కోవిడ్‌ను జయించిన నకిలీ రెమ్‌డెసివర్ బాధితులు..
సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ దేశంలో రెమ్‌డెసివర్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో. అవసరం ఉన్నా లేకపోయిన ప్రతి ఒక్కరికి రెమ్‌డెసివర్ సిఫారసు చేస్తున్నారు. దాంతో దేశవ్యాప్తంగా ఈ ఇంక్షన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ క్రమంలో కొన్ని ముఠాలు ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఎక్కువ ధరకు విక్రయిస్తూ.. ప్రజలను దోచుకుంటున్నారు. దారుణమైన విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు వసూలు చేసి కూడా నకిలీ ఇంజక్షన్‌లను అంటగడుతున్నారు.
రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌కు డిమాండ్ భారీగా పెరగడంతో పలువురు నిపుణులు కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి ఈ ఇంజక్షన్ అవసరం లేదని.. అనవసరంగా హైరానా పడి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచిస్తున్నారు. తాజాగా దేశంలో బయటపడుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల్లో రెమ్‌డెసివర్ అతి వినియోగం కూడా ఓ కారణమని నిపుణులు వెల్లడించారు.
ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఓ సంఘటన వీరి సూచనలను బలపరుస్తుంది. రాష్ట్రంలో నకిలీ రెమ్‌డెసివర్ ఇంజక్షన్ తీసుకున్న వారిలో 90 మందికిపైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం 100 మందికిపైగా నకిలీ రెమ్‌డెసివర్ ఇంజక్షన్ ఇవ్వగా వీరిలో 10 మంది మరణించారు.. 90మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారని దర్యాప్తులో తెలిసింది.
ఆ వివరాలు.. తాజాగా ఇండోర్‌లోని ఓ ఆస్పత్రిలో నకిలీ రెమ్‌డెసివర్ ఇంజక్షన్ తీసుకున్న పది మంది కోవిడ్ బాధితుల మృతి చెందారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక తక్షణ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు నకిలీ రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌లు సరఫరా చేసిన గుజరాత్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ముఠా గ్లూకోజ్-ఉప్పు కలిపిన నీటిని రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌లుగా జనాలు అమ్మారు. అయితే ఈ నకిలీ ఇంజక్షన్ తీసుకున్న వారిలో 10 మంది చనిపోగా.. 90 మందికి పైగా కోలుకున్నట్లు తెలిసింది. చనిపోయిన వారిని దహనం చేయడంతో ఈ నకిలీ ఇంజక్షన్ వల్ల కలిగిన దుష్ప్రభావాల గురించి అధ్యయనం చేసే అవకాశం లేదన్నారు పోలీసులు. ఇంకా ఎంతమందికి ఈ నకిలీ ఇంజక్షన్ వినియోగించారనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
కేంద్రం కూడా తీవ్రమైన కేసుల్లో రెమ్‌డెసివర్ వాడితే ఆస్పత్రులో చేరే అవకాశాన్ని తగ్గిస్తుందని తెలిపింది. అయితే ఇది మరణాలను తగ్గిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.