చంద్రబాబుపై కన్నాలక్ష్మి నారాయణ తీవ్ర విమర్శలు…

చంద్రబాబుపై కన్నాలక్ష్మి నారాయణ తీవ్ర విమర్శలు…

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత రెండేళ్లుగా సీఎం మానసిక వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. గుంటూరులోని తన నివాసంలో కన్నా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు ఏదో జరగబోతుందని తనంతట తానే ఊహించుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా దోచేసిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశం మొత్తం చక్రంలాగా తిరిగి వచ్చిన ఆయన చక్రం తిప్పుతున్నానని ఫీలవుతున్నారని, చంద్రబాబు శాలువాలు కప్పిన వారంతా ఎన్డీయే వ్యతిరేకులేనని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని ఉత్తర్వులు విడుదల చేయటం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి వ్యవహారంలో విచారణ జరిగితే ముఖ్యమంత్రి బండారం బయటపడుతుందనే భయంతో ఉత్తర్వులతో సీబీఐని అడ్డుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పారిపోయివచ్చారని కన్నా వ్యాఖ్యానించారు.
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తే చంద్రబాబు వ్యతిరేకించారని.. తుని ఘటనలో కాపులపైనా, ముద్రగడపైనా టీడీపీ ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీసీ నాయకులను రెచ్చగొట్టి కాపులపై దాడులు చేయించారని.. బీసీలకు అన్యాయం జరక్కుండా కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని కన్నా తెలిపారు.
కడప స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్‌లను కేంద్రప్రభుత్వం ఇవ్వడం లేదని తెలుగుదేశం అనుకూల మీడియా రాస్తోందని.. ఇది సరైనది కాదని కన్నా పేర్కొన్నారు.. జోన్ కచ్చితంగా ఇస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంగా తెలిపారన్నారు. హోదాపై అనేక సార్లు ముఖ్యమంత్రి మాట మార్చారని.. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.40 ఏళ్ల అనుభవాన్ని చంద్రబాబు అవినీతి చేయడానికే ఉపయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు..బాబు స్థాయికి ప్రధాని మోడీ అవసరం లేదని.. తాను చాలునని రాష్ట్రాభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. హిందుత్వంపై ముఖ్యమంత్రి దాడికి దిగుతున్నారని.. దీనిలో భాగంగానే శివస్వామిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

About The Author