే అంగన్ వాడి కేంద్రం ఉంది. కానీ అంగన్ వాడి టీచర్లు, ఆయాలు ఎవరూ అక్కడికి రారు.. నేను వెళ్లెప్పుటికి ఆడపిల్లలు స్కూల్ నుంచి బయటకు వస్తున్నారు.. అందరూ బ్యాగులు తగిలించుకుని ఉన్నారు.. జగనన్న విద్యా దీవెన అని ఆ బాగుల మీద రాసి ఉంది.. పిల్లలు అందరూ ప్రభుత్వం ఇచ్చిన యూని ఫార్మ్ వేసుకున్నారు..అయితే ఆ యూనిఫార్మ్ చొక్కా గుండీలు పెట్టుకోవడం కూడా పిల్లలకి రావడం లేదు.. అలాగే యూనిఫార్మ్ కూడా పూర్తిగా మాసిపోయి మురికిగా కనిపించాయి.. బహుశా వాటిని ఉతికి చాలా రోజులు అయినట్టు ఉంది.. ఇక కాళ్లకి ప్రభుత్వం ఇచ్చిన బూట్లు వేసుకున్నారు.. అయితే అవి వారి సైజులు తగినవి ఇవ్వలేదు.. అందుకే సగం కాలు బయట పెట్టి చెప్పుల్లా వాడుతున్నారు.. ఇంకొంత మంది బూట్లని చేత్తో పట్టుకుని వెళ్తున్నారు..
ఇక స్కూల్ లో ఊడ్చి చాలా రోజులు అయినట్టుంది..మొత్తం చాలా మురికిగా చెత్తతో నిండిపోయి ఉంది. ఒక ముసలాయన పూర్తిగా ఊగిపోతూ, తూలిపోతూ బయటకు వచ్చాడు..ఇతనెవరు అంటే ఆయనే స్కూల్ హెడ్మాస్టర్ అని గంగారాం చెప్పాడు.. అతను నాటుసారా బాగా తాగేసి ఉన్నాడు..సరిగా నిలబడలేకపోతున్నాడు.. మాట కూడా సరిగా రావడం లేదు..
నెలకి నాలుగు రోజులు మాత్రం అలా వచ్చి స్కూళ్ళోనే నాటు సారా, జీలుగ కల్లు తాగి పడుకుంటాడట… అతనికి జీతం ఏకంగా లక్షా పదివేలు వస్తోందట.. మాస్టర్లు ఇలా తాగి పడుంటే మా పిల్లలు ఎక్కడ బాగు పడతారు సర్ అంటూ అతని ముండీ గంగారాం అన్నాడు..
మీరు అసలు టీచరేనా..ఇలా మీరే తాగి పడుకోవడం సిగ్గుగా అనిపించడం లేదా అని నేను అతన్ని గట్టిగా అంటుంటే..రెండు చేతులు జోడించి తప్పై పోయింది అంటున్నాడు.. అది కూడా సరిగా స్పృహలో లేకుండా మత్తులోనే చెబుతున్నాడు..
అక్కడి జనాల్లో చాలామందికి తెలుగు సరిగా రావడం లేదు..అంతా గోండు భాష మాట్లాడుతున్నారు.. ఒకరిద్దరు మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేసాను..కానీ వాళ్ళు విపరీతంగా సిగ్గు పడుతున్నారు..నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళి తలుపేసుకుంటున్నారు.. నేను చదువుకునే వయసులో ఇక్కడ స్కూల్ లేదు.. మా పిల్లలు చదుకోవడానికి స్కూల్ ఉంది కాని టీచరు లేరు అంటోంది ఒక యువతి..
మేము తిరిగి వచేస్తుంటే .. గ్రామస్తులంతా మోకాళ్ళ మీద కూర్చుని చేతులెత్తి మొక్కుతున్నారు.. మమ్మల్ని మీరైనా మనుషులుగా చూడమని ప్రాధేయపడుతున్నారు.. మా బతుకులు గురించి ప్రభుత్వానికి తెలియజేయమని విజ్ఞప్తి చేస్తున్నారు.. ఆ దృశ్యం చూశాక మనిషిగా పుట్టిన ఎవరికైనా సరే కళ్ళు చెమ్మగిల్లుతాయి.. మనిషులుగా మనతో పాటే పుట్టి ప్రపంచానికి, నాగరికతకు దూరంగా బతుకుతున్న వారికి చూసి జాలి కలుగుతుంది.. ప్రభుత్వాల సంగతి పక్కన బెడదాం.. ఏదో ఒక కార్పొరేట్ సంస్థ ఇలాంటి గ్రామాన్ని దత్తత తీసుకుని నిధులు ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి..
మేము తిరిగి వచ్చేస్తుంటే అక్కడ పిల్లలు బంతి ఆట ఆడుతూ కనిపించారు.. వెళ్లి ఆ బాల్ ని పట్టుకుని చూస్తే.. అది బాల్ కాదు.. మధ్యలో చిన్న మట్టిగడ్డ పెట్టి దానికి గుడ్డలు చుట్టి దాన్ని తాడుతో కట్టి బంతిలా ఆడుకుంటున్నారు.. తలంటు ఎరుగని జుట్టు,చీమిడి కారుతున్న ముక్కులు, మురికితో నిండిన ఒళ్ళు తో ఉన్నప్పటికీ ఆ పిల్లలు నాకు చాలా అందంగా కనిపించారు..నిజానికి
నా సొంత పిల్లల కంటే వాళ్లే ముద్దుగా అనిపించారు..
ఏమాత్రం కల్మషం లేకుండా.. అమాయకత్వం, భయం కలగలిపిన ముఖాలతో ఆ పిల్లలు మాకు టాటా చెబుతుంటే.. గుండెల్లో ఏదో తెలీని భారంతో కొండ దిగడం మొదలు పెట్టాను.. అలా దిగేప్పుడు ఏదో తెలీని బాధ వీళ్లకి ఏమీ చేయలేకపోతున్నామే అని.. నేనే బాగా డబ్బున్నోడిని అయితే కచ్చితంగా ఆ గ్రామం మొత్తాన్ని దత్తత తీసుకుని రూపురేఖలు మార్చేవాడని కదా అనిపించింది. ఆ తర్వాత ఆ గ్రామంలో టీవీ9 పంచాయతీ ఫైట్ లో భాగంగా అరగంటపాటు టెలీకాస్ట్ చేశాము.. మోకాళ్ల మీద కూర్చుని తమని మనుషులుగా గుర్తిచండి మహాప్రభో అని గ్రామస్థులంతా వేడుకుంటుంటే టీవీలో చూసిన జనం గుండెలు కదిలాయి.. ప్రభుత్వం స్పందించింది.. నాబార్డ్ కింద నిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన అక్కడ ఎనిమిది కిలోమీటర్ల మేర కరెంట్ స్తంభాలు వేసి కరెంట్ లైన్లు లాగుతున్నారు.. గ్రామం మొత్తం కదిలి వచ్చి తమ కరెంట్ స్తంభాలను తామే పాతుకుంటున్నారు..ఇన్నాళ్లకు వారి ముఖాల్లో నవ్వు కనిపించింది.. వాళ్ల ముఖాల్లో నవ్వు చూస్తే ఏదో తెలీని సంతృప్తి.. నాడు బాధగా కొండ దిగిన నేను ఇపుడు వారికి కరెంట్ వచ్చిందని తెలిసి సంతోషపడ్డాను..ఇందులో నా పాత్ర చాలా స్వల్పమే..స్పందిన ప్రభుత్వానికి నిజంగా ఆ గ్రామం అంతా రుణపడి ఉంటుంది…. అశోక్ వేములపల్లి

About The Author