మూడు ఎర్రచందనం దుంగలతో ఒక స్మగ్లర్ అరెస్టు

చిత్తూరు జిల్లా;తిమ్మినాయుడు పాలెం కరకంబాడీ బీట్ పరిధిలో మూడు ఎర్రచందనం దుంగలతో సహా ఒక స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర రావు ఆదేశాల మేరకు ఆర్ ఎస్ ఐ సురేష్ బాబు టీమ్ కరకంబాడీ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున శేషాచలం అడవుల్లో కుప్పరాళ్ల గుట్ట వద్ద కొంతమంది ఎర్రచందనం దుంగలను మోసుకుని రావడాన్ని గమనించారు. వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, ఒక వ్యక్తి పట్టుబడ్డాడు.ఆ ప్రాంతంలో మూడు ఎర్రచందనం దుంగలతో పాటు ఒక గొడ్డలి, గునపం లభించాయి. ఇతనిని ఏర్పేడు మండలం బత్తినయ్య కాలనీకి చెందిన గునీపేటి వెంకటేసు (60)గా గుర్తించారు. ఇతన్ని విచారించగా బత్తి నయ్య కాలనీకి చెందిన భక్తవత్సలం, మంగళంకు చెందిన శివ ఎర్రచందనం దుంగలు కోసం తమను సంప్రదించారని తెలిపారు. దీంతో బత్తి నయ్య కాలనీకి చెందిన తుపాకుల మారయ్య, మణి, రమణ,వేలు కలసి శేషాచలం అడవుల్లో కి వెళ్లినట్లు తెలిపాడని, ఈ కేసు విచారిస్తున్న సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. వీరి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కేసు లో సిఐ చంద్రశేఖర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, డీఆర్వో జానీ భాషా పాల్గొన్నారు.

About The Author