తల్లీ… నీ పాదాలకు వందనం…
తల్లీ… నీ పాదాలకు వందనం…
అమ్మ అన్న పదమే అమృతం… సృష్టికి ప్రతి సృష్టి చేసి దేవత అమ్మ… అమ్మతనంలో మాధుర్యం నిర్వచనీయం. విమానంలో పాలు లేక ఏడుస్తున్న ఓ పురిటి బిడ్డకు తన పాలు పట్టించి అమ్మతనానికి ప్రతికగా నిలిచింది పత్రిషా అనే ఎయిర్ హోస్టెస్. నిన్న విమానంలో ఓ పసికందు గుక్కపెట్టి ఏడుస్తుండగా విమానంలో అందరి దృష్టి ఆ బిడ్డపై పడింది. ఎంతకూ ఆ బిడ్డ ఏడుపు ఆగకపోతుంటే ఆ బిడ్డ ఏడుపు చూసి కన్నతల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ దశలో ఎయిర్ హోస్టెస్ పత్రిషా తల్లి వద్దకు వెళ్ళి బిడ్డకు పాలు పట్టించమని సలహా ఇచ్చింది. అయితే తనకు పాలు పడవని బిడ్డకు ఫార్ములా పాలు ఇస్తున్నానని, ఆ పాలు ఇప్పుడు లేవని చెప్పడంతో … మరో ఆలోచన లేకుండా ఎయిర్ హోస్టెస్ పత్రిషా వెంటనే ఆ బిడ్డును తన ఒడిలోకి తీసుకుని పాలు పట్టించింది. రొమ్ము నోట్లో పడడంతో బిడ్డ పాలు తాగుతూ ఏడుపు ఆపేసింది. పాలు తాగుతూ ఆ బిడ్డ ఆదమరిచి నిద్రపోయింది. ఎయిర్ హోస్టెస్ చేసిన పని గొప్పది కాకపోయినా అమ్మతనంలోని కారుణ్యానికి మమతానురాగాలకు అదొక ప్రతీక. ఎవరి బిడ్డ అయినా పాల కోసం ఏడిస్తే ఏ తల్లికైనా కర్ణ కఠోరమే. అది వారిలోని మాతృత్వపు మమకారాన్ని తట్టిలేపుతుంది. అమ్మతనం అంటే అదే. విమానం ఆగడంతోనే ప్రయాణీకులందరూ ఎయిర్ హోస్టెస్ ను అభినందనలతో ముంచెత్తారు. కొందరైతే ఆమె పాదాలకు నమస్కరించారు. ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్ లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచంలోనే మమతానురాగాలకు తల్లిగా పత్రిషా ప్రశంసలందుకుంటోంది.