డ్రాగన్‌ ఘనత.. జాబిల్లి ఆవలివైపు ల్యాండ్‌ అయిన చాంగే..


ఇంటర్నెట్‌డెస్క్‌:  చైనాకు చెందిన లూనార్‌ల్యాండర్‌ చాంగే-6 విజయవంతంగా జాబిల్లి ఆవలివైపు ల్యాండ్‌ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. బీజింగ్‌ కాలమానం ప్రకారం నేటి ఉదయం 2,500 కిలోమీటర్ల విస్తీర్ణంలోని అయిట్కిన్‌ బేసిన్‌ పేరిటన ఉన్న ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు పేర్కొంది. ఆ దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక ముందడుగు. ఇప్పటి వరకు ప్రయోగించిన వాటిల్లో ఇదే అత్యాధునికమైంది. అక్కడి నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయల్దేరనుంది. గతంలో 2019లో కూడా చైనా చాంగే-4ను చంద్రుడి ఆవలివైపునకు ప్రయోగించింది. తాజాగా పంపిన ఈ మిషిన్‌లో ఆర్బిటర్‌, ల్యాండర్‌, అసెండర్‌, రీఎంట్రీ మాడ్యూల్‌ అనే నాలుగు రకాలున్నాయి.

మే 3వ తేదీ చాంగే-6 నింగికెగిరి.. దాదాపు 53 రోజులపాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. అక్కడ రోబోల సాయంతో తవ్వకాలు జరిపి రెండు కిలోల మట్టిన ఇది భూమిపైకి తీసుకురానుంది. ఇందుకోసం సుమారు 14 గంటల సమయం పట్టనుంది. ఆ తర్వాత అసెండర్‌ మాడ్యూల్‌.. చందమామ ఉపరితలం నుంచి పైకి దూసుకెళుతుంది. చంద్రుడి కక్ష్యలోని ఆర్బిటర్‌తో అనుసంధానమవుతుంది. అనంతరం ఈ శాంపిళ్లు ఆర్బిటర్‌లోని రీఎంట్రీ మాడ్యూల్‌లోకి చేరుతాయి. 
ఆర్బిటర్‌ భూమి దిశగా పయనాన్ని ఆరంభిస్తుంది. పుడమికి చేరువయ్యాక రీఎంట్రీ మాడ్యూల్‌… ఆర్బిటర్‌ నుంచి విడిపోతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. చైనాలోని ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ ప్రాంతంలో రీ ఎంట్రీ మాడ్యూల్‌ దిగుతుంది. చాంగే-6తో కమ్యూనికేషన్లు సాగించడానికి ప్రత్యేక ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి చైనా ఇప్పటికే పంపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 2030న అక్కడికి వ్యోమగాములను పంపేందుకు యత్నాలను వేగవంతం చేయనుంది.   

చంద్రుడికి సంబంధించి మనకు ఎప్పుడూ కనిపించే ఇవతలి భాగం నుంచి చైనా ఇప్పటికే నమూనాలను సేకరించి, భూమికి తీసుకొచ్చింది. అవతలి భాగం నుంచి వీటిని తీసుకురావడం చాలా సంక్లిష్ట ప్రక్రియ. ఉపరితలం ఎగుడుదిగుడుగా ఉంటుంది. తాజా యాత్ర ద్వారా అక్కడి వాతావరణంతోపాటు శిలలు, ధూళిలోని పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోట్‌ సెన్సింగ్‌ పరిశీలనల్లో వెల్లడైంది. ఇవతలి భాగం ఒకింత చదునుగా ఉంటుంది. అవతలి ప్రాంతం అంతరిక్ష శిలలు ఢీ కొట్టడం వల్ల ఏర్పడిన బిలాలతో నిండిపోయి ఉంటుంది. చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లో భిన్న రీతుల్లో ఉన్నట్లు వెల్లడైంది. 

About The Author