నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తూ పోలీసులకు పట్టుబడిన దంపతులు..


నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్ లో చెలామణి చేస్తున్న దంపతులను టాస్క్ ఫోర్స్ మరియు ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు.
అరెస్టు చేసిన దంపతుల నుండి సుమారు 10లక్షల 9వేల 960 రూపాయల నకిలీ కరెన్సీతో పాటు కరెన్సీని ముద్రించేందుకు వినియోగిస్తున్న కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, ఒక కట్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ కాశిబుగ్గ, తిలక్ రోడ్ ప్రాంతానికి చెందిన దంపతులు వంగరి రమేష్, వయస్సు 55, వంగరి సరస్వతి, వయస్సు 45 కాశిబుగ్గ ప్రాంతంలోనే భర్త రమేష్ చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తుండగా, భార్య సరస్వతి ఫ్యాన్సీ దుకాణంతో పాటు మ్యారేజ్ బ్యూరో నిర్వహించేవారు. ఈ దంపతులకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈ కిలాడీ దంపతులు అనుకున్నదే తడువుగా నకిలీ నోట్లను ముద్రించి వాటిని రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేయాలని ప్రణాళికను రూపొందించుకున్నారు. ఈ ఇందులో భాగంగా ఈ ఈ దంపతులు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో వున్న స్కానర్ తో కూడిన కలర్ ప్రింటర్ తో పాటు, కరెన్సీ అవసరమయిన బాండ్ పేపర్లను కొనుగోలు చేసిన గత మూడు నెలలగా అసలు కరెన్సీకి సంబంధించిన 2వేలు, ఐదువందలు, రెండువందలు, వంద, యాభై, ఇరువై, పది రూపాయలకు సంబంధించిన కొత్త మరియు పాత నోట్లను ముందుగా స్కానర్ తో స్కాన్ చేసిన పిదప స్కాన్ చేసిన నోట్లను కలర్ ప్రింటర్ ద్వారా నకిలీ కరెన్సీని ముద్రించేవారు. ముద్రించిన నకిలీ కరెన్సీని ఎవరికి అనుమానం రానివిధంగా నోట్లను రూపొందించి హన్మకొండ, వరంగల్ లో రద్దీ గా వుండే షాపుల్లో ఈ నకిలీ నోట్లను ఈ కిలాడీ దంపతులు చెలామణీ చేసేవారు.
గత కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటి పరిధిలోని షాపుల్లో నకిలీ నోట్ల చలామణి అవుతున్నట్లుగా పలుఫిర్యాదులు రావడంతో పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ రోజు ఉ దయం టాస్క్ ఫోర్స్ మరియు ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ఇంటిపై ఆకస్మిక దాడి నిర్వహంచారు. ఈ దాడిలో పోలీసులు నిందితులైన దంపతులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుండి నకిలీ కరెన్సీ నోట్ల ముద్రించేందుకుగా వినియోగించే సామగ్రితో పాటు రెండు వేలు 376, ఐదువందలు 204, రెండువందలు 420, వంద 471, యాభై 471, ఇరువై 62, పదిరూపాయలకు సంబంధించి 7 నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసారు.
ఈ నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న దంపతులను పట్టుకోవడం ప్రతిభ కనిబరిచిన టాస్క్ ఫోర్స్ ఎ.సి.పి ప్రతాప్ కుమార్, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ జ్,మధు, ఇంతేజా గంజ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు,
టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుళ్ళు శ్రీకాంత్, మహేందర్, సృజన్, చిరులతో పాటు ఇంతేజార్ గంజ్ పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.