థర్డ్‌ ఫ్రంట్‌ బీజేపీని ఓడించలేదు: ప్రశాంత్‌ కిషోర్‌


జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు కసరత్తు జరుగుతోందన్న వాదనలకు ఇటీవల బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రోద్బలంతో 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యూహ రచన జరుగుతోందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ను దూరంగా పెడుతూ… మిగతా విపక్షాలతో మూడోకూటమిని ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
టార్గెట్‌ 2024!
ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో 10 రోజుల వ్యవధిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ రెండోసారి భేటీ అయ్యారు. దీంతో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో జోరందుకున్నాయి. అయితే సోమవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం రొటీన్‌గానే జరిగిందని ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ అనంతరం తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇతర రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

15 రాజకీయ పక్షాలకు ఆహ్వానాలు
ప్రశాంత్‌ కిషోర్‌తో భేటీ తర్వాత శరద్‌ పవార్‌ మంగళవారం పలువురు విపక్ష పార్టీల నేతలు, ప్రముఖ వ్యక్తులతో సమావేశం కానున్నారు. ఢిల్లీలోని పవార్‌ నివాసంలో మంగళవారం కీలక భేటీ జరుగనుంది. కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత యశ్వంత్‌ సిన్హా ఆధ్వర్యంలోని రాష్ట్రీయ మంచ్‌ తరపున 15 రాజకీయ పక్షాలకు, సమాజంలోని కీలక వ్యక్తులకు ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలు, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై పోరుతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సమావేశంలో శరద్‌ పవార్‌తో పాటు ఫరూక్‌ అబ్లుల్లా, యశ్వంత్‌ సిన్హా, పవన్‌ వర్మ, సంజయ్‌ సింగ్, డి.రాజా, జస్టిస్‌ ఏపీ సింగ్, జావేద్‌ అక్తర్, కేటీఎస్‌ తులసి, కరణ్‌ థాపర్, అశుతోష్, న్యాయవాది మజీద్‌ మెమొన్, మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ, కేసీ సింగ్, సంజయ్‌ ఝా, సుదీంధ్ర కులకర్ణి, ఆర్థికవేత్త అరుణ్‌ కుమార్, ఘన్‌శ్యామ్‌ తివారీ, సహా పలువురు పాల్గొంటారని ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ తెలిపారు.

నాకు సంబంధం లేదు: ప్రశాంత్‌ కిశోర్‌
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ఏర్పాటుతో తనకెలాంటి సంబంధం లేదని ప్రశాంత్‌ కిషోర్‌ ఎన్డీటీవీతో అన్నారు. ‘మూడో ఫ్రంట్‌… నాలుగో ఫ్రంట్‌లను నేను విశ్వసించను. థర్డ్‌ ఫ్రంట్‌ బీజేపీ ఓడిస్తుందనే నమ్మకం నాకు లేదు’ అని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. ఇంతకుమించి మాట్లాడలేదు.

About The Author