ఏపీలో పరిషత్‌ ఎన్నికలకు కసరత్తు…


అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎస్‌ఈసీగా ఇవాళ ఉదయం బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు నిర్ణయించారు. ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యదర్శి కన్నబాబుతో దీనిపై సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌తో ఎస్‌ఈసీ కార్యాలయంలో నీలం సాహ్ని భేటీ అయి ఎన్నికల నిర్వహణపై చర్చించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇవాళ సాయంత్రం 4గంటలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎస్‌, డీజీపీ పాల్గొని ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం  ఎస్‌ఈసీ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశముంది. పరిషత్‌ ఎన్నికలకు గతేడాది మార్చి 7న నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొవిడ్‌ ఉగ్రరూపం దాల్చింది. దీంతో మార్చి 15వ తేదీన అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పరిషత్‌ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్నికలను తిరిగి కొనసాగించాలని నీలం సాహ్ని నిర్ణయించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తూ సాయంత్రం ప్రకటన విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.._

About The Author