అతి భారీవర్షాలు అర్జంట్ అలెర్ట్

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే అయిదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయన భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రత్యేకించి- దక్షిణాదిన వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసింది. కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాజధాని తిరువనంతపురం సహా తీర ప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రుతుపవనాలు హిమాలయ పర్వతప్రాంతాలకు చేరువగా కదులుతున్నాయని, ఫలితంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాజా బులెటిన్‌లో విడుదల చేశారు.

జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లల్లో వచ్చే 72 గంటల పాటు అంటే 13 తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు.

బిహార్, ఉత్తరప్రదేశ్‌లల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని అంచనా వేస్తోన్నారు. వచ్చే నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని, దీనివల్ల వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనితోడు- అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇవే తరహా వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, 14వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని అభిప్రాయపడ్డారు.

ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో మూడురోజుల పాటు ఆకాశం మేఘావతమై ఉంటుందని, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఏపీలో కోస్తా తీర ప్రాంతంలోని తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు, రాయలసీమలోని కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఈ తెల్లవారు జామున కడపలో భారీ వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలోనూ పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణలో వచ్చే మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.కర్ణాటక తీర ప్రాంత జిల్లాలు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి, చిక్కమగళూరు, కొడగు, శివమొగ్గ, హసన జిల్లాల్లో వర్షాలు కురవడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని, పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేరళలో వచ్చే రెండు, మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అళప్పుజర, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలకు ఇదివరకే ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. ఆయా జిల్లాల్లో 6 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిస్తుందని అంచనా వేశారు.

ఇప్పటికే తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిశాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్‌లల్లో నదులు పొంగిపొర్లుతున్నాయి. ఢిల్లీలోనూ ఇదే పరిస్థతి నెలకొంది. యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అలాగే జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. జమ్మూ కాశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో పొంగిపొర్లుతోన్న వరదల్లో పలువురు గల్లంతయ్యారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లల్లో నదీ తీర ప్రాంతాల్లో వరద పోటెత్తింది. పలు నివాసాలు జలమయం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం భయాందోళనలకు గురి చేస్తోంది.