గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో….
గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో….
గ్యాస్ ఆఫ్ చేయడంలో నిర్లక్ష్యం కారణం…
చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వివరాలు.. భార్య పిల్లలతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి స్థానికంగా నివాసముంటున్నాడు. శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో వాళ్లింట్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డితో సహా అతని భార్యాపిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని స్థానికులు తెలిపారు.
కాగా, గ్యాస్ ఆఫ్ చేయడంలో నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకైంది గ్రహించక ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేయడంతో ఈ ప్రమాదం జరగొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో శ్రీనివాసులురెడ్డి, బుజ్మమ్మ, నితిన్, భవ్య నిద్రలోనే ప్రాణాలొదిలారని పోలీసులు వెల్లడించారు. ఇదిలాఉండగా.. శ్రీనివాస్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండడంతో.. ఘటనకు సంబంధించి ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, శ్రీనివాస్‌రెడ్డికి ఎవరితో విభేదాలు లేవని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అతనికి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోవడంతో రాజులకండ్రిగలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.