భాగవతం 7 వ భాగం :-
అటువంటి భాగవతమును శుకబ్రహ్మ ప్రవచనం చేశారు.
పెద్దలు అంటారు –
’నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవసంయుతం!
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః!!’
భాగవతమును వినేవాళ్ళు ’భాగవతమును నేను వింటున్నాను” అని ఎప్పుడూ వినకూడదు. ’పిబత భాగవతం’ – భాగవతమును తాగేసెయ్యి. కానీ ఇదెలా సాధ్యం? భాగవతమును తాగడం ఎలా కుదురుతుంది? తాగడమును నోరు అనబడే ఇంద్రియం చెయ్యాలి. వినడం అనబడే దానిని చెవి అనే ఇంద్రియం చెయ్యాలి.కాని చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది. నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉన్నదనుకోండి – అయినా నోరు ఆ పదార్థమును తీసుకొని కడుపులోకి పంపించివేస్తుంది. ఒకవేళ ఆ పాలలో ఒక చీమ వున్నారు నోరు పుచ్చుకోను అనదు. పుచ్చేసుకుంటుంది. తాగేసే పదార్థంలొ సాధారణంగా మీరు తీసిపారేసేది ఏదీ ఉండదు. భాగవతము కూదా అటువంటిదే. దీనిలో తీసిపారవేయవలసినది ఏదీ ఉండదు. భాగవతము నందు ఉన్నవాడు ఒక్కడే! భాగవతంలో భగవంతుడు శబ్దరూపముగా వస్తున్నాడు. దానిని నీవు చెవులతో పట్టి తాగేసెయ్యి. విడిచిపెట్టావంటే జారి క్రిందపడిపోతుంది. ఏమిటి దాని గొప్పతనం?
వేదములనే కల్పవృక్షం ఒకటి ఉన్నది. వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమయిన కోర్కెలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖల చిట్టచివర పండు పండింది. వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధము చేస్తాయి. ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరిభాగములలో పండిన పండు ఉపనిషత్తులచేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపము ఈవేళ పండుగా పండింది. దీనిని చిలక కొట్టింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తననోటిద్వారా ప్రవచనం చేశారు. దేనిమీదా అపేక్షలేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని ఆ భాగవతమును తాగేసెయ్యి. ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది. భూమియందు నీవు భావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే. అందుకని ఈ భాగవతం అంత గొప్పది.
ఇటువంటి భాగవతమును సంస్కృతంలో మహానుభావుడు వ్యాసమహర్షి ద్వాదశ స్కంధములలో ప్రవచనం చేశారు. దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాత్యులవారు. పోతనగారిలో మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మనకి ముగ్గురు రాజులు ఉన్నారు.వారిలో ఒకరు త్యాగరాజు, ఒకరు పోతురాజు, ఒకరు గోపరాజు. వీరి ముగ్గురిపేర్లలో రాచరికం ఉంది. వీరు ముగ్గురూ భగవంతుని సేవించారు. సేవించి ఈ దిక్కుమాలిన రాచరికం వద్దు అని తీసి అవతల పారేశారు. పిమ్మట గోపరాజుగారు సాక్షాత్తుగా రామదాసుగారు అయిపోయారు. త్యాగరాజుగారేమో త్యాగయ్య అయ్యారు. పోతరాజుగారు పోతన్న అయ్యారు. ముగ్గురూ రాచరికాలను తీసి అవతలపారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు ముగ్గురూ జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు . . . ✍