గెలిచిన మ్యాచ్‌లో కోహ్లికి భారీ ఫైన్…
ఐపీఎల్‌లో ఎట్టకేలకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ఏడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఆరు వరుస పరాజయాల తర్వాత కోహ్లి పట్టుదల, డివిలియర్స్ మెరుపులు.. రాయల్ చాలెంజర్స్‌కు తొలి విజయాన్ని అందించాయి. బౌలర్లు కాస్త రాణించడం.. బ్యాటింగ్‌లో టాపార్డర్ దుమ్మురేపడం.. ఆఖర్లో స్టొయినిస్ ధనాధన్ బ్యాటింగ్.. అన్ని కలిసొచ్చి.. పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై విజయాన్ని అందుకుంది. అయితే, ఏడో మ్యాచ్‌లో ఎట్టకేలకు గెలిచినప్పటికీ.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఒకింత చేదు వార్త ఇది. ఈ మ్యాచ్‌లో బెంగళూరులో స్లో ఓవర్‌రేట్‌కు కారణమయ్యారు. మినిమమ్ ఓవర్ రేట్‌ను బెంగళూరు బౌలర్లు పాటించకపోవడంతో జట్టు కెప్టెన్ కోహ్లిపై రూ. 12 లక్షల జరిమానా పడింది. ఈ సీజన్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను బెంగళూరు జట్టు ఉల్లంఘించడం ఇదే తొలిసారి.
శనివారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ జట్టు 8 వికెట్లతో పంజాబ్‌పై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (64 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. చహల్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కోహ్లి (53 బంతుల్లో 67; 8 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (38 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో అదరగొట్టారు.