శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం…

 

సూర్యుని గమనంతోపాటు మన నీడ కూడా మారుతూ ఉంటుంది. అలాంటి నీడను బంధించడం సాధ్యమవుతుందా? సూర్యుని కదలికతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకేచోట ఒకేలా ఒక నీడను ఉంచేలా బంధించడం ఆశ్చర్యమే కదా! అలాంటి ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని కందూరు చోడులు మనకు అందించారు. నిశ్చల ఛాయ సృష్టి ఆనాటి రాజుల కళాతృష్ణకు, శిల్పుల అపార మేథాసంపత్తికి నిలువెత్తు సాక్ష్యం. వారి అద్భుత నిర్మాణ శైలికి, ప్రజ్ఞాపాటవాలకు తార్కాణం. ప్రపంచంలో ఇలాంటి నిర్మాణం మరెక్కడా లేకపోవడం మనకు గర్వకారణం. మన జాతి ప్రాచీన సాంస్కృతిక సంపదగా వెలుగుతున్న ఆ అపూర్వ నిర్మాణం శ్రీ ఛాయా సోమేశ్వరాలయం. పాఊరవతల ఉదయ సముద్రం.. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాయలం. 11వ శతాబ్దపు నాటి ఆలయం అది. కందూరు చోడులు నిర్మించిన త్రికూట ఆలయం. ఈ దేవాలయంలో ఒక అద్భుతం దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. నిశ్చల నీడ. అది ఎక్కడి నుంచి పడుతుందో ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఈ నిగూఢాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు. ఆ నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా.. ఎప్పుడూ కదలదు. సూర్యుని గమనంతో దానిలో ఏ మార్పూ ఉండదు. ఎంతటి ఆశ్చర్యం. నీడను నిశ్చలంగా చేయడమా? ఛాయను బంధించడమా? ఇంకో విషయం.. ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ, ఆ నీడ ఏ స్తంభానిదో కూడా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే, ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి.. దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా ఆ స్తంభం నీడతోపాటు పడాలి కదా? కానీ, అలా పడదు. అయితే, ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతున్నది. రోజంతా స్థిరంగా ఎలా ఉంటున్నది?.. అద్భుతమే కదా!? ఈ దేవాలయానికే మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే.. ఉదయ సముద్రంలో నీరుంటే ఈ ఆలయ ప్రధాన గర్భగుడిలో కూడా నీరు ఉంటుంది. ఉబికి వస్తుంటుంది.  ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? నల్లగొండ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పానగల్లు అనే గ్రామం ఉంది. ఈ ఊరికి తూర్పున ఉదయ సముద్రం ఉంది. దీని ఒడ్డునే ఈ అద్భుత నిశ్చల ఛాయ ఆలయం ఉంది. దీనినే ఛాయా సోమేశ్వరాలయం అంటారు. ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే మూడు గర్భాలయాలు గల త్రికూటాలయం ఇది. గుడికి దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంది. తూర్పు, పడమర, ఉత్తరం వైపు మూడు గర్భగుళ్లు ఉన్నాయి. పడమర వైపు తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన గర్భగుడిలో మూలవిరాట్టు శ్రీ సోమేశ్వరస్వామి లింగాకారంలో కొలువై ఉన్నాడు. ఈ శివలింగంపై నీడ పడుతుంటుంది. నిరంతరం నీడతో కప్పి ఉండడం వల్ల ఈ స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు. గర్భగుడిలో శివలింగాన్ని కప్పుతూ వెనుక ఉన్న గోడపై పగలు మొత్తం కనిపించే సూర్యరశ్మితో సంబంధం లేని స్తంభాకార నీడ ఇక్కడి విశేషం. విశిష్ఠత. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. పైగా అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఇదెలా సాధ్యం? ఆ నీడ ఎలా పడుతుంది. ఎందుకు అది వెలుతురులో ఉన్నంత వరకూ తన స్థానాన్ని మార్చుకోదు..

ఇవి ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నలు. శిల్పకళా చాతుర్యంలో సాంకేతిక విజ్ఞానాన్ని మిళితం చేసి రూపుదిద్దుకున్న ఈ దేవాలయం నిర్మాణ శైలిలో ఓ అద్భుతం. సూర్యాపేటకు చెందిన శేషగాని మనోహర్ గౌడ్ అనే భౌతిక శాస్త్ర అధ్యాపకులు ఈ ఆలయ నిశ్చల ఛాయ గురించి పరిశోధన చేశారు. ఈ గుడిని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు. మనం తెలుసుకోవాలనుకున్నది రెండు విషయాలు.. ఒకటి.. నీడ ఏ స్తంభానిది? రెండు.. ఏ దిశ నుంచి వచ్చే కాంతిది?? అని. నీడ ఒక స్తంభానిది కాదు. నాలుగు స్తంభాలది. కాంతి కూడా రెండువైపుల నుంచీ వస్తుంది. నీడ పడే గర్భగుడికి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచీ కాంతి లోపలికి వస్తుంది. ఇది నాలుగు స్తంభాలకు తగిలి పరిక్షేపణం చెందుతుంది. ఆ పరివర్తనం అంతా గర్భగుడిలోని శివలింగంపై ప్రతిఫలించేలా నిర్మించారు. ఇక్కడ మళ్లీ రెండు అనుమానాలు. నిర్మాణం అంతా ఒకేలా ఉన్నప్పుడు, మిగిలిన రెండు గర్భగుళ్లలో కూడా నీడ పడాలి కదా? రెండోది.. సూర్యకాంతి ఆధారంగా వచ్చే నీడ అయితే కదలాలి కదా. మరి స్థిరంగా ఎందుకు ఉంటుంది? సూర్యుడు తూర్పున ఉదయించి పడమటికి కదులుతాడు. దీన్ని సన్‌ట్రాక్ అంటారు. అందుకే పడమర వైపు గుళ్లో మాత్రమే నీడ పడేలా కట్టారు. నీడ పడే గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశంలో విగ్రహాలు పెట్టి అడ్డు వేశారు. అందుకే తూర్పు గర్భగుడిలో నీడ పడదు. అలాగే, ఉత్తరం వైపు గుళ్లో పడకుండా దక్షిణంవైపు ఖాళీగా వదిలేశారు. అటువైపు కూడా కట్టి ఉంటే ఉత్తరం గుళ్లో కూడా నీడ పడేది అని మనోహర్ తన పరిశోధనను వివరించారు. సృష్టించిన ఆకారం ఎలా ఉందో, ఎలా సృష్టించారో చెప్పడం పరిశోధన. కానీ, ఆ ఆకారాన్ని సృష్టించడం ఒక విద్వత్తు. ఆ విద్వత్తుకు సజీవ సాక్ష్యం ఛాయా సోమేశ్వరాలయం. శ్రీ సూర్యభగవానుడు తన ప్రియ సతీ (రెండో భార్య ఛాయాదేవి)సమేతంగా సోమేశ్వరుణ్ణి అభిషేకిస్తున్నట్లు అనుభూతిని భక్తులకు అందించేందుకే నాటి శిల్పకారులు ఈ శిల్పకళా వైదుష్యాన్ని సృష్టించినట్లు వాస్తు నిపుణులు చెబుతారు. శ్రీ సోమేశ్వర స్వామి లింగరూపం ముఖ మండపానికంటే సుమారు ఐదు అడుగుల పల్లంగా పానవట్టం మీద ప్రతిష్టించి ఉంది. స్వామి చుట్టూ ఎప్పుడూ రెండు, మూడు అడుగుల నీరు నిండి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. పానవట్టం మునిగి, లింగం సగం వరకు నీటిలో ఉండడాన్ని గమనించవచ్చు. ఆలయానికి ఎదురుగా ఉన్న చెరువులోకి నిండుగా నీరు వచ్చినప్పుడు గర్భాలయంలోకి కూడా నీరు నిండుగా రావడంతో స్వామి పూర్తిగా నీటిలో ఉండిపోతారని స్థానికులు చెబుతారు. ఉత్తరం వైపు దక్షిణం ముఖంగా ఉన్న గర్భగుడిలో శ్రీ దత్తాత్రేయుడు కొలువై ఉన్నాడు. తూర్పు వైపు పడమర ముఖంగా ఉన్న గర్భగుడి పెకిలించిన పానవట్టంతో ఖాళీగా ఉంటుంది. అంతా చీకటిగా ఉంటుంది. ఈ త్రికూటాలయం మధ్యలో నాలుగు స్తంభాలున్నాయి. ప్రధాన ద్వారం వద్ద, మూడు గర్భగుళ్ల ముందు సిమెట్రిక్ సిస్టమ్ (సౌష్టవ వ్యవస్థ)లో ఎనిమిది స్తంభాలున్నాయి. మధ్యలో నిలబడి ఏ గర్భగుడివైపు చూసినా వాటి నిర్మాణం ఒకేలా ఉంటుంది. పానగల్లును రాజధానిగా చేసుకుని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన అరుదైన ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయ మండప స్తంభాలకు రామాయణ, భారత, శివలీలా ఘట్టాలు చెక్కి ఉన్నాయి. ద్వారానికి ఇరుపక్కలా విఘ్నరాజు వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయ ద్వారం పైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూప తలలు, లతలు, పూలు.. ఆలయం బయటి గోడలపై ఉన్న శిల్పాలు ముగ్ధ మనోహరంగా ఉంటాయి. లింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు ధ్వంసమై ఉన్నాడు. ఆలయం ప్రాంగణంలో ఇలాంటి ధ్వంసమైన నందులు, ఇతర శిల్పాలు హృదయాన్ని కలవర పరుస్తాయి. త్రికూటం చుట్టూ ఉన్న ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా, ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉన్నాడు. ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఈ ఆలయంలో ఉన్నది. పూర్తిగా రాతి నిర్మాణం అయిన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత, కాకతీయుల శైలి మరికొంత కనిపిస్తుందని చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయ సమీపంలో ఒకప్పుడు పానగల్లు కోట తాలూకు శిథిలాలు కనిపించేవని స్థానికులు చెబుతారు.  తమ ఇష్టదైవమైన సోమేశ్వరునికి ఆలయం.. ఒక విశిష్ట నిర్మాణంగా ఉండాలన్న ఆ రాజుల ఆకాంక్షకు వారి శిల్పులు తమ ప్రజ్ఞాపాటవాలతో ఒక రూపాన్ని ఇచ్చారు. ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఆ శిల్పుల మేథో నైపుణ్యాన్ని మనం ప్రముఖంగా గుర్తించాలి. దానిని ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలి. మన నిర్మాణాల గొప్పదనాన్ని తెలిపే ఇలాంటి వారసత్వ కట్టడాలకు తగిన రక్షణ, ఆదరణతో కూడిన పోషణ, ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. భావితరాలకు ఈ అద్భుత సంపద గొప్పదనాన్ని అందించాల్సిన బాధ్యతా మనందరి పైనా ఉన్నది. వచ్చేవారం : పచ్చల సోమేశ్వరాలయం పానగల్లును రాజధానిగా చేసుకుని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన అరుదైన ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయ మండప స్తంభాలకు రామాయణ, భారత, శివలీలా ఘట్టాలు చెక్కి ఉన్నాయి.

About The Author