మిషన్ భగీరథ తాగునీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన…

ఎన్నో వ్యయప్రయాసలకోర్చి గుమ్మం ముందుకే తాగునీటిని తీసుకొస్తున్నామని, జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్. మిషన్ భగీరథతో వెలకట్టలేని “ఆరోగ్యనిధి”ని తెలంగాణ భావితరాలకు ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. మిషన్ భగీరథ O&M పాలసీ, గైడ్ లైన్స్ పై నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ రెండో రోజు హాజరైన స్మితా సభర్వాల్… తాగునీటి ప్రాముఖ్యతను గుర్తించి పొదుపుగా వాడుకోవాల్సని బాధ్యత ప్రజలదే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, ఇంజనీర్లు, సిబ్బంది అంకితభావంతో ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి భగీరథతో శుద్దిచేసిన తాగునీరు సరాఫరా అవుతోందన్నారు. ప్రస్తుతం ప్రతీ మనిషికి గ్రామాల్లో రోజుకు వంద లీటర్లు, పట్టణాల్లో రోజుకు 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్లు సరాఫరా అవుతున్నాయన్నారు. అంతకుముందు మిషన్ భగీరథ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్, స్థిరమైన తాగునీటి సరాఫరా అంశాలపై చీఫ్ ఇంజనీర్ విజయ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మిషన్ భగీరథతో ఎలాంటి ఆటంకాలు లేని తాగునీటి సరాఫరా కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ క్రమంలో తలెత్తే సమస్యలను విజయ్ ప్రకాష్ వివరించారు. ఆ తరువాత స్కాడా పనితీరు, సమస్యలపై డి. రఘునందన్ మాట్లాడారు. ఇక మిషన్ భగీరథతో 24 గంటలు తాగునీటిని సరాఫరా చేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలు, ఆటంకాలపై “అస్కీ” డైరెక్టర్ శ్రీనివాస చారీ ప్రజేంటేషన్ ఇచ్చారు. ఇక “ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్” ఉపయోగించి లోపాలు లేకుండా తాగునీటిని సరాఫరా ఎలా చేయవచ్చో “స్కార్ట్ టెర్రా” స్టార్టప్ ప్రతినిధి గోకుల్ కృష్ణ వివరించారు. తాగునీటి సరాఫరా లో తలెత్తే సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పరిష్కరించవచ్చని తెలిపారు. రోజువారీ నీటి వినియోగం, లీకేజీలను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో సమర్థవంతంగా లెక్కగట్టచ్చన్నారు. ఆ తర్వాత యునిసెఫ్ ప్రతినిధులు తమ బేస్ లైన్ సర్వే పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తాగునీటి సౌకర్యాలు, పరిశుభ్రమైన మంచినీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నీటి సంబంధిత వ్యాధులపై తాము సర్వే చేశామని చెప్పారు. తాము గమనించిన సమస్యలన్నీ మిషన్ భగీరథతో పరిష్కారం అవుతాయన్న నమ్మకం తమకు ఉందన్నారు. యునిసెఫ్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ మిషన్ భగీరథతో భాగం కావడం తమకు గర్వకారణమని స్మితా సభర్వాల్ అన్నారు. ఇప్పుడు రాష్ట్రమంతటా మిషన్ భగీరథతో స్వచ్ఛమైన శుద్దిచేసిన తాగునీటిని అందిస్తున్నామని, ఈ నీటి వినియోగం తర్వాత ప్రజల సామాజిక, ఆర్థిక స్థితుల్లో వచ్చిన మార్పులను తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నామన్నారు. ఆ తర్వాత మిషన్ భగీరథ ఎలక్ట్రో మెకానికల్ పరికరాల నిర్వహణపై చీఫ్ ఇంజనీర్ జగన్మోహనర్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కచ్చితమైన మార్గదర్శకాలు, జాగ్రత్తలతో ఎలక్ట్రో, మెకానికల్ యంత్రాలు ఎక్కువ రోజులు పనిచేస్తాయన్నారు. వాటర్ ఆడిట్, ఎనర్జీ ఆడిట్, నిర్వహణ పద్దతులపై ఈ రోజు వర్క్ షాప్ లో చర్చలు జరిగాయి. ఈరోజు వర్క్ షాప్ లో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు జగన్మోహన్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, విజయప్రకాశ్, వినోభాదేవి, చిన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, శ్రీనివాస్, కన్సల్టెంట్లు నర్సింగరావు, జగన్, మనోహర్ బాబు తో పాటు ఎస్.ఈ,ఈఈ, డీ.ఈ.ఈలు పాల్గొన్నారు.

About The Author