ముంగిట్లోకి సేవలు..‘మీ సేవ 2.0’ వెర్షన్లో ఇంటి నుంచే దరఖాస్తు…
ఎవరైనారిజిస్టర్ చేసుకోవచ్చుఅమల్లోకి తెచ్చిన ఐటీశాఖ
రాష్ట్రంలో పౌరసేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఐటీశాఖ ‘మీసేవ 2.0’ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి ప్రజలు ‘మీసేవ’ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునేందుకు ఇందులో వీలు కల్పించింది. ఇప్పటికే ‘టీ-యాప్ ఫోలియో’ ద్వారా పలు సేవలు అందుబాటులోకి తెచ్చిన ఐటీశాఖ తాజాగా 2.0 వెబ్‌వెర్షన్ ద్వారా ప్రజలు, విద్యార్థులకు తరచూ అవసరమయ్యే 37 ప్రభుత్వ-పౌర సేవలను ఇంటినుంచే పొందే వెసులుబాటు కల్పిస్తోంది. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్లు, ఈసీ, పురపాలక సంబంధిత సేవలన్నీ నూతన వెర్షన్ ద్వారా పొందవచ్చు. మీసేవ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ పోర్టల్‌లో 2.0 సిటిజన్ సర్వీసెస్‌ను ఎంచుకుని పూర్తివివరాలతో రిజిస్టర్ చేసుకుంటే అవసరమైన పౌరసేవలు పొందేందుకు అర్హత లభిస్తుంది.*
తేడా ఏమిటి
ప్రస్తుతం ఉన్న విధానంలో మీసేవ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నారు. 2.0 వెర్షన్లో ఇంటినుంచే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికెట్ మంజూరైతే ఆ నంబరును చూపించి, మీసేవ కేంద్రాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త విధానంలో మరో ప్రయోజనం ఏమిటంటే దరఖాస్తు రుసుము విషయంలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. అభ్యర్థి రెండోసారి ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసినపుడు, అవసరమైన అదనపు పత్రాలు స్కాన్‌చేసి అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. మిగతా సేవలకు సాధారణ ఆన్‌లైన్ దరఖాస్తులో వివరాలు నమోదు చేసి, సంబంధిత పత్రాలను స్కాన్ చేయాల్సి ఉంటుంది. పౌరసేవలు పొందేందుకు ఫీజులను ఆన్‌లైన్లో చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తులో ఏమైనా సందేహాలుంటే పరిష్కారంకోసం కాల్‌సెంటర్ (1100 లేదా 18004251110) నంబర్లలో సంప్రదించవచ్చు. 9121006471 లేదా 9121006472 నంబర్లకు వాట్సాప్ చేయవచ్చు.
రెవెన్యూ సేవల్లో సమస్యలు
మీసేవ ద్వారా దరఖాస్తు చేసినా, రెవెన్యూ సేవలు పొందడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. కాగిత రూపంలో దరఖాస్తులను అందిస్తేనే వాటిని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు మీసేవ కేంద్రాల నిర్వాహకులకు మండల రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే సరైన కారణం లేకుండా వాటిని తిరస్కరిస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఫీజు నష్టపోతున్నారు. మీసేవ ద్వారా ఈ-దరఖాస్తు చేసినపుడు, కాగిత రూపంలో దరఖాస్తులు తీసుకోవద్దని మీసేవ డైరెక్టర్ పలుమార్లు సీసీఎల్‌ఏకు లేఖలు రాశారు. దరఖాస్తుల్లో వరుసక్రమం పాటించడం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ రెవెన్యూ కార్యాలయాల్లో పాతపద్ధతినే అనుసరిస్తున్నారు. తాజాగా ‘మీసేవ 2.0’ వెర్షన్ ద్వారా దరఖాస్తు చేసిన వారి పట్ల ఎలా వ్యవహరిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.*