ఈ కొత్త కార్డుల జారీపై నిషేధం…ఆర్‌బీఐ


అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ‌ల‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వీటి చెల్లింపు వ్యవస్థ డేటా నిల్వ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ కొత్త దేశీయ క్రెడిట్ కార్డులను వినియోగదారులకు జారీ చేయకుండా నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. అయితే కార్డ్ నెట్‌వర్క్‌లపై ఆంక్షలు ప్రస్తుత వినియోగదారులపై ప్రభావం చూపదని తెలిపింది. దేశంలోని భారతీయ వినియోగదారుల డాటా, ఇతర సమాచారాన్ని భద్రపరచడానికి నిబంధనలను ఉల్లంఘించడంపై రిజ‌ర్వ్‌ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 (పీఎస్ఎస్ యాక్ట్) సెక్షన్‌ 17 కింద కార్డు నెట్‌వర్క్ ఆపరేటింగ్‌కు సంబంధించి అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ‌లకు అనుమతి ఉంది. చెల్లింపు వ్యవస్థతో అనుసంధానించిన అన్ని సర్వీసు ప్రొవైడర్లు, వారు నిర్వహించే చెల్లింపు వ్యవస్థకు సంబంధించిన డాటా, ఇతర సమాచారాన్ని ఆరు నెలల్లో త‌మ ముందు ఉంచేలా చూడాలని 2018 ఏప్రిల్‌లోసర్క్యులర్ ద్వారా సూచించింది. దీనిపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి ఆర్‌బీఐ కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్త‌ర్వులు ప్రస్తుత భారతీయ కస్టమర్లను ప్రభావితం చేయదని, కార్డులను యథాతధంగా ఉపయోగించవచ్చునని స్పష్టం చేసింది.

About The Author