కాలుష్య కారక పరిశ్రమలు, ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు…?
కాలుష్యాన్ని వెదజల్లుతూ, ప్రజలకు ఇబ్బందిగా మారిన కాలుష్య కారక పరిశ్రమలు, ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అటవీ,పర్యావరణ,దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం అర్యణ భవన్ లో అటవీ, పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి, బయో డైవర్సిటీ, టీఎస్ కాస్ట్, టి.ఎస్.ఎఫ్.డి.సి, ఈపీటీఆర్ఐ, టి.ఎస్.ఎన్.జి.సి. అదికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా, అటవీ అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్, ఎండీ రఘువీర్, పీసీబీ మెంబర్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, EPTRI ఎండీ కళ్యాణ చక్రవర్తి, బయో డైవర్సిటీ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శిల్పి శర్మ, టీఎస్ కాస్ట్ పీడీ శ్రీనివాస్, ఎన్జిసీ, తదితర శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… కాలుష్యాన్ని వెదజల్లి,ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి పరిశ్రమలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
*పర్యావరణ పరిరక్షణకు సీయం కేసీఆర్ కృషి*
పర్యావరణ పరిరక్షణకు సీయం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో కాలుష్యం కోరలు చాస్తుందని, తెలంగాణ అలాంటి పరిస్థితులు రాకుండా వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు. జీవకోటి ప్రాణాధారం నీరు. అది పుష్కలంగా ఉండాలంటే పర్యావరణ సమతుల్యం తప్పనిసరి . ఇది చెట్లు ద్వారానే సాధ్యమని తెలిసిన వ్యక్తి సీయం కేసీఆర్ అని ఆయన అన్నారు. సీయం కేసీఅర్ ఆలోచనలకు అనుగుణంగా అధికారుల అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
*దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి చర్యలు*
తెలంగాణలోని అన్ని ఆలయాల్లో కూడా ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.ప్లాస్టిక్ కు ప్రత్యమ్నాయంగా జూట్, క్లాత్ బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధం ఉన్న విచ్చల విడిగా ప్లాస్టిక్ బ్యాగులను కంపనీలు తయారు చేస్తున్నాయని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్రలోని ముంబాయిలో ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేదించారని, అదే తరహాలో ప్లాస్టిక్ రహిత తెలంగాణగా మార్చేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా దీన్ని సామాజిక భాద్యతగా తీసుకోవాలన్నారు. తెలంగాణలోని అన్ని ఆలయాల్లో కూడా ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
*కాలం చెల్లిన వాహనాలకు చెక్..!*
కాలం చెల్లిన వాహనాల నుంచి వచ్చే కర్భన ఉద్గారాల కారణంగా స్వచ్ఛమైన గాలి కలుషితమవుతోందని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కాలం తీరిన వాహనాలకు చెల్లు చీటీ పాడాలని అన్నారు. కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టేందుకు నిరంతరం కాలుష్య ప్రమాణ తనఖీలు నిర్వహించాలని, వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అంతేకాకుండా కాలుష్యాన్ని వెదజల్లుతూ, ప్రజలకు ఇబ్బందిగా మారిన కాలుష్య కారక పరిశ్రమలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాయు కాలుష్యంపై అధ్యయనం చేసి నివేదికలు అందించాలని ఆదేశించారు.
– రైతులకు ఉపయోగపడేలా బార్క్ టెక్నాలజీ సహాయంతో బియ్యం,కూరగాయలను ప్రాసెస్ చేయడం, ప్రజలకు వాటి ధరలను అందుబాటు ఉండేలా పరిశోధనలు చేయాలని సూచించారు.
– వాతావరణ మార్పులకు సంబంధించి ఖచ్చితమైన సమచారం ఇచ్చే విధంగా EPTRI పరిశోధనలు చేయాలి.
– ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్ట్ లకు త్వరితగతిన అనుమతులు ఇచ్చే విధంగా అధికారులు కృషి చేయాలి.
– బొటానికల్ గార్డన్ లో తీవ్ర నీటి సమస్య ఉంది. దానికి ప్రత్యమ్నాయ మార్గాలను చూసి చెట్లు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శాశ్వత పరిష్కారాన్ని వెతకాలి.
-అమీన్ పూర్ చెరువును పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి.