తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్‌

మహబూబ్‌నగర్ నుంచి బరిలో నిలిచిన శ్రీనివాస్ గౌడ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను శ్రీనివాస్‌ గౌడ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు తేలింది. అయితే అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక చేరింది. ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా నివేదికలో తేల్చినట్లు ప్రచారం జరుగుతోంది. రేపోమాపో టెక్నికల్ ఆధారాలతో ఆయనపై కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆయనపై వేటు పడనుండా? అనే చర్చ ఊపందుకుంటోంది. లోపాలతో ఉన్న మొదటి అఫిడవిట్‌ను వెబ్‌సైట్‌ నుంచి తొలగించారని తేలింది. మళ్లీ సవరించిన అఫిడవిట్‌ను నెలన్నర తర్వాత అప్‌లోడ్‌ చేసినట్లు ఆరోపణ వచ్చింది.

నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన మంత్రి..

గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ తొలుత ఒక అఫిడవిట్ సమర్పించారు. నవంబర్ 14న ఆయన నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్ చేశారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే కొద్దిరోజుల ముందు వెబ్‌పైట్‌లో మరో అఫిడవిట్ దర్శనమిచ్చింది. మొదట అప్‌లోడ్ చేసిన అఫిడవిట్‌లో వివరాలు.. తర్వాత అఫిడవిట్‌లో వివరాల్లో తేడాలున్నట్లు ప్రత్యర్థులు గుర్తించారు.తొలుత అప్‌లోడ్ చేసిన అఫిడవిట్‌తో అనర్హత వేటు పడే అవకాశం ఉండడంతోనే ఆయన మరో అఫిడవిట్‌ను అప్‌లోడ్ చేయించారని ప్రత్యర్థులు ఈసీకి ఫిర్యాదు చేశారు.
కాగా, స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ నివేదిక తెప్పించుకుంది. నివేదిక పంపిన కొద్దిరోజులకే కేంద్రానికి సీఈవో శశాంక్‌ గోయల్‌ బదీలీపై వెళ్లారు. ట్యాంపరింగ్‌ జరిగిన విషయం నిజమేనంటూ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ట్యాంపరింగ్ ఆరోపణలపై అంతర్గతంగా సాంకేతిక బృందంతో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరిపిస్తోంది.
గతేడాది ఆగస్టులో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై ఇప్పడు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ట్యాంపరింగ్‌ను టెక్నికల్ బృందం ధృవీకరిస్తే ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అవకాశం కనిపిస్తోంది.