రాఫెల్ గుట్టు రట్టు…
సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రధాని మోడీకి పార్లమెంటు లోపలా, వెలుపలా నిరసనలే స్వాగతం పలుకుతున్నాయి. మొన్నటి అరుణాచల్ పర్యటనలో పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్యభారతం, నిన్నటి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ప్రత్యేకహౌదా, ప్యాకేజీ ఏదీ ఇవ్వని అన్యాయానికి తెలుగు సమాజం, హుబ్లీ సభలో ‘ఆపరేషన్ కమల్’ ను తప్పు బడుతూ కన్నడ సీమ ఎక్కడికక్కడ నల్లజెండాలు, నల్ల బెలూన్‌లు ఎగురవేస్తూ తీవ్రస్థాయిలో మోడీకి తమ నిరసనల వేడిని రుచి చూపించాయి. మరో వైపు ‘రాఫెల్’ డీల్‌లో ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంఓ) రహస్య జోక్యం బద్దలైన ఉదంతం పార్లమెంటులో ఇంతకు మించిన సెగలు పుట్టిస్తోంది*.
‘ఎవ్వరినీ వదలను. అవినీతిపరులు నన్ను చూసి భయపడుతున్నారు’ అంటూ పశ్చిమబెంగాల్, చత్తీస్‌గఢ్ సభల్లో ప్రధాని విపక్షాలపై విరుచుకుపడుతుండగానే, రాఫెల్ లావాదేవీల్లో ఆయన బండారం ఆధారాలతో సహా బయటపడటంతో తేలు కుట్టిన దొంగలా తయారయింది ప్రధాని పరిస్థితి. *ప్రఖ్యాత పాత్రికేయులు ఎన్.రామ్ ‘ది హిందూ’ లో రక్షణశాఖ నోట్ ఫైల్‌తో సహా ప్రచురించిన సంచలన కథనం పార్లమెంటునే కాదు, యావత్ దేశాన్నే కుదిపేస్తోంది*. ‘రాఫెల్ ఒప్పందంలోని అన్ని ఆంశాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ ఒప్పందంలో అవినీతి అక్రమాలకు దూరంగా మేం నిప్పులా ఉన్నాం’ అని ప్రధాని ప్రకటించుకున్న 24గంటల్లోనే ఈ నిప్పులాంటి నిజం గుప్పుమనడం విశేషం!
*ఈ ‘డీల్’లో భారత రక్షణశాఖ నేతృత్వంలోని అధికారిక సంప్రదింపుల బృందం చర్చలు జరుపుతుండగానే మరోవైపు రక్షణశాఖకు తెలియకుండా ప్రధానమంత్రి కార్యాలయం సమాంతర చర్చలతో రంగంలోకి దిగింది.*
ఒప్పందంలో కట్టుదిట్టమైన నియమనిబంధనలకు పట్టుబట్టుతున్న రక్షణశాఖ సంప్రదింపుల బృందానికి ఫ్రాన్స్ సంప్రదింపుల బృంద సారధి స్టీఫెన్ రెబ్ ఒక లేఖ రాశారు. భారత ప్రధానమంత్రి కార్యాలయం అన్ని విషయాలు తమతో చర్చిస్తున్నందున, ఆ మేరకు పీఎంఓ కార్యదర్శి అష్రఫ్‌తో తమ రక్షణ సలహాదారు ఫోన్‌లో మాట్లాడినందున మీతో చర్చలకు అంత ప్రాధాన్యం లేదన్నది ఆ లేఖ సారాంశం. దాంతో ఒకవైపు ప్రభుత్వమే నియమించిన తమ బృందం చర్చలు జరుపుతుండగానే తమకు తెలియకుండా మీ జోక్యం సరికాదనీ, షరతులు హామీలు లేని ‘డీల్’ వల్ల దేశ ప్రయోజనాలకు నష్టమనీ భారత రక్షణశాఖ ఉన్నతాధికారులు లిఖితపూర్వకంగా పీఎంఓ కు తమ అభ్యంతరాలను తెలియజేసారు. ఈ ‘నోట్‌ఫైల్’ను బహిర్గతం చేస్తూ ‘ది హిందూ’ కథనం వెలువడటంతో ‘మోడీ గారడీ’ గుట్టంతా రట్టయ్యింది.
*ఇప్పటికే ప్రధానమంత్రి ఫ్రాన్స్‌లో మన రక్షణమంత్రికి కూడా తెలియకుండా ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించడం అనేక అనుమానాలకు తెరలేపింది. ఆ ప్రకటించిన బృందంలో అనిల్ అంబానీ కీలకంగా ఉండటం, ఒప్పందంలో భారత రక్షణరంగ సంస్థయిన ‘హెచ్‌ఏఎల్’ స్థానంలో అంబానీకి చెందిన ‘రిలయన్స్ డిఫెన్స్’ వచ్చి చేరడం ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చింది. దీనికితోడు యుధ్ధ విమానాల ధరను ఏకంగా 300 రెట్లు పెంచేయడం, భారత వాయుసేన కోరిన 126 యుధ్ధవిమానాలకు బదులు ఆ సంఖ్యను 36కు కుదించడంతో వీటన్నిటి వెనుక ఆశ్రిత పక్షపాతం, అవినీతి కుంభకోణాలు దాగున్నాయన్న ఆరోపణలు పెల్లుబికాయి*.ఈ ఆరోపణలన్నిటినీ ఈ ఉదంతం దృవీకరించినట్టైంది. ప్రధానే బాధ్యత వహించి, సభలో స్వయంగా సమాధానం చెప్పాలంటున్న విపక్షాల డిమాండ్‌కు మరింత బలం చేకూరింది.
ఇప్పుడు భారత రక్షణశాఖ బృందాన్ని కాదని ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా రహస్య చర్చలు సాగించిందన్నది రుజువైంది. ఇది నిస్సందేహంగా సమాంతర చర్చేననీ డిఫెన్స్ నోట్‌ఫైల్ స్పష్టం చేస్తున్నది. ఈ సమాంతర చర్చ ముమ్మాటికీ అక్రమం, అనైతికం, అవాంఛనీయం. *ఇది మన రక్షణశాఖ సంప్రదింపుల బృందాన్ని డమ్మీ చేయటమే కాదు, దేశ ప్రయోజనాలనూ వమ్ము చేసింది. రూ: 50వేల కోట్ల ఈ ఒప్పందంలో ఫ్రెంచి ప్రభుత్వ హామీ లేదా కనీసం దస్సాల్ట్ కంపెనీ తరుపున బ్యాంకు గ్యారంటీ అయినా ఇవ్వాలన్న రక్షణశాఖ వాదన వీగిపోయింది. ఎందుకంటే ఇవేవీ అక్కర్లేదని ప్రధాని కార్యాలయం చెప్పింది. అంతేకాదు హెచ్‌ఏఎల్ స్థానంలో రిలయన్స్ డిఫెన్స్‌ను సూచించింది కూడా భారత ప్రభుత్వమేనన్న అప్పటి ఫ్రాన్స్ అధక్షుడైన హౌలండ్ ప్రకటన కూడా ఈ సందర్భంలో గమనార్హం!*
ఈ విషయంలో ఇప్పటి వరకూ ప్రధాని, ప్రభుత్వం చెప్పినవన్నీ పచ్చి అబద్దాలేనని తెలిపోయింది. ఒక అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్దం. ఇలా ఈ అబద్దాల పరంపరలో ఆఖరికి మన అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించారు. ఈ ఒప్పందంలో నిర్ణయాలన్నీ సంప్రదింపుల బృందమే తీసుకున్నదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కోర్టుకు ఇచ్చిన సమాచారంలో ఎక్కడా పీఎంఓ జోక్యం గురించి కానీ, రక్షణశాఖ అభ్యంతరాల గురించి కానీ ప్రస్తావించలేదు. ఇది కోర్టును పక్కదారి పట్టించడమే కాదు, ధిక్కరణ కూడా! ఇంత జరిగినా ఇప్పటికీ ప్రభుత్వం దాటవేత దోరణే ప్రదర్శిస్తుండటం విచారకరం! కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదివారం హైద్రాబాద్‌లో ఈ విషయమై పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ దేశ రక్షణతో ఆటలాడొద్దంటూ విమర్శకులను హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం. నిజానికి దేశ రక్షణతో ఆటలాడుతున్నదెవరు!?