మనవడికి బైక్ ఇచ్చి అడ్డంగా బుక్కైన తాత.


మనవడికి బైక్ ఇచ్చి అడ్డంగా బుక్కైన తాత.. ఇప్పుడు జైలుకి వెళ్లాడు.. మున్ముందు కఠిన శిక్ష

ట్రాఫిక్ రూల్స్ విషయంలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొత్త చట్టాలు తీసుకువస్తూ.. ప్రమాదాల నియంత్రణపై ఫోకస్ పెట్టారు. మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే.. ఆ వాహనాల ఓనర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అటువంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. బిహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి కర్రి రామకృష్ణ (61) బాలానగర్‌‌లో ఫ్యామిలీతో నివాసం ఉంటున్నాడు. రామకృష్ణ మనవడు(13) ఫిబ్రవరిలో బైక్ తీసుకుని బయటకు వెళ్లాడు. అతడు మరో ఫ్రెండ్‌ను ఎక్కించుకుని ప్రయాణిస్తూ ఉండగా.. వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న బాలుడు.. ఎగిరివచ్చి డివైడర్‌పై పడతంతో.. తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆ బాలుడు ఇన్నాళ్లూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మరణించాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బైక్ రామకృష్ణ పేరుతో ఉందని గుర్తించారు. కాగా ప్రమాదానికి ప్రధాన కారణం అతడే అంటూ..కేసు నమోదు చేసి, గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నేరం నిరూపణ అయితే రామకృష్ణ పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

కాగా ఇటీవలే మూసాపేటలో కూడా ఈ తరహా ఘటనే జరిగింది. యాక్సిడెంట్ అయి యువతి చనిపోవడంతో.. ఆమెకు బైక్ ఇచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని ఫ్రెండ్‌కు బైక్ ఇవ్వడమే అతడు చేసిన తప్పు. లారీ గుద్దడంతో సదరు యువతి చనిపోయింది. ఈ కేసులో లారీ డ్రైవర్‌ను ఏ2గా పేర్కొనగా, స్కూటీ ఇచ్చిన ఫ్రెండ్‌ను ఏ1గా నమోదు చేశారు.

About The Author