దంపతుల మధ్య విభేదాలు: పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, దంపతుల మధ్య విభేదాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో సహా మాచర్ల మండల పరిధిలోని సాగర్ కుడికాలువ బుగ్గవాగు లాకుల్లో దూకి ఆత్మహత్యచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన చిట్యార్ శ్రీనివాస్, రేఖ (32) దంపతులు. వారికి దేవాంష్ (4), ధనుష్ (3) కుమారులు ఉన్నారు. హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో నివసిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో శ్రీనివాస్ తాను పనిచేస్తున్న కూరగాయల మార్కెట్‌కు వెళ్లకుండా ఇంటిలోనే ఉంటున్నాడు.
రేఖ ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులతో దంపతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నెల 25న రేఖ తన ఇద్దరు కుమారులను తీసుకొని హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ప్రాంతంలో ఉంటున్న తన సోదరి ఇంటి వద్ద వదిలిపెట్టి వస్తానని స్కూటీపై బయలుదేరింది. రేఖ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో శ్రీనివాస్ అదే రోజు సాయంత్రం జహీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
రేఖ, ఆమె పిల్లల కోసం పోలీసులు గాలింపు చేపట్టగా నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని సూరమ్మ చెరువులో బుధవారం ధనుష్ మృతదేహం లభ్యమైంది. బుగ్గవాగు రిజర్వాయర్ ముత్యాలంపాడు లాకుల వద్ద రేఖ, దేవాంష్ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మాచర్ల రూరల్ ఎస్‌ఐ రాయపూడి ఉదయలక్ష్మి, విజయపురిసౌత్ ఎస్‌ఐ పాల్ రవీందర్ వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.