అడవుల రక్షణ, నేరాల అదుపుపై వీడియో కాన్ఫరెన్స్…
అడవుల రక్షణ, సంబంధిత నేరాల అదుపుపై సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిబ్బందితో ఛీఫ్ సెక్రటరీ, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
అటవీ నేరస్థులు ఇకపై అడవుల్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడాలని, కఠినంగా వ్యవహరించటం ద్వారా అటవీ నేరాలను అదుపులో పెట్టాలని చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పర్యావరణ పరంగా అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, ఆదిశగా అందరూ పనిచేయాలని సీ.ఎస్ అన్నారు. అడవుల రక్షణ, సంబంధిత నేరాల అదుపుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్, అటవీశాఖ అధికారులు, సిబ్బందితో చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న ఐదేళ్లు పచ్చదనం పెంపు, అడవుల రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశంగా సీఎం చెప్పారని, హరితహారంతో అడవుల బయట, కఠిన చర్యలతో అడవి లోపల పచ్చదనాన్ని రక్షించుకోవాలన్నారు. అటవీ ప్రభావిత జిలాల్లో వెంటనే సాయుధ బలగాలతో అటవీ, పోలీస్ శాఖల ఉమ్మడి 54 చెక్ పోస్టుల ఏర్పాటుకు ఆదేశించారు. అటవీ నేరాల విచారణ, కఠిన శిక్షల ఖరారులో మరింత వేగం పెంచుతామని, ప్రస్తుత చట్టాలకు పదును పెట్టి త్వరలోనే కఠిన చట్టం తేస్తామన్నారు. ఫిబ్రవరి ఆరుకల్లా ప్రతీ జిల్లాలో అటవీ రక్షణ కార్యాచరణ సిద్దం చేయాలన్నారు. పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థను కూడా ఉపయోగిస్తామని, అటవీ నేరస్థులపై సరైన సమాచారం ఇచ్చే ఇన్ ఫార్మర్ల వ్యవస్థను పెంచి, మంచి రివార్డులు ఇస్తామన్నారు. పేకాట, గుడుంబా స్థాయిలోనే కలప స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతామని, కొట్టేసిన కలపను పట్టుకోవడం కాకుండా, అడవిలోకి నేరస్థులు వెళ్లకుండా చూడాలన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసుల వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని, అన్ని స్థాయిల్లో పోలీస్ సిబ్బంది స్థానిక అటవీ అధికారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓలు కలిసి ఒక టీమ్ గా అటవీ నేరాలను అరికట్టేందుకు పనిచేయాలన్నారు. అడవులపై నిరంతరం నిఘా కోసం సాయుధ పోలీసుల పహారా ఉంటుందన్నారు. తరచుగా అటవీ నేరాలకు పాల్పడే నేరస్థులను జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలప కోత యంత్రాలపై (సా మిల్లులపై) నిఘా ఉంచుతామని, తప్పని సరిగా వారందరూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మంచి అడవిని కాపాడటం ఒక ఎత్తు అయితే, క్షీణించిన అడవులను పునరుద్దరించుకోవటం మరో ఎత్తు అన్నారు. అటవీ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని, ఏ స్థాయి వారయినా చర్యలు తప్పవన్నారు. ప్రతీ అటవీ సిబ్బంది తప్పని సరిగా తమ పరిధి ప్రాంతంలో క్షేత్ర పర్యటన చేయాలన్నారు. అదిలాబాద్ జిల్లాలో ముల్తానీలను కలప స్మగ్లింగ్ నుంచి దూరం చేసేందుకు అవసరమైన పునరావాస ప్యాకేజీని వెంటనే ఆమోదిస్తామన్నారు. అధికారుల స్థాయిలో అటవీ రక్షణ కమిటీలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసి తరచుగా సమావేశం కావాలని, గ్రామ స్థాయిలో కూడా హరిత రక్షక కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. పీసీసీఎఫ్ పీ.కె.ఝా మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసుల సహాకారంతో అటవీ ఆక్రమణలు జరగకుండా చూస్తామని, వన్యప్రాణుల వేటపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వేటగాళ్లు విద్యుత్ వైర్లను అమరుస్తున్నారని, దానిని నిరోధించేందుకు ఆశాఖ సహకారం తీసుకుంటామన్నారు. వీడియో కాన్పరెన్స్ లో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అడిషనల్ డీజీ జితేందర్, ఐ.జీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, పీసీసీఎఫ్ విజిలెన్స్ రఘువీర్, అదనపు పీసీసీఎఫ్ లు మునీంద్ర, లోకేష్ జైస్వాల్, డోబ్రియల్, తిరుపతయ్య, స్వర్గం శ్రీనివాస్, సీ.ఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు.