లో షుగర్ తో ఎక్కువ డేంజర్…
రక్తంలో గ్లూకోజు స్థాయులు ఎక్కువగా ఉండటం కన్నా ఉండాల్సిన దాని కన్నా తక్కువగా ఉంటే కలిగే నష్టమే ఎక్కువ. ఇది ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. మధుమేహుల్లో ఆరో వంతు మరణాలకు హైపోగ్లైసీమియానే కారణమవుతోంది. కాబట్టి హైపోగ్లైసీమియా తలెత్తకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. గ్లూకోజు స్థాయులు 70 మిగ్రా/డీఎల్ కన్నా తగ్గితే హైపోగ్లైసీమియా వస్తోందనే అర్థం. ఇక గ్లూకోజు 50 మిగ్రా/డీఎల్‌కు పడిపోతే హైపోగ్లైసీమియాకు చేరుకున్నట్టే. అప్పుడు శరీరంలో ‘అడ్రినెర్జిక్ హైపర్‌యాక్టివిటీ’ తలెత్తుతుంది. అంటే గ్లూకోజుకు ప్రత్యామ్నాయంగా శరీరానికి శక్తిని అందించటం కోసం ఎడ్రినలిన్, నార్ అడ్రినలిన్, కార్టిజోల్ వంటి హార్మోన్లు పుట్టుకొస్తాయి. ఇవి శక్తి కోసం పిండి పదార్థాన్ని కాకుండా మాంసకృత్తులు, కొవ్వులను వాడుకుంటాయి. దీంతో అసిటోన్ వంటి కీటోన్స్ పెద్దమొత్తంలో విడుదలవుతాయి. ఇవి ఎక్కువసేపు కొనసాగితే తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. ఇక గ్లూకోజు 30 మిగ్రా/డీఎల్ కన్నా పడిపోతే ఈ ప్రత్యామ్నాయ శక్తి కూడా అందుబాటులో ఉండదు. అప్పుడు మెదడు కూడా పనిచేయటం మానేస్తుంది (న్యూరో గ్లైకోపీనియా). దీంతో కోమాలోకి వెళ్లిపోతారు. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రక్తంలో ఆక్సిజన్ గణనీయంగా పడిపోయి అవయవాలు శాశ్వతంగా దెబ్బతినొచ్చు. ఇది ప్రాణాంతక స్థితి. అందుకే హైపోగ్లైసీమియా నివారణకు మార్గదర్శకాల్లో ప్రముఖంగా ప్రాధాన్యం కల్పించారు.
మామూలుగా హైపోగ్లైసీమియాలో చేతులు వణకటం, అరచేతుల్లో చెమట్లు పట్టటం, కళ్లు తిరగటం, స్పృహ తప్పుతున్నట్టు అనిపించటం వంటి హెచ్చరిక సంకేతాలు కనబడతాయి. కానీ అడ్రినెర్జిక్ హైపర్‌యాక్టివిటీకి శరీరం స్పందించకపోవటం వల్ల మధుమేహుల్లో చాలామంది ఇలాంటి హెచ్చరిక సంకేతాలు లేకుండానే హైపోగ్లైసీమియా నుంచి న్యూరో గ్లైకోపీనియాకు చేరుకుంటుంటారు. కాబట్టి తరచుగా రక్తపరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. గ్లూకోజు స్థాయులు 70 మిగ్రా/డీఎల్ ఉన్నట్టయితే త్వరలోనే హైపో గ్లైసీమియాకు చేరుకునే ప్రమాదముంది.